కదలనున్న కలల రైలు
సెప్టెంబర్15 నుంచి ట్రయల్ రన్
నగరవాసుల కలల మెట్రో రైలు ఉప్పల్ డిపోలో పట్టాలెక్కింది. త్వరలో నాగోల్-మెట్టుగూడ రూట్లో ఎలివేటెడ్ మార్గంలో రాకపోకలు సాగించనుంది. దక్షిణ కొరియాలోని హ్యుండాయ్ రోటెమ్ కంపెనీ తయారుచేసిన4 అధునాతన మెట్రో రైళ్లు ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి. హెచ్‌ఎంఆర్, ఎల్ అండ్ టీ అధికారులు ఆదివారం వీటిని పరిశీలించారు. సెప్టెంబర్ 15 నుంచే ట్రయల్న్ ్రనిర్వహిస్తామన్నారు. మరో మూడు రైళ్లు కొరియా నుంచి త్వరలో నగరానికి రానున్నాయి. ఈ ఏడు రైళ్లను నాగోల్-మెట్టుగూడ మార్గంలో వచ్చే ఏడాదిమార్చి 21 నుంచి నడపనున్నామని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇవి ప్రారంభంలో ప్రతి పది నిమిషాలకోమారు అందుబాటులో ఉంటాయి. కాగా గడువులోగా మెట్రో రైళ్లు సిటీకి చేరుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులను అభినందించారు.
- సాక్షి, హైదరాబాద్
ఆద్యంతం ఆసక్తికరం
దక్షిణ కొరియా నుంచి భారీ నౌక ద్వారా చెన్నై పోర్టుకు.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ‘మల్టీవీల్డ్ రోడ్ ట్రయలర్స్(భారీ ట్రక్కు)’ద్వారా ఉప్పల్ మెట్రో డిపోకు మెట్రో రైళ్లను తరలించారు. పదిరోజుల పాటు రోడ్డు మార్గం గుండా ప్రయాణించిన 3 రైళ్లు మార్గమధ్యంలో అన్ని వర్గాలనూ ఆకర్షించాయి. ఎట్టకేలకు సురక్షితంగా శనివారం రాత్రి ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి.
మెట్రోకు తప్పని పరీక్షలు..
ఈ మెట్రోరైళ్లను ముందుగా ఉప్పల్ మెట్రో డిపోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో రెండు మూడు రోజుల్లో ప్రయోగాత్మకంగా నడిపి చూడనున్నారు. ఆ తరవాత దక్షిణ మధ్య రైల్వే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు భద్రత(సేఫ్టీ) సర్టిఫికెట్ జారీ చేసిన అనంతరమే నాగోల్-మెట్టుగూడ ఎలివేటెడ్ మార్గంలో ఇవి రాకపోకలు సాగించనున్నాయి.
బోగీ ఖర్చు రూ.10 కోట్లు
ఒక్కో బోగీ తయారీ ఖర్చు సుమారు పదికోట్లు. అగ్నిప్రమాదం సంభవించినా నాశనం కాని ఇన్వార్‌స్టీల్ వంటి మెటీరియల్‌తో వీటిని తయారు చేశారు. రైలు తయారీకి హ్యుండాయ్ రోటెమ్ కంపెనీ 20 నుంచి 24 నెలల సమయం తీసుకుంటుంది. ప్రారంభంలో మన నగర మెట్రో రైలుకు 3 బోగీలు, ఆ తర్వాత 6 బోగీలుంటాయి.
57 రైళ్లు.. 171 బోగీలు..
ఇక మూడు కారిడార్ల పరిధిలో 2017 జూన్‌నాటికి పూర్తికానున్న మెట్రో మార్గంలో మొత్తం 57 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఒక్కో రైలుకు మూడు చొప్పున 171 బోగీలకు హ్యుండాయ్ రోటెమ్ కంపెనీకి ఆర్డరిచ్చారు. మొత్తం బోగీల తయారీ ఖర్చు రూ.1800 కోట్లు.
బోగీలో ఏమేం ఉంటాయంటే..
వికలాంగులు కూర్చునేందుకు సీట్లుంటాయి. వీల్‌చైర్ ద్వారా నేరుగా బోగీలోకి చేరుకోవచ్చు. ఎల్‌సీడీ టీవీల్లో నిరంతరాయంగా వినోద కార్యక్రమాలుంటాయి. తెరపై రైలు ప్రయాణించే మార్గం కనిపిస్తుంది. బోగీలో అగ్నిప్రమాదాలను ముందే పసిగట్టే ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ సిస్టం ఉంటుంది. ప్రతి స్టేషన్ రాగానే అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. ఏసీ, కుదుపుల్లేని ప్రయాణం మెట్రో సొంతం. సెల్‌ఫోన్,ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. రైలు బ్రేకు వేసినపుడు వెలువడే శక్తి ద్వారా బోగీకి అవసరమైన పవర్‌ను 30 శాతం తయారు చేసుకోవచ్చు.
వెయ్యి మంది ప్రయాణికులకు..
ఒక్కో బోగీలో 330 మంది చొప్పున ఒక్కో రైలులో వెయ్యి మంది ప్రయాణించవచ్చు. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం(సీబీటీసీ) వ్యవస్థ ఆధారంగా ఇవి రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రైలు రాకపోకలు ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ వ్యవస్థ నుంచే నియంత్రిస్తారు. అంటే ఏ మార్గంలో ఏ రైలు ఎప్పుడు వెళ్లాలి. ఏ స్టేషన్‌లో ఎంతసేపు ఆగాలన్న అంశాలన్నమాట. కాగా మెట్రో రైలులో డ్రైవర్ ఉన్నప్పటికీ అతని పని కేవలం రైలు ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ నొక్కడమే.