
సాక్షి,సిటీబ్యూరో: జేఎన్‌టీయూ–గచ్చిబౌలి(17 కి.మీ)మార్గంలో మోనోరైలు ప్రాజెక్టు కంటే మెట్రో రైలు ఏర్పాటే బెస్ట్ అని టీఎస్‌ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో కాదనుకుంటే ఎలివేటెడ్ మార్గం లో బస్‌ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్‌టీఎస్)ఏర్పాటు చేస్తేనే మేలని టీఎస్‌ఐఐసీ తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ రూట్లో మోనో రైల్ మార్గం ఏర్పాటుపై అధ్య యనం చేయాలని టీఎస్‌ఐఐసీకి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ నివేదిక సమర్పించింది. ప్రధానంగా మోనో రైల్‌లో జర్నీ చేసే ప్రయాణికుల సామర్థ్యం కంటే మెట్రో రైలు లేదా బీఆర్‌టీఎస్ మార్గం ఏర్పాటు చేస్తేనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాకు రాకపోకలు సాగించే ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుందని తాజా నివేదికలో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే బీహెచ్‌ఈఎల్–లక్డీకాపూల్(29 కి.మీ), గచ్చిబౌలి–శంషాబాద్(22 కి.మీ)మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనా..నిధుల కొరత నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టు ఎప్పటికి సాధ్యపడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
జేఎన్‌టీయూ–గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా మెట్రో రూటు ఇలా..
ఈ మార్గంలో మొత్తంగా 17 కి.మీ మార్గంలో మెట్రో రైలు లేదా ఎలివేటెడ్ మార్గంలో బస్‌ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్‌టీఎస్)ఏర్పాటుచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని టీఎస్‌ఐఐసీ తాజా నివేదికలో పేర్కొంది. జేఎన్‌టీయూ–మియాపూర్–హైటెక్స్–కొత్తగూడ–కొండాపూర్–గచ్చిబౌలి రూట్లో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
బీహెచ్‌ఈఎల్–లక్డీకాపూల్ మెట్రో మార్గం ఇదీ..
బీహెచ్‌ఈఎల్ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్ సిద్ధమైంది. ఈ మార్గం మొత్తంగా 29 కి.మీ ఉంటుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్)లతోపాటు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. బీహెచ్‌ఈఎల్ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్ మీదుగా ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్ మీదుగా లక్డీకాపూల్ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది. ఇక మియాపూర్ నుంచి ఆల్విన్ కాలనీ వరకు కూడా మియాపూర్ ప్రధాన స్టేషన్ నుంచి బీహెచ్‌ఈఎల్ లైనును అనుసంధానించేందుకు వీలుగా మియాపూర్ నుంచి ఆల్విన్ కాలనీ వరకు దాదాపు రెండు కిలో మీటర్ల మేర కొత్త లైను నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ కొత్త లైను పూర్తి చేస్తే బీహెచ్‌ఈఎల్ స్టేషన్‌లో ఎక్కిన ప్రయాణికుడు మియాపూర్ మీదుగా ఎల్బీనగర్ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు స్టేషన్‌ను మెట్రో జంక్షన్ స్టేషన్‌గా మార్చబోతున్నారు. బీహెచ్‌ఈఎల్ నుంచి ఒక వైపు ఎల్బీనగర్ వరకు, మరోవైపు గచ్చిబౌలి వరకు వెళ్లేలా రెండు రూట్లు ఏర్పడతాయి.
గచ్చిబౌలి–శంషాబాద్ మెట్రో రూటు ఇదీ..
గచ్చిబౌలి–రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిర్మించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. కాగా ఈరూట్లో గచ్చిబౌలి–రాయదుర్గం–బయోడైవర్సిటీ జంక్షన్–ఖాజాగూడా–తెలంగాణా పోలీస్ అకాడమీ–రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటుచేయనున్నారు. ఈ మార్గంలో బుద్వేల్ లేదా శంషాబాద్ ప్రాంతాల్లో 60 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో ఏర్పాటు కోసం కేటాయించనున్నారు. ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు విలువైన సమయం ఆదా కానుంది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు రెండోదశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..
కాగా ప్రస్తుతం రెండోదశ ప్రాజెక్టుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినప్పటికీ గతంలో మరో ఐదు మార్గాల్లో రెండోదశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఈ కింది మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమౌతుండడం గమనార్హం.
1.ఎల్బీనగర్–హయత్‌నగర్
2.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
3.మియాపూర్–పటాన్‌చెరు
4.తార్నాక–ఈసీఐఎల్
5.జేబీఎస్– మౌలాలి
Comments
Please login to add a commentAdd a comment