సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు రాక ఆటోలు, క్యాబ్‌ల గిరాకీపైనా ప్రభావం చూపిస్తోంది. రెండు రోజులుగా వీరు ప్రయాణికులు తగ్గి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోజూ వచ్చే ఆదాయం ఇప్పుడు సగానికి పడిపోయింది. మరోవైపు మీటర్లు వేయకుండా నిలువు దోపిడీకి పాల్పడే ఆటో రిక్షాల నుంచి కొంత మేరకు ఊరట లభించిందని ప్రయాణికులు భావిస్తున్నారు. సిటీలో సుమారు 1.4 లక్షల ఆటోలుండగా, ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి మార్గాల్లో ఆటో ప్రయాణాలపైన మెట్రో ప్రభావం పడింది. నిబంధనల మేరకు మీటర్ రీడింగ్ ప్రకారం చార్జీలు వసూలు చేసే ఆటోడ్రైవర్‌లు మాత్రం మెట్రో రాక నష్టంగానే భావిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే నాగోల్–మియాపూర్ మార్గంలోనే మెట్రో అందుబాటులోకి రావడంతో క్యాబ్‌లపైన ప్రభావం స్పష్టంగానే ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలకు అనుసంధానం చేసి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్‌లు, యజమానులకు మెట్రో ఎఫెక్ట్ అశనిపాతమే. మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో, తార్నాక, సికింద్రాబాద్, అమీర్‌పేట్, మియాపూర్ మార్గంలో మెట్రో ప్రభావం వల్ల ట్రిప్పులు తగ్గుముఖం పట్టినట్లు క్యాబ్ డ్రైవర్‌లు చెబుతున్నారు.
మూడో రోజూ అదే జోరు...
మెట్రో జోష్ జర్నీ మూడోరోజూ అదే స్థాయిలో కొనసాగింది. శుక్రవారం కూడా మెట్రో రైళ్లలో సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో రైళ్లలో 2 లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. కాగా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ లేమి, స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆర్టీసీ ఫీడర్ బస్సులు లేకపోవడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయాలు ఊపందుకున్నాయి. గత నాలుగు రోజులుగా సుమారు 25 వేల స్మార్ట్‌కార్డులను విక్రయించినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్‌కార్డులతో సాఫీగా ప్రయాణించవచ్చని పేర్కొంది. కాగా స్టేషన్లలో స్మార్ట్‌కార్డుల రీచార్జీకి అవసరమైన సాఫ్ట్‌వేర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని.. అప్పటివరకు పేటీఎం ద్వారా రీచార్జీ చేసుకోవాలని సూచించాయి.
గిరాకీ తగ్గింది...
మెట్రో రైలు రాకతో గిరాకీలు తగ్గాయి. గతంలో రోజుకు రూ.1200–1500ల వరకు వచ్చేది. మెట్రోతో దూర ప్రయాణం చేసేవారు ఆటోల వైపు చూడడం తగ్గింది. దీంతో ఆదాయం 600–800లకు పడిపోయింది. అసలే కిరాయి ఆటో. రోజుకు రూ.300లు చెల్లించాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
– పి.నరేశ్, ఆటోడ్రైవర్, సనత్‌నగర్
మూలిగే నక్కపై తాటిపండులా..
ఇప్పటికే ఫైనాన్సర్‌ల వేధింపులు, అప్పుల బాధలతో రోడ్డున పడ్డ మాకు మెట్రో రాకతో మరిన్ని కష్టాలు వచ్చాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవాళ్లు తప్ప సిటీలో తిరిగే వాళ్లు తగ్గిపోయారు. ఒక్క ఎయిర్‌పోర్టు మార్గంలోనే లక్షల వాహనాలు తిరగలేవు కదా. ట్రిప్పు లు గణనీయంగా తగ్గాయి. మూలిగే నక్కపై తాటిపండులా ఉంది మా పరిస్థితి.
– శివ, అధ్యక్షుడు, తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు, యజమానుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment