Samakka-Saralamma
-
గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ
-
గద్దెపైకి సారలమ్మ..
-
జాతీయ హోదాకు కృషి
సాక్షి, భూపాలపల్లి : మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలనే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ముండా తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మలను శనివారం ఆయన దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మేడారానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కేంద్ర మంత్రికి విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన.. జాతర విశిష్టతను తెలియజేసి జాతీయ హోదా కల్పించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గిరిజనులు ఎంతో కాలంగా కోరుకుంటున్న జాతీయ హోదా దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారంలో వనదేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, వచ్చే జాతరకు తప్పకుండా వస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు ఆస్తులు లేకపోయినా సంతోషంగా బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పించే అంశం గిరిజన పురాతన సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి మరువలేనిదని కితాబిచ్చారు. ఆయన వెంట మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సేవలందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. జాతర సమయంలో 36 వేల ట్రిప్పుల ద్వారా 12 లక్షల మందిని గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించారు. జాతర ముగియడంతో తిరుగు పయనమవుతున్న భక్తులు -
మేడారం.. జనసంద్రం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం జనసంద్రమైంది. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన సమక్క–సారలమ్మ జాతర కన్నుల పండుగగా సాగుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో ఉప్పొంగుతోంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు బారులుతీరారు. చీర, సారె, నిలువెత్తు బంగారం (బెల్లం), ఎదుర్కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు... ఇలా తీరొక్క రూపాల్లో వనదేవతలకు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మల ప్రసాదం (బెల్లం) దక్కించుకునేందుకు పోటీపడ్డారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం అమ్మవార్లను దర్శించుకోగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం వనదేవతలను దర్శించుకున్నారు. వీవీఐపీల పర్యటన సందర్భంగా రెండు విడతల్లో సుమారు 2 గంటలకుపైగా దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వనదేవతలకు చీర, సారె సమర్పించిన సీఎం కేసీఆర్... వనదేవతల దర్శనానికి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మేడారానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేడారం పూజారులు, జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఆలం రామ్మూర్తి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మను కేసీఆర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని, ఆ తర్వాత సారలమ్మ అమ్మవారితోపాటు పక్కనే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు తెలంగాణ రాష్ట్రం తరఫున చీర, సారె సమర్పించారు. హుండీలో కానుకలు వేశారు. దర్శనానంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సమ్మక్క–సారలమ్మ దేవతల ఫొటోను అందజేశారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కూడా వనదేవతలను దర్శించుకొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జనసంద్రమైన మేడారం.... మేడారం జాతరకు ఈసారి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 40 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటివరకు భక్తుల సంఖ్య 1 కోటి 10 లక్షలకు చేరినట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం ముందు వరకు ముందస్తుగా 70 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలలో భక్తుల ఇబ్బందులు... మేడారంలో శుక్రవారం ఉదయం గవర్నర్ల దర్శనం సమయంలో సుమారు గంటపాటు ఆ తర్వాత సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మ«ధ్యాహ్నం 12:35 గంటల నుంచి 1:35 గంటల వరకు అధికారులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. దీంతో రద్దీ క్యూలలో పలుమార్లు తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు భక్తులు గాయపడ్డారు. వీవీఐపీల దర్శనం ముగిసినప్పటికీ భారీ క్యూల వల్ల సాధారణ భక్తుల దర్శనానికి 4–5 గంటల వరకు సమయం పట్టింది. రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. హెలికాప్టర్లో చక్కర్లు కొట్టిన గవర్నర్లు సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడానికి శుక్రవారం మేడారం వచ్చిన గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ ప్రత్యేక హెలికాప్టర్లో జాతర పరిసరాల్లో రెండుసార్లు చక్కర్లు కొట్టారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీ, ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మల దర్శనం సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళిసై గవర్నర్ తమిళిసై తులాభారం వనదేవతలను దర్శించుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేడారం జాతర ప్రకృతితో మమేకమైందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సమ్మక్క–సారలమ్మ ఆశీర్వాదాలు ఉంటాయన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను మొక్కుకున్నట్లు తమిళిసై తెలిపారు. నేడు వనంలోకి దేవతలు... అశేష భక్తుల నుంచి తీరొక్క మొక్కులు అందుకున్న వనదేవతలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. జాతరలో చివరి అంకమైన ఈ ఘట్టం శనివారం సాయంత్రం జరగనుంది. తొలుత నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకెళ్తారు. ఈ సమయంలో గద్దెల వద్ద ఉన్న భక్తులకే వనప్రవేశాన్ని చూసే వీలు ఉంటుంది. ఆలయం దాటిన తర్వాత బయటివారినెవరినీ వెంట రానివ్వరు. అందుకే ఈలోగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని భక్తులు భారీగా వస్తున్నారు. బంగారం మొక్కు చెల్లించుకునేందుకు వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం కేసీఆర్ పర్యటన సాగింది ఇలా... ►మధ్యాహ్నం 1:06 గంటలకు హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. ►1:10 గంటలకు వనదేవతల గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికి కండువా కప్పారు. ►1:14 గంటలకు సంప్రదాయబద్ధంగా ప్రధాన ప్రవేశమార్గం ద్వారా ఆలయ పూజారులు, మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు సీఎంకు ఆహ్వానం పలికారు. ►1:16 గంటలకు నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు. ►1:19 గంటలకు సమ్మక్క గద్దె వద్ద, 1:22 గంటలకు సారలమ్మ గద్దె వద్ద చీర–సారె, కానుకలు సమర్పించారు. అనంతరం గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకున్నారు. ►1:28 గంటలకు గద్దెల ప్రాంగణం నుంచి బయటకు వచ్చారు. ►1:35 గంటలకు పోలీస్ ఔట్‌పోస్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విడిది ప్రాంతానికి చేరుకొని భోజనం చేశారు. ►2:05 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ రాకపోకల సమయం ►ఉదయం 9:25 గంటలకు మేడారంలోని హెలిప్యాడ్ వద్ద దిగారు ►9:30 గంటలకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. ►9: 40 గంటలకు సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు. ►10:00 గంటలకు తులాభారం ►10:10 గంటలకు సమ్మక్క, 10:15 గంటలకు సారలమ్మ గద్దె వద్ద మొక్కులు చెల్లించారు. ►10:45 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ►11:07 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. బరువు తగ్గిన కేసీఆర్ నిలువెత్తు బంగారంతో సీఎం కేసీఆర్ తులాభారం. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ సమ్మక్క–సారలమ్మల దర్శనం సందర్భంగా సీఎం కేసీఆర్ నిలువెత్తు బంగారాన్ని మొక్కుగా సమర్పించిన సమయంలో ఆయన 51 కిలోల బరువు తూగారు. 2018 ఫిబ్రవరి 2న మేడారం దర్శనానికి వచ్చిన సందర్భంగా నిలువెత్తు బంగారం సమర్పించినప్పుడు ఆయన 52 కిలోల బరువు ఉండేవారు. ఈసారి కేసీఆర్ 51 కిలోల బరువు తూగడంతో రెండేళ్లలో ఆయన ఒక కిలో బరువు తగ్గినట్లయింది. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 66 కిలోలు, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ 55 కిలోల బంగారాన్ని మొక్కులుగా సమర్పించినట్లు పౌర సమాచార సంబంధాల శాఖ వెల్లడించింది. -
గద్దెనెక్కిన వరాల తల్లి
-
కీలక ఘట్టం.. గద్దెనెక్కిన వరాల తల్లి
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. అడవి అంతా జనాలతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతిముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాలు, పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఆదివాసీ జాతరలో పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే ఆదివాసీ జాతర ప్రధాన ఘట్టం గురువారం సాయంత్రం 6:29 గంటల నుంచి రాత్రి 9:09 గంటల వరకు ఉద్విఘ్నంగా సాగింది. వేకువజాము నుంచే..... వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం వేకువజామునే మొదలైంది. సమ్మక్క పూజారులు, వడ్డెలు ఉదయం 5.30 గంటలకు మేడారం సమీపంలోని వనంలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు, ఆలంకరణలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాల (కొత్త కుండలు)ను కూడా గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలకలగుట్టపైకి బయలుదేరింది. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. సమ్మక్క రాక సందర్భంగా చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు ఉన్న కిలోమీటరు దారి మొత్తం రంగురంగుల ముగ్గులు వేసి భక్తులు యాటపోతులను బలిచ్చి మొక్కుకున్నారు. సమ్మక్కకు ఆడపడుచులు, ముత్తయిదవులు నీళ్ల బిందెలు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. సమ్మక్క రాక సందర్భంగా గౌరవ సూచకంగా తుపాకీ పేలుస్తున్న ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ సాయంత్రం 6:29 గంటలకు... గురువారం సాయంత్రం 6:29 గంటలకు కుంకుమ భరణి రూపంలో ఉన్న అడవితల్లి సమ్మక్కతో పూజారులు చిలకలగుట్ట దిగడం ప్రారంభించారు. వారు వస్తున్న విషయం తెలియడంతో ఒక్కసారిగా అక్కడున్న శివసత్తులు, మహిళలు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ ఉద్విఘ్నత కొనసాగుతుండగానే సమ్మక్కతో వడ్డే కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట దిగారు. మిగిలిన పూజారులు, వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచికగా దేవతను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ శబ్దం విన్నవెంటనే చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో చిలుకలగుట్ట ప్రాంతం మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల రోప్ పార్టీ నడుమ పూజారులు, వడ్డెలు సమ్మక్క కుంకుమ భరిణె రూపంతో మేడారంవైపు బయలుదేరారు. చిలకలగుట్ట నుంచి ఫెన్సింగ్ వరకు సమ్మక్క చేరుకునేలోపు ఎస్పీ మొత్తం 3 సార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య పూజారులు, ఆదివాసీల మధ్య సమ్మక్కను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు. చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు లక్షల మంది భక్తులు సమ్మక్క రాకను చూసి తన్మయత్నం చెందారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక్క రూపంపై వెదజల్లారు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజా రులు అక్కడి నుంచి ఎదురుకోళ్ల పూజా మందిరం చేరుకున్నారు. పూజారులు 5 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకొస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సరిగ్గా రాత్రి 9:09 గంటల సమయంలో గద్దెపై సమ్మక్కను ప్రతిష్టించాక విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మొదట మేడారంవాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. ఎదుర్కోళ్లు ఎగుర వేస్తున్న భక్తులు మెగా సిటీగా మేడారం వరంగల్: దట్టమైన అటవీ ప్రాంతంలోని మేడారం.. జాతర సమయంలో మెగా సిటీ గా మారుతుంది. సాధారణ పల్లె ప్రతీ రెండేళ్లకోసారి వారం పాటు తన స్వరూపాన్ని గు ర్తు పట్టలేనంతగా మార్చుకుంటుంది. ఎం తంటే ఐదు లక్షల కుటుంబాలు, కోటి మం దికి పైగా జనాభా జాతరకు చేరుకుంటారు. మేడారం జాతరకు మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మ హారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆదివాసీలు, గిరిజనులు వస్తారు. పొరుగు రాష్ట్రాల నుం చి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రధా న అడ్డంకి గోదావరి నది. మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు సిరోంచ తర్వాత ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఏటూరునాగారం, కాళేశ్వరం వద్ద నిర్మిం చిన హైలెవల్ వంతెనల మీదుగా మేడారం చేరుకుంటారు. జాతరపై వర్సిటీలో పరిశోధనలు 1975లోనే వరంగల్‌లో కేయూ ప్రారం భం కాగా.. 1980వ దశకంలో వర్సిటీలో చరిత్ర విభాగం తన పరిశోధనలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమ్మక్క–సారలమ్మలతో పాటు కాకతీయులపై చెప్పుకోతగిన పరిశోధనలు జరగలే దు. 2006లో దివిటి అంజనీదేవి సమ్మక్క– సారలమ్మ జాతరపై ఓ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురాగా, అంతకు ముందు రాజ్ మహ్మద్ ఉస్మానియా వర్సిటీ ద్వారా పరిశోధనలు చేశారు. ఇటీవల గిరిజన విజ్ఞానపీఠం ద్వారా కొన్ని పుస్తకాలు ప్రచురితమయ్యాయి. జాతరలో జంపన్న పుట్టిండు! మగబిడ్డతో శివాణి భూపాలపల్లి అర్బన్ : మేడారం మహాజాతరకు వచ్చిన భక్తురాలు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన 50 ఆస్పత్రిలో వైద్యులు గురువారం ఆమెకు సాధారణ ప్రసవం చేయడంతో పాటు కేసీఆర్ కిట్ అందజేశారు. పుణేకు చెందిన చావని శివాణి కుటుంబ సభ్యులతో కలసి రెండు రోజుల క్రితం జాతరకు వచ్చింది. గురువారం పురుటి నొప్పులు రావడంతో 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ప్రసవం చేయడంతో శివాణి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో జంపన్నే తమకు పుట్టాడని శివాణి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. హుండీలు గలగల! మొక్కుబడులతో నిండిన హుండీలు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల వద్ద 429 హుండీలను ఏర్పాటు చేశారు. జాతరలో రోజుకు సుమారు 40 నుంచి 50 హుండీలు నిండుతున్నాయి. ఇప్పటి వరకు 212 హుండీలు నిండినట్లు దేవాదాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు. బస్సుల సందడి భూపాలపల్లి: మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క తల్లి గద్దెను చేరడంతో భక్తులు దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి వరకు మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో వందలాది బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారు. బస్టాండ్‌లో నిలిపి ఉంచిన వివిధ డిపోల బస్సులను పైనుంచి ఇలా అగ్గిపెట్టెల్లా దర్శనమిచ్చాయి. జనసందోహంగా మేడారం.. ప్రముఖుల మొక్కులు సమ్మక్క గద్దెను మొక్కుతున్న మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే సీతక్క నలుగురు వన దేవతలు... సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భారీగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల మంది వరకు మేడారానికి తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారం మేరకు మేడారానికి వచ్చిన భక్తుల సంఖ్య శుక్రవారం కోటికి చేరనుందని భావిస్తున్నట్లు దేవాదాయ, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు పేర్కొన్నారు. అమ్మవార్లకు పూలు, పండ్లు సమర్పిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చిత్రంలో తలసాని కాగా, మేడారంలో గురువారం పలువురు ప్రముఖులు వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు. తల్లులను దర్శించుకున్న వారిలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే ధనసరి సీతక్క, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ప్రత్యేకాధికారులు వి.పి. గౌతమ్, కృష్ణ ఆదిత్య, సీపీ డాక్టర్ రవీందర్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఏఎస్పీ సాయిచైతన్య తదితరులు ఉన్నారు. -
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి
సాక్షి, వరంగల్ : మేడారం జాతరను కేంద్రం జాతీయ పండుగగా గుర్తించాలని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించినా.. నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. జాతరకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకారం లేకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జాతరను వైభవంగా నిర్వహిస్తోందన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ ఏ పండుగ, జాతర జరిగినా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మేడారంను పర్యాటక కేంద్రంగా, ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. -
తీరొక్క మొక్కులు
జంపన్నవాగులో స్నానం జంపన్నవాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. ఒకప్పటి సంపెంగ వాగే నేటి జంపన్నవాగు. ఇప్పుడు స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతనే తల్లుల దర్శనానికి వెళ్తారు. జంపన్నవాగు ఒడ్డున తలనీలాలు సమర్పిస్తారు. ఎదుర్కోళ్లు.. అమ్మలను గద్దెలకు తీసుకొచ్చే క్రమంలో భక్తులు ఎదుర్కోళ్లతో ఆహ్వానం పలుకుతారు. తమ చేతుల్లో ఉన్న కోడిని ఎదురునా చేస్తూ మనసారా మొక్కుతుంటారు. శివసత్తుల పూనకాలు జంపన్నవాగులో శివసత్తుల పూనకాలు మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలతో పాటు పురుషులు కూడా శివాలూగుతూ జాతరకు వస్తారు. వీరంతా తొలుత జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. తర్వాత పసుపుతో అలంకరించుకుంటారు. ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం సమ్మక్క తల్లిని నిష్ఠగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుంటారు. చీర సారె కట్టుకొని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివమెత్తుతారు. లక్ష్మీదేవర మొక్కు లక్ష్మీదేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుంది. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడువునా నృత్యం చేస్తూ గద్దెలకు వస్తారు. ఆయనకు గద్దెల వద్ద డోలు, గజ్జెల మోతతో చప్పుళ్లు చేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు. ఒడి బియ్యం భక్తులు తల్లులను ఆడపడుచులుగా భావిస్తూ ఒడిబియ్యం మొక్కులు చెల్లిస్తారు. తమ ఇళ్లలోనే నూతన వస్త్రం, జాకిటి, కొబ్బరి కుడుక, పోక, కజ్జుర, నాణంను ఒడిబియ్యంలో కలిపి శివసత్తులకు పోస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు. మేకలు, కోళ్ల బలి మేడారం జాతరలో కోళ్లు, మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. వనదేవతలకు దర్శించుకునే ముందు భక్తులు రెండు కొబ్బరి కాయలు కొడతారు. ఈ సమీపంలో పసుపు, కుంకుమతో పాటు అగరవత్తులు వెలిగించి దేవతలకు మొక్కుతారు. మేడారంలో ప్రారంభమైన సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తులు తీరొక్క మొక్కులు చెల్లిస్తుంటారు. సంతానం కలగాలని, ప్రభుత్వ ఉద్యోగం రావాలని, వ్యాపారంలో బాగా స్థిరపడాలని, కూతురికి మంచి వివాహ సంబంధం రావాలని అమ్మలను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కోర్కెలు తీరిన వారు కోళ్లు, యాటలు, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, చీర సారెలు సమర్పించి వనదేవతల ఆశీర్వాదం పొందుతారు. జాతరలో తీరొక్క మొక్కులపై ప్రత్యేక కథనం. – ఏటూరునాగారం గద్దెల వద్ద చెట్టుకు ఊయల కడుతున్న భక్తురాలు -
పగిడిద్దరాజు పెళ్లి కొడుకాయె..
గంగారం: గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఆరాధ్య దైవమైన సమ్మక్కను వివాహం చేసుకునేందుకు పెళ్లి కుమారుడిగా తయారైన పగిడిద్దరాజు మేడారానికి బయలుదేరాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామానికి చెందిన పగిడిద్దరాజుకు భక్తి శ్రద్ధల నడుమ పూజలు నిర్వహించిన పూజారులు.. కాలి నడకన మేడారం బయలుదేరారు. వరుడు పగిడిద్దరాజు ఇంటి వద్ద చేయాల్సిన కార్యక్రమాలను పెనక వంశీయుల వడ్డెలైన కల్తి వంశీయులు నిర్వహించారు. పూనుగొండ్లలో మొదట పగిడిద్దరాజు పాన్పును తీసుకువచ్చాక వడ్డె ఇంటి వద్ద మహిళలతో ముగ్గులు వేయించారు. అనంతరం మేక, పాన్పుతో గ్రామ పురవీధుల గుండా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద మేకపోతును బలిచ్చి పగిడిద్దరాజుకు నైవేద్యం సమర్పించారు. దేవాలయంలో ఉన్న పడిగెను తీసి దేవుని గుట్ట నుంచి తీసుకువచ్చిన వెదురు కర్ర కట్టి గద్దెపై ప్రతిష్ఠించారు. దేవాలయంలో పగిడిద్దరాజు గద్దె వద్ద పసుపు, కుంకుమ చల్లి శుద్ధి చేశారు. అనంతరం పడిగెతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గ్రామం దాటే వరకు ఆదివాసీ సంప్రదాయాల నడుమ, డోలు, డప్పులు వాయిద్యాలతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, వడ్దెలతో ర్యాలీ నిర్వహించారు. పగిడిద్దరాజు పడిగె వస్తుండగా.. పూజారుల కాళ్లు తడిపి తరించేందుకు గ్రామ మహిళలు బిందెలతో నీళ్లు ఆరబోశారు. పగిడిద్దరాజు వెళ్లేటప్పుడు అధిక సంఖ్యలో భక్తులు కాలి నడకన బయలుదేరి వెళ్లారు. కాలినడకనే బయలుదేరిన పగిడిద్దరాజు పగిడిద్దరాజు పడిగెతో పూజారులు పూనుగొండ్ల నుంచి అటవీ మార్గం గుండా 80 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి ములుగు జిల్లా కర్లపల్లి సమీపంలోని లక్ష్మీపురానికి మంగళవారం రాత్రి చేరుకుంటారు. గ్రామంలోని పెనక వంశీయుల ఇంటి వద్ద సేద తీరి బుధవారం తెల్లవారుజామున స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కర్లపల్లి, నార్లాపూర్, వెంగ్లపూర నుంచి మేడారానికి సాయంత్రంలోగా చేరుతారు. అక్కడ సమ్మక్క – పగిడిద్దరాజు వివాహం జరిపిస్తారు. కాగా, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ అల్లెం రామ్మూర్తి తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. -
వనమెల్లా.. జన మేళా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది. కోరిన కోర్కెలు తీర్చే సారలమ్మ.. మేడారంలోని గద్దెపై కొలువుదీరే ఘడియలు దగ్గరపడుతున్నాయి. కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్ల బండ్లు.. అన్ని మేడారం బాటపడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. కొన్ని గంటల్లో మొదలయ్యే మేడారం జాతరకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ ఆగమనం.. వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువు తీరనుంది. పూజారులు ఇందుకోసం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే ఏటూరునాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును సైతం మేడారం గద్దెల వద్దకు తీసుకొస్తారు. మంగళవారమే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పయనమయ్యాడు. పూనుగొండ్ల నుంచి కాలిబాటన 50 కిలోమీటర్లు ఉండటంతో వడ్డెలు ముందుగానే బయల్దేరారు. మేడారానికి సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చే వేడుకను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకు ఈ సారి 1.4 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రత్యేకాధికారులు వీపీ గౌతమ్, వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ నేతృత్వంలో యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరలో సౌకర్యాల కల్పనకు రాష్ట్రప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టీఎస్ఆర్టీసీ 4,105 బస్సులను నడుపుతోంది. భక్తులకు సౌకర్యం కోసం పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు. గతంలో జాతరకు వెళ్లి వచ్చేందుకు రెండే ప్రధాన మార్గాలు ఉండేవి. ఈసారి ఆరు మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లి రావచ్చు. మేడారం జాతర ప్రదేశంలో 300 సీసీ కెమెరాలతో భద్రతా చర్యలు, జాతర నిర్వహణ కోసం 12 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేం దుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందిం చింది. జాతరకు వచ్చే భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా 3.6 కిలోమీటర్ల పొడవునా స్నానఘట్టాలు నిర్మిం చారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెల పక్కనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచారు. -
జాతర వెళ్లొద్దామా..
సాక్షి, సుల్తానాబాద్(పెద్దపల్లి): మినీ మేడారంగా ప్రసిద్ధిగాయించిన నీరుకుల్ల–వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న రంగానాయకస్వామి ఆలయం సమీపంలోని సమ్మక్క–సారలమ్మ జాతర వైభవంగా జరగనుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు పెద్దపల్లి జిల్లా నుంచేకాక ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. జారత ప్రదేశంలో మానేరు నది, గుట్టలు, పచ్చని చెట్లతో ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దాదాపు 3–4లక్షల భక్తులు దర్శించుకుంటారని అంచానం. గర్రెపల్లిలో 30 ఏళ్లుగా.. గర్రెపల్లిలో రాజీవ్రాహదారికి అనుకోని ఉన్న తిరుమలయ్యగుట్టపై 30 ఏళ్లుగా సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతుంది. మేడారం కొయపూజారులతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. రెండేళ్లకోసారి జరిగే జాతర సుమారు లక్షయాభైకిపైగా మంది భక్తులు వస్తారు. భక్తులస్నానాలకు షవర్లు, చాలువ పందిర్లు, తాగునీటి, సాముహిక మరుగుదొడ్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. 46 ఏళ్లుగా కొలనూర్‌లో.. ఓదెల(పెద్దపల్లి): చుట్టూగుట్టలు..మూడువైపులా రహదార్లు..ప్రధాన రహదారికి పక్కనగల జంపన్నవాగు..సమ్మక్కసారలమ్మ గద్దెలపైకి కోయపూజారులతో ప్రతిష్ఠాపన రోజున శివసత్తుల పూనకాలతో దద్దరిల్లె ధనగుట్టలు కొలనూర్ శ్రీసమ్మక్కసారలమ్మ జాతర ప్రత్యేకతలు. పెద్దపల్లి జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే ఓదెల మండలం కొలనూర్ గ్రామంలోని సమ్మక్కసారలమ్మ జాతర గద్దెలు ముస్తాబయ్యాయి. ఫిబ్రవరి 5నుంచి 8వరకు జరిగే సమ్మక్కసారలమ్మ జాతర దర్శనంకోసం భక్తులు భారీగా తరలిరానున్నారు. 1974లో ప్రారంభమైన జాతర నేటికి 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలనుంచి భక్తులు అధికసంఖ్యలో వస్తారు. ఈనెల 5న సారలమ్మ గద్దెకు , 6న రాత్రి సమ్మక్కగద్దెకు వచ్చుట, 7న భక్తులు మొక్కులు సమర్పించుట, 8న దేవతల వనప్రవేశం ఉంటుంది. హైదరాబాద్, కొత్తగూడెం, నాగపూర్, సిర్పూర్కాగజ్నగర్ నుంచి రైళ్లతోపాటు ఆర్టీసీ, ప్రయివేట్ వాహనాల సౌకర్యం ఉంది. పటిష్ట బందోబస్తు పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనూర్ గ్రామంలో జరిగే సమ్మక్కసారలమ్మ జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫ్లెక్సీల ఏర్పాట్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం నిషేధం. – పెట్టెం చంద్రకుమార్ ఎస్సై, పొత్కపల్లి గోలివాడకు 38 ఏళ్లు రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ గోదావరి నది ఒడ్డున ప్రతీరెండేళ్లకోసారి నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు 38 ఏళ్లుపూర్తికానున్నాయి. గోలివాడ గ్రామానికి చెందిన జాలిగామ కిషన్‌రావు అలియాస్ బయ్యాజీ అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఓసారి గోదావరినదిలో పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లగా అదే ప్రాంతంలో ఇసుకలో ఎరుపు బట్టలో కుంకుమ భరిణి మూట లభ్యమైంది. దాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన బయ్యాజీకి రాత్రి నిద్రలో సమ్మక్క కళలోకి వచ్చి నీకు లభ్యమైన కుంకుమ భరణి స్థానంలోనే శ్రీసమ్మక్క, సారలమ్మ, పగిడిద్దెరాజుల గద్దెలు నిర్మించి ప్రతీరెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. విషయాన్ని గ్రామ పెద్దలు పెండ్రు హన్మాన్రెడ్డి, ఆవుల చంద్రయ్యకు సమాచారం ఇచ్చి మరోసారి కుంకుమ భరణి లభ్యమైన ప్రాంతానికి వెళ్లి చూడగా మరోసారి పూజ సామగ్రి కనిపించడంతో మరింత నమ్మకం కుదిరింది. 1982లో అదే ప్రాంతంలో గద్దెల నిర్మాణం చేపట్టి తొలిసారి సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహించారు. అప్పటినుంచి జాతర వ్యవస్థాపకులతో జాతర నిర్వహణ కొనుసాగుతోంది. కోల్‌బెల్ట్‌లో 28 ఏళ్లుగా.. కోల్‌సిటీ/గోదావరిఖని(రామగుండం): గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సమ్మక్క–సారలమ్మ’ జాతర ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్దది. ఉమ్మడి జిల్లాలో సుమారు 60 ప్రాంతాలలో దేవాదాయశాఖ నేతృత్వంలో జాతర నిర్వహిస్తుండగా, వీటిలో ఎక్కువ ఆదాయం, లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ప్రాంతం గోదావరిఖనిలో జరుగుతున్న జాతర ఒక్కటే పెద్దది. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, ఆదిలాబాద్ నాలుగు జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన సమీపంలో రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు. 28 సంవత్సరాలుగా జాతర... వరంగల్ జిల్లాలోని మేడారం జాతరకు పారిశ్రామిక ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు తరలివెళ్లేవారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు ఎక్కువగా పాల్గొనేవి. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం, 1992లో తొలిసారిగా గోదావరిఖనిలోని గోదావరినది ఒడ్డున జాతర ఏర్పాటు చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి ఇక్కడే జాతర జరుగుతోంది. 1996లో జాతర నిర్వహణ బాధ్యతలు దేవాదాయశాఖ ఆధీనంలోకి రావడంతో అప్పటి నుంచి దేవాదాయశాఖ జాతర నిర్వహిస్తోంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, సింగరేణి తదితర సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి. నాలుగు జిల్లాల భక్తులకు అనుకూలం... పెద్దపల్లి– మంచిర్యాల–కొమురంభీం–ఆదిలాబాద్ నాలుగు జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన సమీపంలో నిర్వహిస్తున్న ఈ జాతరకు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, ఎన్టీపీసీ, సెంటనరీకాలనీ, యెటింక్లయిన్‌కాలనీ, కమాన్‌పూర్, మంథని, గుంజపడుగుతోపాటు మంచిర్యాల, కొమురంభీం, ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, చెన్నూర్, కిష్టాపూర్, ఇందారం, పౌనూర్, ఏలాల, కుందారం, శెట్టిపల్లి తదితర ప్రాంతాల ప్రజలు జాతరకు భారీగా తరలివస్తారు. వీరితోపాటు సింగరేణి కార్మికుల కుటుంబాలతో సత్సంబంధాలు కలిగిన జయశంకర్ జిల్లా నుంచి కూడా భక్తులు గోదావరిఖనిలో జరిగే జాతరకు తరలిరావడం గమనార్హం. రూ.లక్షల్లో ఆదాయం 2012 సంవత్సరంలో రూ.29 లక్షలు ఆదాయం రాగా, 2016లో 37 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2016లో సుమారు నాలుగున్నర లక్షల మంది భక్తులు హాజరయ్యారు. 2018లో రూ.41.32 లక్షల ఆదాయం రాగా, సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చారు. ఇప్పుడు కూడా సుమారు 6 నుంచి 8 లక్షల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని దేవాదాయశాఖ ఈవో డీ.వీ.మారుతిరావుతోపాటు ధర్మకర్తల మండలి ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు... రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డున దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతోపాటు నగరపాలక సంస్థ సంయుక్తంగా వన దేవతల జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలకు మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు. బూడిద ఇటుకలతో ఆలయ ప్రాంగణంతోపాటు భక్తులు క్యూలైన్లో ఫ్లోర్ నిర్మాణం చేపడుతున్నారు. బీ–గెస్ట్‌హౌజ్ సమీపంలోని దేవాలయంతోపాటు సమ్మక్క–సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రహరీగోడ, ముఖద్వారానికి రంగులు వేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జాతర మైదానం శుభ్రం చేయడంతోపాటు విద్యుత్ దీపాలంకరణకు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి ఒడ్డున మహిళలు దుస్తులు మార్చుకోవడానికి శాశ్వత గదులు నిర్మిస్తున్నారు. జాతర నిర్వహించే ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థంకోసం తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మహిళలు గోదావరిలో స్నానం చేయడానికి షవర్లు, దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మిస్తున్నారు. జాతర నిర్వహించే ప్రాంతంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ నుంచి మట్టిని పోసి దుమ్ములేవకుండా శుభ్ర పరుస్తున్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా, బల్దియా ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కానుకలు సమర్పించడానికి ప్రత్యేక హుండీలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి కొలనూర్ గ్రామంలో జరిగే జాతరకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహారాష్ట్రతోపాటు మిగతా జిల్లాలనుంచి వచ్చే భక్తులకు నీడ, తాగునీటి, వైద్యం, విద్యుత్, రహదార్లను బాగుచేశాం. దేవతలను దర్శనం చేసుకోవడానికి సులువుగా మార్గాలు ఏర్పాటు చేశాం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – బండారి ఐలయ్యయాదవ్, చైర్మన్ కొలనూర్ -
మహాజాతరకు నేడు అంకురార్పణ
ములుగు: రెండేళ్లకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరగనుంది. జాతరలో తొలి ఘట్టం(గుడిమెలిగె)తో మొదలు కానుంది. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించనున్నారు. సమ్మక్క–సారలమ్మ ఆలయా ల్లో కాక వంశీయులు, సిద్దబో యిన వంశీయులు తెచ్చిన గడ్డి తో పైకప్పుగా అలంకరిస్తారు. ఆలయంలోని బూజు దులిపి అమ్మవార్లకు దీపం పెడతారు. ఈ దీపాలు రెండేళ్ల తర్వాత వచ్చే మహాజాతర వరకు వెలు గుతూనే ఉంటాయి. కాగా, మేడారం జాతరలో 4 బుధవారాలకు ప్రాముఖ్యత ఉంటుంది. తొలి బుధవారం (ఈ నెల 22) గుడిమెలిగె, రెండో బుధవారం (29న) మండమెలిగె పూజలు జరుగుతాయి. మూడో బుధవా రం (ఫిబ్రవరి 5) మహాజాతర ప్రారంభమవుతుంది. నాలుగో బుధవారం (12) తిరుగువారం జాతరతో మహాజాతర ఘట్టం ముగుస్తుంది. జాతర క్రమం ఇలా.. ఫిబ్రవరి 5న ఉదయం సమ్మక్క సారలమ్మ ఆలయాల్లో పూజారు లు ముగ్గులు వేసి అలంకరిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, సారెలు సమర్పిస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగా రం మండలం పూనుగొండ్ల నుం చి పెనక వంశీయులు పగిడిద్ద రాజును, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి దబ్బగట్ల వంశీయుల ఆధ్వర్యంలో వడ్డె పోదెం బాబు గోవిందరాజులును తీసుకొచ్చి అమ్మవార్ల పక్కన ఉన్న గద్దెలపై ప్రతిష్టిస్తారు. సాయంత్రానికి ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కన్నెపల్లి నుంచి కాక వంశీయులు భారీ భద్రత మధ్య సారలమ్మను జంపన్న వాగును దాటుకుంటూ తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించడంతో జాతర ప్రారంభమవుతుంది. ప్రధాన ఘట్టాలు ఫిబ్రవరి 6: చిలుకలగుట్ట నుంచి సాయంత్రం సమ్మక్క తల్లిని ప్రభుత్వ లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఫిబ్రవరి 7: సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజులు గద్దెలపై ఉంటారు. దీంతో కోటి మందికి పైగా భక్తులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 8: అమ్మవార్లు తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినట్లవుతుంది. -
తనువంతా.. తన్మయం
కరీంనగర్ : డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య.. కోయపూజారులు వనంలోంచి తీసుకురాగా.. కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్క, సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరారు. ఇద్దరు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లావ్యాప్తంగా జాతర ప్రాంగణాలు కిటకిటలాడాయి. పల్లె, పట్నం తేడాలేకుండా భక్తులదారులన్నీ జాతరవైపే కదిలాయి. మదినిండా అమ్మవార్లను ఉంచుకుని మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం వనదేవతలైన తల్లీబిడ్డలకు ఒడిబియ్యం సమర్పించారు. పసుపు, కుంకుమతోపాటు ఎత్తుబంగారం(బెల్లం) సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు. పోటెత్తిన జనం... జిల్లావ్యాప్తంగా 31 చోట్ల జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. కరీంనగర్‌కు అనుకుని ఉన్న రేకుర్తి జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు, హుజూరాబాద్‌లోని రంగనాయకులగుట్ట జాతరకు రెండున్నర లక్షలు, చింతకుంట, నగునూర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, ఇరుకుల్ల, బొమ్మకల్, జూపాక, సైదాపూర్, జమ్మికుంట, కేశవపట్నం, చొప్పదండి , ఆర్నకొండ, గుమ్లాపూర్, రాగంపేట, గంగాధర మండలం బూరుగుపల్లి, రామడుగు, తిర్మలాపూర్, గుండి, జమ్మికుంట, తనుగుల, వావిలాల, ఇల్లందకుంట, గన్నేరువరం, మానకొండూర్, దేవంపల్లి, కొండపల్కల, లింగాపూర్ జాతరకు సుమారు 50 వేల నుంచి లక్ష మధ్య భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పలుచోట్ల జాతరలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకుని భక్తుల ఏర్పాట్లు పరిశీలించారు. నేడు వనంలోకి.. నాలుగు రోజులపాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మ శనివారం సాయంత్రం కోయపూజారుల మధ్య వనం బాట పట్టనున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర ఘట్టం ముగిసినట్లవుతుంది. నగర రోడ్లు నిర్మానుష్యం.. ఎప్పుడూ వాహనాల రద్దీతో గజిబిజిగా ఉండే జిల్లాకేంద్రంలోని రోడ్లన్నీ నాలుగు రోజులుగా నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రధాన చౌరస్తాలైన తెలంగాణచౌక్, కోర్టుచౌక్, కమాన్‌చౌక్, టవర్‌సర్కిల్, మంకమ్మతోట లేబర్ అడ్డా, మంచిర్యాల చౌరస్తా, రాంనగర్ చౌరస్తాలు సైతం బోసిపోయాయి. -
నేటి నుంచి పెద్దగట్టు జాతర
ఐదు రోజులపాటు లింగమంతులస్వామి ఉత్సవాలు.. సూర్యాపేట: నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. వంద ఏళ్ల చరిత్ర గల ఈ జాతరను రెండేళ్ల కొకసారి ఐదు రోజులపాటు జరుపుకొంటారు. తెలంగాణ తోపాటు, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆది వారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే ఈ జాతర.. 12వ తేదీ మకర తోరణం తరలింపుతో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి జాతర కావడంతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు ఇతర ప్రముఖలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ జాతరకు సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. -
మనసారా మొక్కులు
గద్దెపై నుంచి గుడికి చేరిన సమ్మక్క తల్లి దారిపొడవునా భక్తుల పొర్లు దండాలు కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు సారలమ్మకు సుంకు వడ్ల సమర్పణ గిరిజనుల ఇంటింటా సమ్మక్క పండుగ మేడారం మినీ జాతరకు రెండో రోజు గురువారం భక్తులు పోటెత్తారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగారుు. వందలాది వాహనాలతో వనదారులు, వేలాది మందితో ఆలయ గద్దెలు, జంపన్న వాగు చుట్టుపక్కల ప్రదేశాలు కిటకిట లాడారుు.. శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కులతో మేడారం పులకించగా.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. - ములుగు/ తాడ్వాయి మేడారం (తాడ్వాయి) : మేడారంలో బుధవారం అర్థరాత్రి గద్దెపై కొలువుదీరిన సమ్మక్క తల్లి తిరిగి గురువారం ఉదయం గుడికి చేరుకుంది. మండమెలిగే పండుగ రోజున బుధవారం రాత్రి మేడారంలోని గుడి నుంచి ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య పసుపు, కుంకుమలు పట్టుకుని డోలివాయిద్యాలతో గద్దెపై ప్రతిష్టించారు. ఆ రాత్రింతా పూజారులు గద్దెల వద్ద జాగారంతో సంబరాలు జరుపుకున్నారు. తిరిగి ఉదయం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తల్లిని గుడికి చేర్చారు. గద్దె నుంచి తల్లిని గుడికి తీసుకువచ్చే క్రమంలో భక్తులు దారిపొడవునా పొర్లు దండాలు పెట్టారు. తల్లి గుడికి చేరిన అనంతరం పూజారులు తలంటు స్నానాలు ఆచరించారు. మళ్లీ గుడికి చేరుకుని సమ్మక్కకు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలోని గిరిజనులందరూ తమతమ ఇళ్లల్లో సమ్మక్క పండుగ చేసుకున్నారు. సమ్మక్కకు యాటమొక్కు మేడారం గద్దెల వద్ద బుధవారం రాత్రింతా సమ్మక్క పూజారులతో కలిసి జాగారం చేసిన సారలమ్మ పూజారులు గురువారం ఉదయం కన్నెపల్లికి చేరుకున్నారు. సారలమ్మ పూజారి కాక సారయ్య, ఇతర పూజారులు స్నానమాచరించి గుడికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం సమ్మక్కకు సారలమ్మ పూజారులు యాటను మొక్కి బలిచ్చారు. సంప్రదాయబద్ధంగా కులపెద్దలందరికీ పంచి పెట్టారు. వచ్చే బుధవారం తిరుగువారం పండుగ వరకు సారలమ్మ గుడి వద్ద డోలీలతో జాగారం నిర్వహించనున్నారు. సారలమ్మకు సుంకు వడ్లు కన్నెపల్లిలో సారలమ్మకు గిరిజనులు సంకు వడ్లు సమర్పించారు. సోలం వెం కటేశ్వర్లు తల్లి గురువారం వడ్లతో గుడికి వచ్చి పసుపు, కుంకుమ, పూలతో పూజలు నిర్వహించారు. ధాన్యం పండించిన గిరిజనులు సారలమ్మకు ముందుగా సుంకు వడ్లు సమర్పించిన తర్వాతనే అమ్ముకోవడం ఆనవారుుతీగా వస్తోంది. -
మండమెలిగే.. మేడారం వెలిగే...
అర్ధరాత్రి కొలువుదీరిన సమ్మక్క తల్లి సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర షురూ.. సంప్రదాయబద్ధంగా పూజలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు మండమెలిగే పండుగతో బుధవారం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభమైంది. భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క తల్లి అర్ధరాత్రి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్క గుడి నుంచి ప్రధాన పూజారి కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు. మొదటి రోజు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించారు. గిరిజన ఇలవేల్పులైన తల్లులకు చీరసారెతోపాటు పసుపు, కుంకుమ, బెల్లంతోపాటు కానుకలు సమర్పించారు. - మేడారం (తాడ్వాయి) మేడారం (తాడ్వాయి) : మేడారంలో మండమెలిగే పండుగతో బుధవారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర వైభవంగా ప్రారంభమైంది. గిరిజన ఇలవేల్పులైన తల్లులకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క ప్రధాన పూజరి కొక్కెర కృషయ్య ఒక్క పొద్దుతో సమ్మక్క గుడ్డిని శుద్ధి చేశారు. సిద్దబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి దగ్గర పూజారులందరూ కలిసి మామిడాకుల తోరణాలను తయారు చేశారు. అనంతరం ఆయన ఇంటి నుంచి పసుపు, కుంకుమ, చెంబులో నీళ్లు పట్టుకుని డోలివాయిద్యాలతో సమ్మక్క గుడికి వెళ్లి తల్లి గద్దెకు పసుపు, కుంకుమ పెట్టారు. ఊరు పోలిమేరలోని పోచమ్మగుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామదేవతకూ పూజలు నిర్వహించారు. అనంతరం సిద్దబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలను తీసుకుని మేడారం ప్రధాన రోడ్డుకు రెండు దారుల్లో దుష్టశక్తులు రాకుండా బురుగు కర్రలతో గజ స్తంభాలు పాతి. మామిడాకుల తోరణానికి మిరప కాయలు, కోడిపిల్ల కట్టారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య, పూజారులు సిద్దబోయిన మునేందర్, లక్ష్మన్‌రావు, బొక్కెన్న, మల్లె ల ముత్తయ్య పసుపు, కుంకుమలతో పూజలు చేసి, నీళ్లు, సారాతో రోడ్డుకు అడ్డంగా ఆరగించారు. ఈ తంతు ముగిసిన తర్వాత ఆడపడుచులు పసుపు, కుంకుమలతో గుడిలో సమ్మ క్క గద్దె, పీఠాన్ని అలంకరించారు. సాయంత్రం సమయంలో పూజారులు గుడిలో ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో గుడి నుంచి పూజారి కొక్కెర కృష్ణయ్య మిగతా పూజారులతో కలిసి దేవతను తీసుకొని సమ్మక్క గద్దె వద్ద ప్రతిష్టించారు. గద్దె వద్ద పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ భక్తులు, ఇతరులను ఆల యంలోని ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక రాత్రంతా సమ్మక్క పూజారులు జాగారాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పూజారుల సంఘం మండల అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సారలమ్మ గుడిలో... కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజరి కాక సారయ్య ఒక పొద్దుతో ఉదయం 10 గంటలకు గుడి శుద్ధి చేశారు. హడారాల గుండాలను పసుపు, కుంకుమలతో అలంకరించారు. మామిడి ఆకులతో కంకణాలను తయారు చేసి, పూజా సామగ్రికి కట్టారు. అనంతరం ధూపదీపాలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 11 గంటల సమయంలో సారలమ్మ పూజారులు, గ్రామపెద్దలు సంప్రదాయబద్ధంగా కంకణాలు కట్టుకుని, సాకహనంతో సమ్మక్క గద్దె వద్దకు వెళ్లారు. సమ్మక్క పూజారులకు సాకహనం అప్పగించి జాగారాలతో సంబరాలు జరుపుకున్నారు. చర్ప ఇంటి నుంచి చేలపెయ్యా... మేడారం సమీపంలోని ఊరట్టంలో దివంగత మాజీ ఎమ్మెల్యే చర్ప భోజారావు ఇంటి నుంచి చర్ప కుటుంబ సభ్యులు సమ్మక్క పూజారులతో కలిసి చెలపెయ్యాను సమ్మక్క గద్దెకు డోలివాయిద్యాలతో తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. చేలపెయ్యాను తీసుకురావాడానికి ముం దుగా చర్ప భోజారావు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏడాది మండమెలిగే పండుగ సందర్భంగా చర్ప భోజారావు ఇంటి నుంచి సమ్మక్క పూజారులు చేలపెయ్యాను ఇవ్వడం అనవాయితీగా వస్తోంది.