మనసారా మొక్కులు
గద్దెపై నుంచి గుడికి చేరిన సమ్మక్క తల్లి
దారిపొడవునా భక్తుల పొర్లు దండాలు
కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు
సారలమ్మకు సుంకు వడ్ల సమర్పణ
గిరిజనుల ఇంటింటా సమ్మక్క పండుగ
మేడారం మినీ జాతరకు రెండో రోజు గురువారం భక్తులు పోటెత్తారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగారుు. వందలాది వాహనాలతో వనదారులు, వేలాది మందితో ఆలయ గద్దెలు, జంపన్న వాగు చుట్టుపక్కల ప్రదేశాలు కిటకిట లాడారుు.. శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కులతో మేడారం పులకించగా.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
- ములుగు/ తాడ్వాయి
మేడారం (తాడ్వాయి) : మేడారంలో బుధవారం అర్థరాత్రి గద్దెపై కొలువుదీరిన సమ్మక్క తల్లి తిరిగి గురువారం ఉదయం గుడికి చేరుకుంది. మండమెలిగే పండుగ రోజున బుధవారం రాత్రి మేడారంలోని గుడి నుంచి ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య పసుపు, కుంకుమలు పట్టుకుని డోలివాయిద్యాలతో గద్దెపై ప్రతిష్టించారు. ఆ రాత్రింతా పూజారులు గద్దెల వద్ద జాగారంతో సంబరాలు జరుపుకున్నారు. తిరిగి ఉదయం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తల్లిని గుడికి చేర్చారు. గద్దె నుంచి తల్లిని గుడికి తీసుకువచ్చే క్రమంలో భక్తులు దారిపొడవునా పొర్లు దండాలు పెట్టారు. తల్లి గుడికి చేరిన అనంతరం పూజారులు తలంటు స్నానాలు ఆచరించారు. మళ్లీ గుడికి చేరుకుని సమ్మక్కకు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలోని గిరిజనులందరూ తమతమ ఇళ్లల్లో సమ్మక్క పండుగ చేసుకున్నారు.
సమ్మక్కకు యాటమొక్కు
మేడారం గద్దెల వద్ద బుధవారం రాత్రింతా సమ్మక్క పూజారులతో కలిసి జాగారం చేసిన సారలమ్మ పూజారులు గురువారం ఉదయం కన్నెపల్లికి చేరుకున్నారు. సారలమ్మ పూజారి కాక సారయ్య, ఇతర పూజారులు స్నానమాచరించి గుడికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం సమ్మక్కకు సారలమ్మ పూజారులు యాటను మొక్కి బలిచ్చారు. సంప్రదాయబద్ధంగా కులపెద్దలందరికీ పంచి పెట్టారు. వచ్చే బుధవారం తిరుగువారం పండుగ వరకు సారలమ్మ గుడి వద్ద డోలీలతో జాగారం నిర్వహించనున్నారు.
సారలమ్మకు సుంకు వడ్లు
కన్నెపల్లిలో సారలమ్మకు గిరిజనులు సంకు వడ్లు సమర్పించారు. సోలం వెం కటేశ్వర్లు తల్లి గురువారం వడ్లతో గుడికి వచ్చి పసుపు, కుంకుమ, పూలతో పూజలు నిర్వహించారు. ధాన్యం పండించిన గిరిజనులు సారలమ్మకు ముందుగా సుంకు వడ్లు సమర్పించిన తర్వాతనే అమ్ముకోవడం ఆనవారుుతీగా వస్తోంది.