మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి
♦ 101 మీటర్ల ఎత్తులో 240 హెక్టార్ల ముంపు నిర్ధారణ
♦ మహారాష్ట్ర అధికారులతో సీఎంఓ సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ముంపుపై తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల అధికారుల ఉమ్మడి సర్వే కొలిక్కి వచ్చింది. మొత్తంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 101 మీటర్ల ఎత్తులో మహారాష్ట్ర ప్రాంతంలో 240 హెక్టార్ల ముంపు ఉంటుందని ఈ సర్వేలో తేలింది. అధికారికంగా నిర్ణయించిన ముంపు ప్రాంతం చాలా తక్కువగా ఉన్నందున 101 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం మహారాష్ట్రని కోరనుంది. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే తమ్మిడిహెట్టి ఎత్తుపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య అవగాహ న కుదిరింది.
148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకారం తెలి పింది. అయితే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డపై మాత్రం తేలలేదు. కిందటిసారి అధికారుల స్థాయిలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, జాయింట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు అంగీకరిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా సర్వే చేసిన అధికారులు 102 మీటర్ల నుంచి వివిధ ఎత్తులో ఉండే ముంపును తే ల్చారు. 102 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 399 హెక్టా ర్లు, 101.5 మీటర్ల ఎత్తులో 315 హెక్టార్లు, 101 మీటర్ల ఎత్తులో 240హెక్టార్లు, 100 మీటర్ల ఎత్తులో 83 హెక్టార్ల ముంపును నిర్ధారించారు. ఇందులో 101.5మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున ఈ ఎత్తులను పరిశీలించాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఒకవేళ 101.5 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తే బ్యారేజీ నిల్వ సామర్థ్యం 21.75 టీఎంసీలు ఉండనుండగా, 101 మీటర్లకు పరిమితమైతే అది 19.73 టీఎంసీలుగా ఉండనుంది.
త్వరలో ఒప్పందాలు
మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి రావడం, తమ్మిడిహెట్టిపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలపై ఈ నెలాఖరులోగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఒప్పందం జరిగే అవకాశాలున్నాయి. అధికారుల స్థాయిలో కసరత్తు ముగిసిన దృష్ట్యా, ముఖ్యమంత్రుల స్థాయిలో ఏర్పా టైన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర సీఎం సమయం ఇచ్చిన వెంటనే ఒప్పందాల ప్రక్రియ ముగించి, మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.