వీక్‌లో కేక... మెట్రోకు డిమాండ్ల కాక | Hyderabad Metro rail demand on weekends | Sakshi
Sakshi News home page

వీక్‌లో కేక... మెట్రోకు డిమాండ్ల కాక

Published Wed, Dec 6 2017 9:56 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

Hyderabad Metro rail demand on weekends - Sakshi

నగర వాసుల కలల మెట్రో రైలు జర్నీ ప్రారంభమై వారం గడిచింది. లక్షలాది మంది సిటీజనులు నాగోల్‌–అమీర్‌పేట, అమీర్‌పేట– మియాపూర్‌ మార్గంలో జాయ్‌ రైడ్‌  చేశారు. వారమంతా దాదాపు ప్రతిరోజూ రైళ్లు కిక్కిరిసి నడిచాయి. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు. ఇక మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్, టాయిలెట్ల వంటి మౌలిక వసతులు సరిగా  లేక విమర్శలు తలెత్తాయి.    – సాక్షి, సిటీబ్యూరో

కలల మెట్రో రైలు పట్టాలెక్కి వారం రోజులు..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు పట్టాలెక్కి వారం రోజులైంది. లక్షలాదిమంది సిటీజన్లు నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో కుటుంబ సభ్యు లతో కలిసి జాయ్‌రైడ్స్‌ చేసి ఆనందించారు. శని, ఆదివారాల్లో రద్దీ రెండు లక్షల మంది..మిగతా రోజుల్లో లక్ష నుంచి లక్షన్నర మంది ప్రయాణికులు మెట్రో జర్నీ చేశారు. మొత్తం వారంలో  దాదాపు 9 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. లక్షా 50 వేల మెట్రో స్మార్టు కార్డులు విక్రయించారు. భవిష్యత్‌లోనూ మెట్రోరైళ్లకు ఇదే రీతిలో విశేష ఆదరణ ఉంటుందన్న  విషయం ప్రస్తుత రద్దీని బట్టిచూస్తే అవగతమౌతోంది. అయితే మొత్తం 30 కి.మీ మార్గంలోని 24 స్టేషన్ల వద్ద ఇప్పటిరవకు పార్కింగ్‌ సదుపాయం ఉన్న స్టేషన్లు ఐదు మాత్రమే కావడం గమనార్హం.

మిగతా 19  స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్య జఠిలంగా మారడంతో వ్యక్తిగత వాహనాలతో స్టేషన్లకు వచ్చినవారికి అగచాట్లు తప్పడంలేదు. సమీప కాలనీల నుంచి మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు  ఆర్టీసీ ఫీడర్‌ బస్సులు అరకొరగానే నడుస్తుండడంతో సిటీజన్లు గగ్గోలుపెడుతున్నారు. ఇక స్టేషన్లకు లక్షలాదిమంది ప్రయాణికులు ఒకేసారిగా తరలివస్తే రద్దీ నియంత్రణ కష్టత రమౌతోంది. స్టేషన్లలో మంచినీటి వసతి అసలే లేకపోవడం, టాయిలెట్‌ వసతులు అరకొరగానే ఉండడం..అదీ పెయిడ్‌ విధానం కావడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  ఇక టోకెన్లు, స్మార్ట్‌కార్డుల కొనుగోలు, వాటి రీఛార్జి వంటి అంశాలపై ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడంలేదు. ఈనేపథ్యంలో వారంలో మెట్రో  నేర్పిన పాఠాలు..అధికారులు నేర్వాల్సిన గుణపాఠాలు..తక్షణం తీసుకోవాల్సిన చర్యలు..పబ్లిక్‌ డిమాండ్స్‌ ఇలా ఉన్నాయి. .  

తక్షణం పార్కింగ్‌ పరేషాన్‌ పరిష్కరించాలి
మొత్తం 24 స్టేషన్లకుగాను మియాపూర్, రసూల్‌పురా, సికింద్రాబాద్‌ పాత జీహెచ్‌ఎంసీ కార్యాలయం, నాగోల్‌ మెట్రో డిపో, చాలిస్‌ మకాన్‌(అమీర్‌పేట్‌)లో మాత్రమే పార్కింగ్‌ వసతి ఉంది. మరో 7 చోట్ల  పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని సిటీజన్లు కోరుతున్నారు. పార్కింగ్‌ ఫీజులు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు.

ఫీడర్‌బస్సుల సంఖ్యను పెంచాలి
ప్రస్తుతం 30 కి.మీ మెట్రో కారిడార్‌లో సమీప కాలనీలకు ఆర్టీసీ కేవలం 50 ఫీడర్‌బస్సులను 10 రూట్లలో మాత్రమే నడుపుతోంది. ప్రతీ స్టేషన్‌ నుంచి 25 బస్సులు నిరంతరం సమీప కాలనీలు,  బస్తీలకు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రైళ్ల సంఖ్యను పెంచాల్సిందే
నాగోల్‌–అమీర్‌పేట్‌(17కి.మీ), మియాపూర్‌–అమీర్‌పేట్‌(13 కి.మీ) మార్గంలో ప్రస్తుతం 7 చొప్పున మొత్తంగా 14 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక రద్దీ నేపథ్యంలో వీటి సంఖ్యను  పదికి పెంచాలన్నది పబ్లిక్‌ డిమాండ్‌. ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ 10–15 నిమిషాలుగా ఉంది. దీన్ని 5 నిమిషాలకు తగ్గించాలని కోరుకుంటున్నారు.

రద్దీ నియంత్రణ
శని, ఆదివారాల్లో మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్‌ను తలపిస్తున్నాయి. వేలాదిగా పిల్లాపాపలతో స్టేషన్లకు తరలివస్తున్నారు. రద్దీ నియంత్రణకు పోలీసు శాఖ సహకారంతో తొక్కిసలాట జరగకుండా స్టేషన్లలోనికి,  ప్లాట్‌ఫారం పైకి, బోగీల్లోకి వెళ్లే సమయంలో క్యూపద్దతి, బార్‌కేడింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

స్మార్ట్‌కార్డు, మొబైల్‌యాప్‌
మెట్రో స్మార్ట్‌కార్డు ప్రస్తుతానికి మెట్రో జర్నీకే ఉపయుక్తం. దీని ద్వారా షాపింగ్, ఇంధన అవసరాలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఇలా 16 రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ  కార్డు ద్వారా అందే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన టి–సవారీ యాప్‌ ఉపయోగాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నారు.

టోకెన్ల తకరారు
స్టేషన్లలో టిక్కెట్‌ విక్రయ యంత్రాల వద్ద పాతనోట్లను యంత్రాలు తిరస్కరిస్తున్నాయి. టికెట్‌కు సరిపడా చిల్లర లభించక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. వీటి వినియోగంపైనా జర్నీచేసే వారికున్న అపోహలను మెట్రో అధికారులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

మంచినీరు, టాయిలెట్స్‌ నిల్‌
మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు దాహార్తిని తీర్చుకునే అవకాశం లేక విలవిల్లాడుతున్నారు. ప్రతీ స్టేషన్‌లో స్వచ్ఛమైన తాగునీటిని మెట్రో అధికారులు అందించాల్సిన అవసరం ఉంది. ఇక స్టేషన  ్లలో ఉన్న పే అండ్‌ యూజ్‌ టాయిలెట్లు..అదీ అరకొరగానే ఉండడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. తక్షణం స్టేషన్‌ రెండు చివరలా అత్యధికులు ఉపయోగించుకునేలా ఉచిత టాƇు ులెట్లు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.

ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్‌ఫర్నీచర్, హరితవాతావరణం
ఇక ప్రతీ స్టేషన్‌ వద్ద తీరైన ఫుట్‌పాత్‌లు, బస్‌లు, ఆటో, క్యాబ్‌లు నిలిపేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటుచేస్తామన్న అధికారుల మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. పలుస్టేషన్ల వద్ద ప్రధాన  రహదారులు ఇరుకుగా మారాయి. ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్‌ఫర్నీచర్‌ ఏర్పాటు, హరితవాతావరణం ఏర్పాటుచేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను తక్షణం పూర్తిచేయాలని కోరుకుంటున్నారు.

అమ్మో సైకిల్‌స్టేషన్లు...
ప్రస్తుతానికి మియాపూర్‌ మెట్రోడిపోవద్దనే ఈ సదుపాయం ఉంది. మరిన్ని స్టేషన్లకు ఈ సదుపాయం కల్పించాలని..సైక్లింగ్‌ క్లబ్‌లో ప్రవేశించేందుకు సభ్యత్వ రుసుము, సైకిల్‌ అద్దె కూడా  సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఏ రోజు ఎంత మంది...
తేదీ                     ప్రయాణికులు
29 నవంబర్‌           2.0 లక్షలు
30                      1.20 లక్షలు
1 డిసెంబర్‌           1.50 లక్షలు
2                       2.10 లక్షలు
3                      2.40 లక్షలు
4                     1.20 లక్షలు
5                     1.02 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement