3.62 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం
• కేంద్రం నుంచి రూ. 250 కోట్లు వచ్చే అవకాశం
• మరోవైపు నాబార్డు నిధులు రూ. 874 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్లలో 3.62 లక్షల ఎకరాలను సూక్ష్మసేద్యం కిందికి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 250 కోట్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అదిగాకుండా ఇప్పటికే నాబార్డు నుంచి ఉద్యానశాఖకు సూక్ష్మసేద్యం కోసం రూ. 874 కోట్లు మంజూరైన సంగతి విదితమే. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ. 150 కోట్లు ఉంటుంది. వీటితో 2016–17, 2017–18 సంవత్సరాల్లో పెద్దఎత్తున సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే వచ్చే బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిం చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్రం నుంచి, నాబార్డు నుంచి నిధులు వస్తున్నందున కేటాయించే అవకా శాలు లేవని అంటున్నారు. వాస్తవంగా సూక్ష్మసేద్యానికి రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కానీ ఆ మేరకు నిధులు లేకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. 2015–16 బడ్జెట్‌లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ. 308 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో 2.63 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యం కావాలని 1.03 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.60 లక్షల ఎకరాలకు చెందిన రైతుల దరఖాస్తులను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మసేద్యం అందించాలంటే బడ్జెట్ కేటాయింపులకు తోడు అదనంగా రూ. 337.30 కోట్లు కేటాయించాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016–17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం కోసం రూ. 290 కోట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరిపోదు. ఇది ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం మంజూరు చేస్తారు.