ముఠాలు 25.. నేరస్తులు 100 మంది | Mevat criminal gangs Frequently attacking on the city | Sakshi
Sakshi News home page

ముఠాలు..25 నేరస్తులు 100 మంది

Published Mon, Dec 24 2018 2:08 AM | Last Updated on Mon, Dec 24 2018 10:31 AM

Mevat criminal gangs Frequently attacking on the city - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆలీ బాబా నలభై దొంగల’కథ మనం పాఠ్యాంశాల్లో చదివి ఉంటాము గానీ..వాస్తవంగా ఓ పాతిక ముఠాలు..వందమంది నేరస్తుల బృందం పలు నగరాల పోలీసులకు, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా జేస్తున్నాయి.రాజస్తాన్‌లోని అల్వార్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, హరియాణాలోని నుహ్‌ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ‘మేవాట్‌’ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నేరస్తులు దేశవ్యాప్తంగా పలుచోట్ల నేరాలకు పాల్పడుతుంటారు. ఐదు పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న 35 గ్రామాల్లో 100 మందికి పైగా నేరచరితులే ఉన్నారు. వీరి నేతృత్వంలో 25 ముఠాలు పని చేస్తున్నాయి. దాదాపు యువత మొత్తం నేరాలనే తమ జీవనాధారంగా మార్చుకుంది. ఒకప్పుడు దోపిడీలు, బందిపోటు దొంగతనాలు వంటి ‘హార్డ్‌వేర్‌’క్రైమ్‌ చేసిన ఈ గ్యాంగ్స్‌... ఆ తర్వాతి కాలంలో ‘సాఫ్ట్‌ దగాలు’మొదలెట్టి సైబర్‌ నేరాలు, ఏటీఎం ఫ్రాడ్స్‌ చేస్తున్నాయి. ఏటీఎంలను ఏమారుస్తూ గత వారం దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడిన ముఠా సైతం మేవాట్‌ రీజియన్‌కు చెందినదే. మేవాట్‌ తెగకు చెందిన పేదల్లో అధికులు నేరగాళ్లుగానే చెలామణి అవుతున్నారు. వీరు తమ ప్రాంతంలో ‘ప్రవృత్తి’జోలికిపోకుండా తమ సొంత వృత్తుల్నే కొనసాగిస్తారు. వేరే ప్రాంతాల్లో నేరం చేసిన తర్వాత కొంతకాలం పాటు స్వస్థలానికి వెళ్లి అక్కడే ఉంటారు. వీరిని స్థానికంగా పట్టుకోవడం కష్టసాధ్యం. గతంలో ఈ పనిమీదే వెళ్లిన రాజస్తాన్‌కు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్‌ను జీపుతో సహా వీరు సజీవదహనం చేశారు. అందుకే పోలీసులు కూడా ఆ ప్రాంతం నుంచి వాళ్లు బయటకు వచ్చే వరకు ఆగి కాపుకాసి పట్టుకుంటుంటారు.  

ఆరు రోజుల్లో నాలుగు దోపిడీలు... 
మేడ్చెల్‌లోని హనుమాన్‌ జ్యువెలర్స్‌లో 2011లో దోపిడీ యత్నం చేసిన దుండగులు కాల్పులకు సైతం తెగబడ్డారు. మేవాట్‌ తెగకు చెందిన ఆరిఫ్, మరో 12 మందితో ముఠా కట్టి ఈ నేరం చేశాడు. ఈ గ్యాంగ్‌ ఆ ఏడాది మార్చిలో కేవలం ఆరు రోజుల్లోనే నాలుగు నేరాలు చేసింది. ఆపై ఎస్‌ఓటీ పోలీసులు ఈ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రెండు నాటు తుపాకులు, 10 తూటాలు, 3 డాగర్లు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 14న హనుమాన్‌ జ్యువెలరీస్‌లో దోపిడీకి యత్నమే ఆఖరి నేరం. ఈ గ్యాంగ్‌కు చెందిన వారిని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అదే ఏడాది ఏప్రిల్‌ 3న పట్టుకున్నారు. 

ఈ–కామర్స్‌ సైట్స్‌ ఆధారంగా..
మేవాట్‌ ముఠాలు గడిచిన రెండేళ్లుగా తమ పంథాను మార్చేశాయి. వీరిలో కొందరు చదువుకున్న వారు చేరడంతో ‘హార్డ్‌’దందాలు వదిలేసి ‘సాఫ్ట్‌’మార్గాలు పట్టాయి. ఓఎల్‌ఎక్స్‌ తదితర ఈ–కామర్స్‌ సైట్స్‌ను అడ్డాగా చేసుకుని బోగస్‌ వివరాలతో రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. ఆపై వాటిలో కొన్ని కార్ల ఫొటోలు పోస్ట్‌ చేసి తక్కువ ధరకు అమ్ముతామంటూ ఎర వేస్తున్నారు. అనేక సందర్భాల్లో సైన్యం పేరిట, కొన్నిసార్లు వారే ఆ వస్త్రధారణతో ఫొటోలు పెట్టి, ఆయా వాహనాలు కొంటామంటూ ఆసక్తి చూపిన వారి నుంచి అడ్వాన్స్‌గా డబ్బు డిపాజిట్‌ చేయించుకుని నిండా ముంచుతున్నారు.  

ఏటీఎం కేంద్రంగా తాజా పంథా...
దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఈ నెల 17న చిక్కిన మేవాట్‌ ముఠా వీటన్నింటికీ మించిపోయింది. ఐదుగురు సభ్యుల గ్యాంగ్‌ పెద్ద స్కెచ్‌ వేసుకునే నగరంలోకి దిగింది. ఎంజీబీఎస్‌ సమీపంలోని ఓ లాడ్జిలో బస చేసిన ముఠా సభ్యులు, తమ వెంట పరిచయస్తులు, స్నేహితులు, బంధువుల ఏటీఎం కార్డులు తెచ్చుకున్నారు. వీటిని వినియోగించి డబ్బు డ్రా చేస్తూ చిన్న టెక్నిక్‌ ద్వారా ఏటీఎం మిషన్‌ను ఏమార్చారు. ఫలితంగా డబ్బు డ్రా కానట్టు కనిపించి ఆ మొత్తం కార్డుదారుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.లక్ష వరకు డ్రా చేసిన వీరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకోవడంతో పెద్ద స్కామ్‌ తప్పింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement