గోదావరిఖనిలో సమ్మక్క సారాలమ్మ గద్దె
సాక్షి, సుల్తానాబాద్(పెద్దపల్లి): మినీ మేడారంగా ప్రసిద్ధిగాయించిన నీరుకుల్ల–వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న రంగానాయకస్వామి ఆలయం సమీపంలోని సమ్మక్క–సారలమ్మ జాతర వైభవంగా జరగనుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు పెద్దపల్లి జిల్లా నుంచేకాక ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. జారత ప్రదేశంలో మానేరు నది, గుట్టలు, పచ్చని చెట్లతో ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దాదాపు 3–4లక్షల భక్తులు దర్శించుకుంటారని అంచానం.
గర్రెపల్లిలో 30 ఏళ్లుగా..
గర్రెపల్లిలో రాజీవ్‌రాహదారికి అనుకోని ఉన్న తిరుమలయ్యగుట్టపై 30 ఏళ్లుగా సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతుంది. మేడారం కొయపూజారులతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. రెండేళ్లకోసారి జరిగే జాతర సుమారు లక్షయాభైకిపైగా మంది భక్తులు వస్తారు. భక్తులస్నానాలకు షవర్లు, చాలువ పందిర్లు, తాగునీటి, సాముహిక మరుగుదొడ్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు.
46 ఏళ్లుగా కొలనూర్‌లో..
ఓదెల(పెద్దపల్లి): చుట్టూగుట్టలు..మూడువైపులా రహదార్లు..ప్రధాన రహదారికి పక్కనగల జంపన్నవాగు..సమ్మక్కసారలమ్మ గద్దెలపైకి కోయపూజారులతో ప్రతిష్ఠాపన రోజున శివసత్తుల పూనకాలతో దద్దరిల్లె ధనగుట్టలు కొలనూర్ శ్రీసమ్మక్కసారలమ్మ జాతర ప్రత్యేకతలు. పెద్దపల్లి జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే ఓదెల మండలం కొలనూర్ గ్రామంలోని సమ్మక్కసారలమ్మ జాతర గద్దెలు ముస్తాబయ్యాయి. ఫిబ్రవరి 5నుంచి 8వరకు జరిగే సమ్మక్కసారలమ్మ జాతర దర్శనంకోసం భక్తులు భారీగా తరలిరానున్నారు.
1974లో ప్రారంభమైన జాతర నేటికి 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలనుంచి భక్తులు అధికసంఖ్యలో వస్తారు. ఈనెల 5న సారలమ్మ గద్దెకు , 6న రాత్రి సమ్మక్కగద్దెకు వచ్చుట, 7న భక్తులు మొక్కులు సమర్పించుట, 8న దేవతల వనప్రవేశం ఉంటుంది. హైదరాబాద్, కొత్తగూడెం, నాగపూర్, సిర్‌పూర్‌కాగజ్‌నగర్ నుంచి రైళ్లతోపాటు ఆర్టీసీ, ప్రయివేట్ వాహనాల సౌకర్యం ఉంది.
పటిష్ట బందోబస్తు
పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనూర్ గ్రామంలో జరిగే సమ్మక్కసారలమ్మ జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫ్లెక్సీల ఏర్పాట్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం నిషేధం.
– పెట్టెం చంద్రకుమార్ ఎస్సై, పొత్కపల్లి
గోలివాడకు 38 ఏళ్లు
రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ గోదావరి నది ఒడ్డున ప్రతీరెండేళ్లకోసారి నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు 38 ఏళ్లుపూర్తికానున్నాయి. గోలివాడ గ్రామానికి చెందిన జాలిగామ కిషన్‌రావు అలియాస్ బయ్యాజీ అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఓసారి గోదావరినదిలో పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లగా అదే ప్రాంతంలో ఇసుకలో ఎరుపు బట్టలో కుంకుమ భరిణి మూట లభ్యమైంది. దాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన బయ్యాజీకి రాత్రి నిద్రలో సమ్మక్క కళలోకి వచ్చి నీకు లభ్యమైన కుంకుమ భరణి స్థానంలోనే శ్రీసమ్మక్క, సారలమ్మ, పగిడిద్దెరాజుల గద్దెలు నిర్మించి ప్రతీరెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
విషయాన్ని గ్రామ పెద్దలు పెండ్రు హన్మాన్‌రెడ్డి, ఆవుల చంద్రయ్యకు సమాచారం ఇచ్చి మరోసారి కుంకుమ భరణి లభ్యమైన ప్రాంతానికి వెళ్లి చూడగా మరోసారి పూజ సామగ్రి కనిపించడంతో మరింత నమ్మకం కుదిరింది. 1982లో అదే ప్రాంతంలో గద్దెల నిర్మాణం చేపట్టి తొలిసారి సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహించారు. అప్పటినుంచి జాతర వ్యవస్థాపకులతో జాతర నిర్వహణ కొనుసాగుతోంది.
కోల్‌బెల్ట్‌లో 28 ఏళ్లుగా..
కోల్‌సిటీ/గోదావరిఖని(రామగుండం): గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సమ్మక్క–సారలమ్మ’ జాతర ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్దది. ఉమ్మడి జిల్లాలో సుమారు 60 ప్రాంతాలలో దేవాదాయశాఖ నేతృత్వంలో జాతర నిర్వహిస్తుండగా, వీటిలో ఎక్కువ ఆదాయం, లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ప్రాంతం గోదావరిఖనిలో జరుగుతున్న జాతర ఒక్కటే పెద్దది. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, ఆదిలాబాద్ నాలుగు జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన సమీపంలో రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు.
28 సంవత్సరాలుగా జాతర...
వరంగల్ జిల్లాలోని మేడారం జాతరకు పారిశ్రామిక ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు తరలివెళ్లేవారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు ఎక్కువగా పాల్గొనేవి. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం, 1992లో తొలిసారిగా గోదావరిఖనిలోని గోదావరినది ఒడ్డున జాతర ఏర్పాటు చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి ఇక్కడే జాతర జరుగుతోంది. 1996లో జాతర నిర్వహణ బాధ్యతలు దేవాదాయశాఖ ఆధీనంలోకి రావడంతో అప్పటి నుంచి దేవాదాయశాఖ జాతర నిర్వహిస్తోంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, సింగరేణి తదితర సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి.
నాలుగు జిల్లాల భక్తులకు అనుకూలం...
పెద్దపల్లి– మంచిర్యాల–కొమురంభీం–ఆదిలాబాద్ నాలుగు జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన సమీపంలో నిర్వహిస్తున్న ఈ జాతరకు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, ఎన్టీపీసీ, సెంటనరీకాలనీ, యెటింక్లయిన్‌కాలనీ, కమాన్‌పూర్, మంథని, గుంజపడుగుతోపాటు మంచిర్యాల, కొమురంభీం, ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, చెన్నూర్, కిష్టాపూర్, ఇందారం, పౌనూర్, ఏలాల, కుందారం, శెట్టిపల్లి తదితర ప్రాంతాల ప్రజలు జాతరకు భారీగా తరలివస్తారు. వీరితోపాటు సింగరేణి కార్మికుల కుటుంబాలతో సత్సంబంధాలు కలిగిన జయశంకర్ జిల్లా నుంచి కూడా భక్తులు గోదావరిఖనిలో జరిగే జాతరకు తరలిరావడం గమనార్హం.
రూ.లక్షల్లో ఆదాయం
2012 సంవత్సరంలో రూ.29 లక్షలు ఆదాయం రాగా, 2016లో 37 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2016లో సుమారు నాలుగున్నర లక్షల మంది భక్తులు హాజరయ్యారు. 2018లో రూ.41.32 లక్షల ఆదాయం రాగా, సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చారు. ఇప్పుడు కూడా సుమారు 6 నుంచి 8 లక్షల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని దేవాదాయశాఖ ఈవో డీ.వీ.మారుతిరావుతోపాటు ధర్మకర్తల మండలి ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు...
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డున దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతోపాటు నగరపాలక సంస్థ సంయుక్తంగా వన దేవతల జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలకు మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు. బూడిద ఇటుకలతో ఆలయ ప్రాంగణంతోపాటు భక్తులు క్యూలైన్‌లో ఫ్లోర్ నిర్మాణం చేపడుతున్నారు.
బీ–గెస్ట్‌హౌజ్ సమీపంలోని దేవాలయంతోపాటు సమ్మక్క–సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రహరీగోడ, ముఖద్వారానికి రంగులు వేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జాతర మైదానం శుభ్రం చేయడంతోపాటు విద్యుత్ దీపాలంకరణకు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి ఒడ్డున మహిళలు దుస్తులు మార్చుకోవడానికి శాశ్వత గదులు నిర్మిస్తున్నారు. జాతర నిర్వహించే ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థంకోసం తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మహిళలు గోదావరిలో స్నానం చేయడానికి షవర్లు, దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మిస్తున్నారు.
జాతర నిర్వహించే ప్రాంతంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ నుంచి మట్టిని పోసి దుమ్ములేవకుండా శుభ్ర పరుస్తున్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా, బల్దియా ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కానుకలు సమర్పించడానికి ప్రత్యేక హుండీలు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తయ్యాయి
కొలనూర్ గ్రామంలో జరిగే జాతరకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహారాష్ట్రతోపాటు మిగతా జిల్లాలనుంచి వచ్చే భక్తులకు నీడ, తాగునీటి, వైద్యం, విద్యుత్, రహదార్లను బాగుచేశాం. దేవతలను దర్శనం చేసుకోవడానికి సులువుగా మార్గాలు ఏర్పాటు చేశాం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం.
– బండారి ఐలయ్యయాదవ్, చైర్మన్ కొలనూర్
Comments
Please login to add a commentAdd a comment