పొల్యూషన్‌.. సిగ్నల్‌లో కన్ఫ్యూజన్‌ | Glitch in signalling delays Metro train | Sakshi
Sakshi News home page

పొల్యూషన్‌.. సిగ్నల్‌లో కన్ఫ్యూజన్‌

Published Thu, Jun 13 2019 4:27 AM | Last Updated on Thu, Jun 13 2019 4:27 AM

Glitch in signalling delays Metro train - Sakshi

రెడ్‌ సిగ్నల్‌ పడి మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల పడిగాపులు

సాక్షి, హైదరాబాద్‌: డ్రైవర్‌ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే రెండు ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ (సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటివరకున్న మంచిపేరు. ఫ్రాన్స్‌.. లండన్‌.. సింగపూర్‌ వంటి విశ్వనగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లో మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. ట్రాఫిక్‌ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, ధూళికాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లలో రెడ్‌లైట్లు ఆన్‌ అవుతున్నాయి. దీంతో కొన్ని సార్లు మెట్రో రైళ్లు ఉన్న ఫళంగా నిలిచిపోతున్నాయి. అంతేకాదు గంటకు 60 కేఎంపీహెచ్‌ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కిలోమీటర్లకు పడిపోతోంది. తాజాగా మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్‌లో ఇదే దుస్థితి తలెత్తింది. ఈ రూట్‌లో 25 రెడ్‌సిగ్నల్స్‌ ఒకేసారి ఆన్‌ అయ్యాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోగా.. రైళ్ల వేగం 25 కేఎంపీహెచ్‌కు పడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్‌ చేయాల్సి వచ్చింది.

సాంకేతిక సమస్య ఇలా..
వాతావరణ మార్పులతో పాటు.. ట్రాఫిక్‌ రద్దీలో కొన్ని రోజుల్లో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాల్లో 100 మైక్రోగ్రాములను మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారి మెట్రో రూట్లలో ఏర్పాటుచేసిన రెడ్‌సిగ్నల్స్‌ ఆన్‌ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వాయు కాలుష్యం పెరిగిన ప్రతిసారీ రెడ్‌లైట్లు ఆన్‌ అవుతుండటంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్‌ మోడ్‌ (నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి రావడం.. చాలాసార్లు రైళ్ల వేగం 60 నుంచి 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. సీబీటీసీ సాంకేతికత అత్యాధునికమైనదేకాదు.. ఇది అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా.. హైదరాబాద్‌లో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్‌ఎంఆర్‌ అధికారులు ఈ సాంకేతికతను తయారు చేసిన థేల్స్‌(ఫ్రాన్స్‌)కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం గమనార్హం.

మెట్రో జర్నీలో సాంకేతిక ఇబ్బందులివే..
► టికెట్‌ వెండింగ్‌ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించట్లేదు.
► 4 పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలో పెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతున్నాయి.
► స్టేషన్‌ మధ్యభాగంలో ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద స్మార్ట్‌ కార్డులను స్వైప్‌చేస్తే కొన్ని సార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి.
► ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్‌ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్‌ చేసిన తర్వాతే అనుమతిస్తుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
► మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతీ రూట్లో ప్రతి 6 నిమిషాలకో రైలు అని ప్రకటించినా సమయం కొన్ని సార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది.
► పార్కింగ్‌ లాట్‌ వద్ద బైక్‌లకు నెలవారీ పాస్‌ వెల రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుము అధికంగా ఉండటంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్‌ లాట్‌లకు దూరంగా ఉంటున్నారు.
► మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్‌ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి.
► మెట్రో గమనంలో సడెన్‌బ్రేక్‌లు వేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement