- హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థలకు లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెట్రో ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ సంస్థలకు తాజాగా లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఏడాది మార్చి 21న ప్రారంభంకానున్న నాగోల్-మెట్టుగూడ మార్గంతోపాటు మరో మూడు రూట్లలో మెట్రో పనులు జరుగుతున్న విషయం విదితమే.
సాధారణ ఉద్యోగాలైన టికెట్ విక్రయదారులు, సూపర్‌వైజర్స్, అనౌన్స్‌మెంట్, కార్యాలయాలు, స్టేషన్ల నిర్వహణ వంటి సాధారణ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. మెట్రో ప్రాజెక్టు పూర్తై ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వీటితో పాటు 65 కారిడార్లలలో ఉండే మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసే దుకాణ సముదాయాలు, మెట్రో డిపోలు, పార్కింగ్, సర్క్యులేషన్ ఏరియాలు, మెట్రో మాల్స్‌లలో మరో 50 నుంచి 75 వేల మందికి అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ తమకు లేఖ రాసిన విషయాన్ని ఇటు హెచ్‌ఎంఆర్, అటు ఎల్‌అండ్‌టీ సంస్థల ఉన్నతాధికారులు ధ్రువీకరించ లేదు.