
హైదరాబాద్ మెట్రో రైల్ వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం 30 కేఎంపీహెచ్ (కిలోమీటర్ పర్ అవర్)తో పరుగులు తీస్తోన్న రైలు ఇకపై60 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకోనుంది. ఇప్పుడు నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు తిరుగుతుండగా దీన్ని8 నిమిషాలకు తగ్గించనున్నారు. మియాపూర్– అమీర్‌పేట్ రూట్‌లో ప్రతి 8 నిమిషాలకో రైలు పరుగులు పెడుతుండగా ఈ మార్గంలో రైళ్లఫ్రీక్వెన్సీ ఆరు నిమిషాలకు తగ్గించనున్నారు. ఈ రెండు మార్గాల్లో రైళ్ల సంఖ్యను సైతం 16కు పెంచనున్నట్లు సమాచారం.
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్ల వేగం కనిష్టంగా ఉండడం, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిబంధనలు ప్రతిబంధకంగా మారడంతో ప్రయాణ సమయం 45–50 నిమిషాలు పడుతోంది. అయితే ఫ్రీక్వెన్సీ, వేగం పెరిగితే ప్రయాణ సమయం 25 నిమిషాలకు తగ్గే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గంలో ప్రయాణానికి 25 నిమిషాల సమయం పడుతోంది. రైళ్ల వేగం, ప్రీక్వెన్సీ పెరిగితే ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గుతుంది. దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలుపై ఈ నెలలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లలో రోజుకు సరాసరి 60 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పండగలు, సెలవు దినాల్లో రద్దీ 75 వేల నుంచి లక్ష వరకు ఉంటోంది.
జూన్‌లో ఆ రెండు రూట్లలో డౌటే..?
అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో ఈ ఏడాది జూన్ నాటికి మెట్రో రైళ్లను అందుబాటులోకి తేవాలని మెట్రో వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ.. స్టేషన్ల నిర్మాణం, ట్రయల్ రన్ వంటి సాంకేతిక కారణాలతో మరో రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఇక జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో సుల్తాన్ బజార్‌లో ఆస్తుల సేకరణ ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో ఈ రూట్లో డిసెంబర్ నాటికి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ఇటీవలే లైన్ క్లియర్ కావడంతో ఈ రూట్లో 2020 నాటికే పాతనగరానికి మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
మెట్రో సబ్‌స్టేషన్లు రెడీ
ఎల్బీనగర్–గాంధీభవన్ మార్గంలో మెట్రో స్టేషన్లు, రూటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్(సీఈఐజీ) డీవీఎస్‌రాజు గురువారం తనిఖీ చేశారు. ఎల్బీనగర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీభవన్ మెట్రో స్టేషన్లను పరిశీలించారు. విద్యుదీకరణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్, ఆటోమేటిక్ టిక్కెట్ కలెక్షన్ యంత్రాల ఏర్పాటు, ఆయా వ్యవస్థల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మార్గంలోని మెట్రో స్టేషన్లకు ఎంజీబీఎస్ వద్దనున్న రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. ఈ పనులు పూర్తితో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు సంబంధించిన పనులు తుదిదశకు చేరుకున్నట్లు డీవీఎస్‌రాజు తెలిపారు. ఆయన వెంట పి.శ్రీనివాసమూర్తి, ఆనంద తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment