హుజూర్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్: తెలంగాణలో సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐపీఎస్‌లలో సమర్థులకు, నిజాయితీపరులకు పోస్టింగ్‌లు ఇవ్వటం లేదన్నారు. సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ లాంటి వారికి జిల్లాల బాధ్యతలు ఇస్తున్నారని విమర్శించారు. శనివారం ఉత్తమ్ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో 115 మంది ఐపీఎస్ అధికారులు ఉంటే.. 45 మందికి పోస్టింగులు ఇవ్వలేదని ఆరోపించారు.
డైరెక్ట్ ఐపీఎస్ అధికారులను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రమోటీ ఆఫీసర్లకు కీలక స్థానాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారని చెప్పారు. ఎస్‌ఐ నుంచి ప్రమోట్ అయిన వారికి ఐపీఎస్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారని, ఒకటి రెండు సార్లు సస్పెండ్ అయిన వారిని కూడా ఐపీఎస్‌లుగా నియమించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చిల్లర పనులు చేయలేదని, పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు కాళ్లు మొక్కడం, ఎస్పీలు నినాదాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇసుక, మద్యం, గుట్కా, మట్టి, పేకాట, రేషన్ బియ్యం దందాకు ఎస్పీ అండగా ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి టీఆర్‌ఎస్, బీజేపీలకు ఏమి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. రజాకార్లపై పోరాటం చేసిన వారిని స్వాతంత్య్ర సమరయోధులగా గుర్తించి, వారికి పింఛన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఉత్తమ్ పేర్కొన్నారు. ఐదారు నెలల్లో టీఆర్‌ఎస్ భూ స్థాపితం కావడం ఖాయమని, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తిరిగి కెనడా పోయే సమయం ఆసన్నమైందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment