CBTC
-
పొల్యూషన్.. సిగ్నల్‌లో కన్ఫ్యూజన్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే రెండు ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటివరకున్న మంచిపేరు. ఫ్రాన్స్.. లండన్.. సింగపూర్ వంటి విశ్వనగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, ధూళికాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లలో రెడ్‌లైట్లు ఆన్ అవుతున్నాయి. దీంతో కొన్ని సార్లు మెట్రో రైళ్లు ఉన్న ఫళంగా నిలిచిపోతున్నాయి. అంతేకాదు గంటకు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కిలోమీటర్లకు పడిపోతోంది. తాజాగా మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఇదే దుస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్‌సిగ్నల్స్ ఒకేసారి ఆన్ అయ్యాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోగా.. రైళ్ల వేగం 25 కేఎంపీహెచ్‌కు పడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య ఇలా.. వాతావరణ మార్పులతో పాటు.. ట్రాఫిక్ రద్దీలో కొన్ని రోజుల్లో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాల్లో 100 మైక్రోగ్రాములను మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారి మెట్రో రూట్లలో ఏర్పాటుచేసిన రెడ్‌సిగ్నల్స్ ఆన్ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వాయు కాలుష్యం పెరిగిన ప్రతిసారీ రెడ్‌లైట్లు ఆన్ అవుతుండటంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్ మోడ్ (నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి రావడం.. చాలాసార్లు రైళ్ల వేగం 60 నుంచి 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. సీబీటీసీ సాంకేతికత అత్యాధునికమైనదేకాదు.. ఇది అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా.. హైదరాబాద్‌లో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఈ సాంకేతికతను తయారు చేసిన థేల్స్(ఫ్రాన్స్)కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. మెట్రో జర్నీలో సాంకేతిక ఇబ్బందులివే.. ► టికెట్ వెండింగ్ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించట్లేదు. ► 4 పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలో పెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతున్నాయి. ► స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద స్మార్ట్ కార్డులను స్వైప్‌చేస్తే కొన్ని సార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ► ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతీ రూట్లో ప్రతి 6 నిమిషాలకో రైలు అని ప్రకటించినా సమయం కొన్ని సార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది. ► పార్కింగ్ లాట్ వద్ద బైక్‌లకు నెలవారీ పాస్ వెల రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుము అధికంగా ఉండటంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్ లాట్లకు దూరంగా ఉంటున్నారు. ► మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. ► మెట్రో గమనంలో సడెన్బ్రేక్లు వేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
కదలనున్న కలల రైలు
సెప్టెంబర్15 నుంచి ట్రయల్ రన్ నగరవాసుల కలల మెట్రో రైలు ఉప్పల్ డిపోలో పట్టాలెక్కింది. త్వరలో నాగోల్-మెట్టుగూడ రూట్లో ఎలివేటెడ్ మార్గంలో రాకపోకలు సాగించనుంది. దక్షిణ కొరియాలోని హ్యుండాయ్ రోటెమ్ కంపెనీ తయారుచేసిన4 అధునాతన మెట్రో రైళ్లు ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి. హెచ్ఎంఆర్, ఎల్ అండ్ టీ అధికారులు ఆదివారం వీటిని పరిశీలించారు. సెప్టెంబర్ 15 నుంచే ట్రయల్న్ ్రనిర్వహిస్తామన్నారు. మరో మూడు రైళ్లు కొరియా నుంచి త్వరలో నగరానికి రానున్నాయి. ఈ ఏడు రైళ్లను నాగోల్-మెట్టుగూడ మార్గంలో వచ్చే ఏడాదిమార్చి 21 నుంచి నడపనున్నామని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇవి ప్రారంభంలో ప్రతి పది నిమిషాలకోమారు అందుబాటులో ఉంటాయి. కాగా గడువులోగా మెట్రో రైళ్లు సిటీకి చేరుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులను అభినందించారు. - సాక్షి, హైదరాబాద్ ఆద్యంతం ఆసక్తికరం దక్షిణ కొరియా నుంచి భారీ నౌక ద్వారా చెన్నై పోర్టుకు.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ‘మల్టీవీల్డ్ రోడ్ ట్రయలర్స్(భారీ ట్రక్కు)’ద్వారా ఉప్పల్ మెట్రో డిపోకు మెట్రో రైళ్లను తరలించారు. పదిరోజుల పాటు రోడ్డు మార్గం గుండా ప్రయాణించిన 3 రైళ్లు మార్గమధ్యంలో అన్ని వర్గాలనూ ఆకర్షించాయి. ఎట్టకేలకు సురక్షితంగా శనివారం రాత్రి ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి. మెట్రోకు తప్పని పరీక్షలు.. ఈ మెట్రోరైళ్లను ముందుగా ఉప్పల్ మెట్రో డిపోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో రెండు మూడు రోజుల్లో ప్రయోగాత్మకంగా నడిపి చూడనున్నారు. ఆ తరవాత దక్షిణ మధ్య రైల్వే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు భద్రత(సేఫ్టీ) సర్టిఫికెట్ జారీ చేసిన అనంతరమే నాగోల్-మెట్టుగూడ ఎలివేటెడ్ మార్గంలో ఇవి రాకపోకలు సాగించనున్నాయి. బోగీ ఖర్చు రూ.10 కోట్లు ఒక్కో బోగీ తయారీ ఖర్చు సుమారు పదికోట్లు. అగ్నిప్రమాదం సంభవించినా నాశనం కాని ఇన్వార్స్టీల్ వంటి మెటీరియల్‌తో వీటిని తయారు చేశారు. రైలు తయారీకి హ్యుండాయ్ రోటెమ్ కంపెనీ 20 నుంచి 24 నెలల సమయం తీసుకుంటుంది. ప్రారంభంలో మన నగర మెట్రో రైలుకు 3 బోగీలు, ఆ తర్వాత 6 బోగీలుంటాయి. 57 రైళ్లు.. 171 బోగీలు.. ఇక మూడు కారిడార్ల పరిధిలో 2017 జూన్‌నాటికి పూర్తికానున్న మెట్రో మార్గంలో మొత్తం 57 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఒక్కో రైలుకు మూడు చొప్పున 171 బోగీలకు హ్యుండాయ్ రోటెమ్ కంపెనీకి ఆర్డరిచ్చారు. మొత్తం బోగీల తయారీ ఖర్చు రూ.1800 కోట్లు. బోగీలో ఏమేం ఉంటాయంటే.. వికలాంగులు కూర్చునేందుకు సీట్లుంటాయి. వీల్‌చైర్ ద్వారా నేరుగా బోగీలోకి చేరుకోవచ్చు. ఎల్సీడీ టీవీల్లో నిరంతరాయంగా వినోద కార్యక్రమాలుంటాయి. తెరపై రైలు ప్రయాణించే మార్గం కనిపిస్తుంది. బోగీలో అగ్నిప్రమాదాలను ముందే పసిగట్టే ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ సిస్టం ఉంటుంది. ప్రతి స్టేషన్ రాగానే అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఏసీ, కుదుపుల్లేని ప్రయాణం మెట్రో సొంతం. సెల్‌ఫోన్,ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. రైలు బ్రేకు వేసినపుడు వెలువడే శక్తి ద్వారా బోగీకి అవసరమైన పవర్‌ను 30 శాతం తయారు చేసుకోవచ్చు. వెయ్యి మంది ప్రయాణికులకు.. ఒక్కో బోగీలో 330 మంది చొప్పున ఒక్కో రైలులో వెయ్యి మంది ప్రయాణించవచ్చు. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం(సీబీటీసీ) వ్యవస్థ ఆధారంగా ఇవి రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రైలు రాకపోకలు ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ వ్యవస్థ నుంచే నియంత్రిస్తారు. అంటే ఏ మార్గంలో ఏ రైలు ఎప్పుడు వెళ్లాలి. ఏ స్టేషన్లో ఎంతసేపు ఆగాలన్న అంశాలన్నమాట. కాగా మెట్రో రైలులో డ్రైవర్ ఉన్నప్పటికీ అతని పని కేవలం రైలు ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ నొక్కడమే.