► రూ.వెయ్యి ఇస్తేనే చేస్తామన్న వైద్యులు
► ఎస్పీ జోక్యంతో రూ.450 ఇచ్చేలా ఒప్పందం
సూర్యాపేట క్రైం : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారు 410 మంది అభ్యర్థులు ఎంపికకాగా గురువారం నుంచి ఆదివారం వరకు నిర్వహించే ఈ వైద్య పరీక్షలకు మొదటి రోజు 100 మంది హాజరయ్యారు. ముందుగా అభ్యర్థుల వివరాలు, బ్లడ్ సేకరించిన వైద్యులు ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు లేకపోవడంతో.. ప్రయివేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి రూ.వెయ్యి ఖర్చవుతుందని తెలపడంతో అభ్యర్థులు ఒక్కసారిగా కంగుతిన్నారు. రూ.వెయ్యి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న ఎస్పీ పరిమళహన నూతన్ వెంటనే వైద్యులతో మాట్లాడారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.350కే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. దీంతో వైద్యులు ఇక్కడ ఆస్పత్రిలో ఎక్స్‌రే, కంటి చూపుకు సంబంధించిన సౌకర్యాలు లేవని చెప్పారు. సౌకర్యాలు ఉన్నా.. లేకున్నా.. అభ్యర్థులకు అన్ని పరీక్షలను కేవలం రూ.450తోనే చేయాలని చెప్పారు. దీంతో వైద్యులు అంగీకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐలు మొగిలయ్య, విజయ్‌కుమార్, ఎస్‌ఐ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.