‘ల్యాండ్‌’ మైన్స్‌! | Miampur lands scam growing day by day | Sakshi
Sakshi News home page

‘ల్యాండ్‌’ మైన్స్‌!

Published Thu, Jun 1 2017 1:26 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

‘ల్యాండ్‌’ మైన్స్‌! - Sakshi

‘ల్యాండ్‌’ మైన్స్‌!

రోజురోజుకూ పెరిగిపోతున్న మియాపూర్‌ భూముల స్కాం పరిధి

► మొత్తం ఎకరాలు816
► స్కాం విలువ15,000 కోట్లు
► ఎల్బీనగర్, బాలానగర్‌లకూ విస్తరించిన అక్రమాలు
► ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్ల అరెస్ట్‌.. దందా వెనుక బడాబాబులు
► గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌కు ఉన్నతాధికారుల అండ
► 2002లో హైదర్‌నగర్‌లో వంద ఎకరాలు కాజేసే యత్నం
► శంకర్‌పల్లి ప్రాంతంలో ఓ చానల్‌ సీఈవోతో కలసి భూముల కొనుగోలు


సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూముల కుంభకోణాన్ని తవ్వేకొద్దీ విస్తుబోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలనం రేపుతున్న ఈ స్కాం ఏకంగా 816.04 ఎకరాలకు విస్తరించింది. ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులకు కొందరు ఉన్నతాధికారుల సహకారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు సబ్‌ రిజిస్ట్రార్‌లు, ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు అరెస్టయ్యారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ అధికారులతో రియల్టర్లు, అక్రమార్కుల కుమ్మక్కుతోనే ఈ భారీ కుంభకోణం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వేదికగా...
మియాపూర్, ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో అక్కడ ఎకరా రూ.15 కోట్ల దాకా పలుకుతోంది. దీంతో వీటిపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, రియాల్టర్లు రంగంలోకి దిగారు. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తమకు అనువుగా మార్చుకున్నారు. కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఈ కుంభకోణానికి తెరలేపారు. సర్వే నంబర్‌ 101లో 231 ఎకరాలు, 20లో 109.18 ఎకరాలు, 28లో 145.26 ఎకరాలు, 100లో 207 ఎకరాలు... ఇలా మొత్తం 693.04 ఎకరాలపై బడాబాబులు కన్నేశారు. 2016 జనవరి 15న అమీరున్నీసా బేగంతో పాటు మరికొందరు ఆ భూములపై తమకు హక్కులున్నాయని, వాటిపి ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ పార్థసారథి, సువిశాల పవర్‌ జనరేషన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పీవీఎస్‌ శర్మ తదితరులకు దఖలు పరుస్తూ రిజిస్ట్రేషన్‌ చేయించారు.

అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన రాచకొండ శ్రీనివాసరావు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా అనుమతించడంతోపాటు ఆ భూములకు ఎలాంటి మార్కెట్‌ విలువ లేదంటూ రిజిస్ట్రేషన్‌ ఫీజును పూర్తిగా మినహాయించేశారు. ఈ కేసులో శ్రీనివాసరావుతోపాటు పార్థసారథి, పీవీఎస్‌ శర్మలను సైబరాబాద్‌ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితుల జాబితాలో ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ లిమిటెడ్, దానికి డైరెక్టర్‌గా ఉన్న గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ (డాక్టర్‌ పి.సంజీవని ప్రసాద్‌) భార్య పి.ఇంద్రాణి ప్రసాద్, మరో డైరెక్టర్‌ మహితా కడ్డల్, సికింద్రాబాద్‌లోని సువిశాల్‌ పవర్‌ జనరేషన్‌ లిమిటెడ్, గోల్డ్‌స్టోర్‌ ఇన్‌ఫ్రాటెడ్‌ లిమిటెడ్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా పని చేస్తూ సువిశాల్‌ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న సయ్యద్‌ రఫియుద్దీన్‌ తదితరులను చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భూమాయ వెనుక గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సైబరాబాద్‌ పోలీసులు గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా టెక్‌ కంపెనీతోపాటు ట్రినిటీ ఇన్‌ఫ్రా, సువిశాల్‌ పవర్‌ జెన్‌ సంస్థల పుట్టుపూర్వోత్తరాలు తవ్వే పనిలో ఉన్నారు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు లేక కూడా రాశారు.

మరో రెండు ఫిర్యాదులు
భూ కుంభకోణాలకు సంబంధించి కూకట్‌పల్లి ఠాణాలో ఉన్న కేసుకు తోడు మియాపూర్‌ పోలీసుస్టేషన్‌లోనూ మంగళవారం రెండు ఫిర్యాదులు అందాయి. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌ తిరుపతిరెడ్డి, హెచ్‌ఎండీఏ సైట్‌ ఆఫీసర్‌ జోగారావు ఈ ఫిర్యాదులు చేశారు. మియాపూర్‌ గ్రామం సర్వే నం.44లో 25 ఎకరాలు, 45లో 85 ఎకరాలు సైతం ఇదే రకంగా అక్రమ రిజిస్ట్రేషన్‌ అయినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కుంభకోణం విస్తృతి 693.04 ఎకరాల నుంచి 816.04 ఎకరాలకు చేరినట్‌లైంది. మొత్తం దాదాపు రూ.15 వేల కోట్ల స్కామ్‌ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో ఇద్దరి అరెస్ట్‌..
మియాపూర్‌ స్కాంపై దర్యాప్తు సాగుతుండగానే... ఎల్బీనగర్, బాలానగర్‌లోనూ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో సబ్‌ రిజిస్ట్రార్లు రమేశ్‌ చంద్‌రెడ్డి, యూసుఫ్‌ అరెస్టయ్యారు. భూముల రిజిస్ట్రేషన్‌న్‌ భాగోతంలో కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావు అక్రమార్కులకు ఇచ్చిన స్టాంపు డ్యూటీ మినహాయింపుతో ప్రభుత్వానికి ఏకంగా రూ.587.11 కోట్ల ఆదాయానికి గండి పడింది. సబ్‌ రిజిస్ట్రార్‌లు ఇలా అక్రమార్కులకు సహకరించడం వెనుక పెద్దల హస్తం సైతం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌న్‌ వివరాలను రిజిస్ట్రార్‌లు బుక్‌–1లో నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూడకుండా ఉండేందుకు అరెస్టయిన సబ్‌ రిజిస్ట్రార్‌లు ఆ వివరాలను చరాస్తులను రిజిస్ట్రేష¯న్‌ చేసే బుక్‌–4లో నమోదు చేయడం గమనార్హం. గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖ.. ఆడిట్‌లో ఈ విషయం గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వానికి చేరిన నివేదికను కొందరు పెద్దలు తొక్కిపెట్టారని తెలుస్తోంది.

గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌కు ఉన్నతాధికారుల సహకారం
నగర శివార్లలో ప్రభుత్వ భూములు కాజేయడం గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌కు కొత్తమీ కాదు. 2002లోనూ ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేషీలో ఓ ఉన్నతాధికారి సహకారంతో హైదర్‌నగర్‌లో వంద ఎకరాలకు పైగా కాజేసే ప్రయత్నంలో అనేక నకిలీ పత్రాలు సృష్టించాడు. తాను అనుకున్న పని పూర్తి చేసేందుకు అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఎరచూపడం, ఆస్తులు కొనుగోలు చేసి ఇవ్వడం ప్రసాద్‌కు అలవాటు. ఇలా మియాపూర్‌లో అత్యంత విలువైన వందలాది ఎకరాలను చేజిక్కించుకున్నాడు.

ప్రైవేట్, ప్రభుత్వ భూములను కొల్లగొట్టాడు. చనిపోయిన వ్యక్తుల పేరిట నకిలీ జీపీఏలు సృష్టించి వేల కోట్ల అక్రమార్జన ధ్యేయంగా ఫోర్జరీ సంతకాలు, బీనామీ వ్యక్తులతో సూట్‌కేస్‌ కంపెనీలను సృష్టించి బడా రియల్టర్లను, వ్యాపారస్తులను మోసం చేసిన తీరు పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో తన సమీప బంధువు ఒకరి సాయం తీసుకోవడం ద్వారానే భూ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ అధికారి పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరించాల్సి ఉందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

టీవీ ఛానల్‌ సీఈవోతో కలసి..
ప్రముఖ ఛానల్‌ సీఈవో ఒకరితో కలిసి గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లి ప్రాంతంలో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసిన వ్యవహారం బయటపడింది. ఇందుకు మూడు కంపెనీలను సృష్టించిన ప్రసాద్‌.. సదరు టీవీ చానల్‌ సీఈవో కుటుంబ సభ్యులు ఇద్దరినీ అందులో డైరెక్టర్లుగా నియమించాడు. ఈ భూములకు సంబంధించి సర్వాధికారాలు కంపెనీ డైరెక్టర్లవే. పన్నెండేళ్ల క్రితమే ఈ భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అవి కంపెనీ ఆధీనంలోనే ఉన్నాయా లేదా అన్న అంశంపై పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది.

జూన్‌ 2కు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా
మియాపూర్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ కుంభకోణంలో అరెస్టయిన కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాసరావు, స్థిరాస్తి వ్యాపారులు పార్థసారథి, పీవీఎస్‌శర్మలు వేసిన బెయిల్‌ పిటిషన్‌ విచారణను మియాపూర్‌ కోర్టు జూన్‌ 2కు వాయిదా వేసింది. అలాగే వీరిని కస్టడీలోకి కోరుతూ మియాపూర్‌ పోలీసులు వేసిన పిటిషన్‌ను మియాపూర్‌ కోర్టు కొట్టేయడంతో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్‌ ఎంఎస్‌జే కోర్టులో మరో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement