మెట్రో రికార్డ్
నగర ‘మెట్రో’ ప్రాజెక్ట్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 20 నెలల వ్యవధిలోనే వెయ్యి వయాడక్ట్ స్పాన్ (రెండు పిల్లర్ల మధ్య సెగ్మెంట్లతో ఏర్పాటు చేసే బ్రిడ్జి)ల నిర్మాణం పూర్తి చేసుకుని భారత నిర్మాణ రంగ చరిత్రలో సరికొత్త శకానికి నాంది పలికింది. నగరంలో మూడు కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో 1000 వయాడక్ట్ స్పాన్‌లు పూర్తవడంతో 27 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం పూర్తయింది. హబ్సిగూడ జెన్‌ప్యాక్ కంపెనీ వద్ద 2012 డిసెంబర్‌లో తొలి వయాడక్ట్ స్పాన్ నిర్మాణం చేపట్టారు.
ఆదివారం ఎస్‌ఆర్‌నగర్ బస్టాప్ వద్ద 1000వ వయాడక్ట్‌స్పాన్ నిర్మాణం పూర్తిచేశారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మెట్రో ప్రాజెక్టులకంటే నగర మెట్రో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ రికార్డు రుజువు చేసింది. 11 కిలోమీటర్ల మెట్రో వయాడక్ట్ స్పాన్ పూర్తి చేయడానికి ముంబైలో ఏడేళ్లు, 25 కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తికి చెన్నై, బెంగళూరు నగరాల్లో ఐదేళ్ల సమయం పట్టినట్లు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. కాగా, తక్కువ కాలంలో ఈ ఘనత సాధించిన హెచ్‌ఎంఆర్, ఎల్ అండ్ టీ సంస్థ ఇంజనీర్లను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
- హైదరాబాద్, సాక్షి