వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్, వైద్యాధికారులు
భూపాలపల్లి అర్బన్ : ప్రభుత్వ వైద్యశాలలంటే దేవుడి గుడిలా భావించేలా వైద్యులు ప్రజలకు వైద్య సేవలందించాలని కలెక్టర్ అమయ్‌కుమార్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 25 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీ కేంద్రాల్లో వైద్యుల పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం కలిగించే పని చేయాలన్నారు. వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో గర్భిణుల వివరాలను సేకరించి తేదీలవారీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని, వారిని కలిసి ఆరోగ్య స్థితిని తెలుసుకొని ఎప్పటికప్పుడు వైద్యసేవలందించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధునాతన వైద్య పరికరాలను ఏఏ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలో నివేదిక సమర్పించాలని, వైద్య పోస్టుల ఖాళీల వివరాలను తెలియజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ–ఔషధి పథకంలో వచ్చే మందుల వివరాలు ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేసి నివేదికగా అందించాలన్నారు. ప్రాథమిక కేంద్రాల్లో ఎక్కువ సమయం పని చేస్తే ప్రసవాల సంఖ్య పెరుగుతుందని, వైద్యులు పనిచేసే సెంటర్ల పరిధిలోనే నివాసం ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వైద్యులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మధుసూదన్, క్రాంతికుమార్, ఆస్పత్రి సూపరింటెండెట్లు వాసుదేవరెడ్డి, గోపాల్, రవిప్రవీణ్, ప్రోగ్రాం ఆఫీసర్ శృతి, రవీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment