మండమెలిగే.. మేడారం వెలిగే... | start to medarm mn jathara | Sakshi
Sakshi News home page

మండమెలిగే.. మేడారం వెలిగే...

Published Thu, Feb 5 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

మండమెలిగే.. మేడారం వెలిగే...

మండమెలిగే.. మేడారం వెలిగే...

అర్ధరాత్రి కొలువుదీరిన సమ్మక్క తల్లి  సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర షురూ..
సంప్రదాయబద్ధంగా పూజలు  భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు

 
మండమెలిగే పండుగతో బుధవారం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభమైంది.  భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క తల్లి అర్ధరాత్రి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్క గుడి నుంచి ప్రధాన  పూజారి కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు. మొదటి రోజు  వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించారు. గిరిజన ఇలవేల్పులైన తల్లులకు చీరసారెతోపాటు పసుపు, కుంకుమ, బెల్లంతోపాటు కానుకలు సమర్పించారు.
 - మేడారం (తాడ్వాయి)  
 
 మేడారం (తాడ్వాయి) : మేడారంలో మండమెలిగే పండుగతో బుధవారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర వైభవంగా ప్రారంభమైంది. గిరిజన ఇలవేల్పులైన తల్లులకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క ప్రధాన పూజరి కొక్కెర కృషయ్య ఒక్క పొద్దుతో సమ్మక్క గుడ్డిని శుద్ధి చేశారు. సిద్దబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి దగ్గర పూజారులందరూ కలిసి మామిడాకుల తోరణాలను తయారు చేశారు. అనంతరం ఆయన ఇంటి నుంచి పసుపు, కుంకుమ, చెంబులో నీళ్లు పట్టుకుని డోలివాయిద్యాలతో సమ్మక్క గుడికి వెళ్లి తల్లి గద్దెకు పసుపు, కుంకుమ పెట్టారు. ఊరు పోలిమేరలోని పోచమ్మగుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామదేవతకూ పూజలు నిర్వహించారు. అనంతరం సిద్దబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలను తీసుకుని మేడారం ప్రధాన  రోడ్డుకు రెండు దారుల్లో దుష్టశక్తులు రాకుండా బురుగు కర్రలతో గజ స్తంభాలు పాతి.

మామిడాకుల తోరణానికి మిరప కాయలు, కోడిపిల్ల కట్టారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య, పూజారులు సిద్దబోయిన మునేందర్, లక్ష్మన్‌రావు, బొక్కెన్న, మల్లె ల ముత్తయ్య పసుపు, కుంకుమలతో పూజలు చేసి, నీళ్లు, సారాతో రోడ్డుకు అడ్డంగా ఆరగించారు. ఈ తంతు ముగిసిన తర్వాత ఆడపడుచులు పసుపు, కుంకుమలతో గుడిలో సమ్మ క్క గద్దె, పీఠాన్ని అలంకరించారు. సాయంత్రం సమయంలో పూజారులు గుడిలో ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో గుడి నుంచి పూజారి కొక్కెర కృష్ణయ్య మిగతా పూజారులతో కలిసి దేవతను తీసుకొని సమ్మక్క గద్దె వద్ద ప్రతిష్టించారు. గద్దె వద్ద పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ భక్తులు, ఇతరులను ఆల యంలోని ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక రాత్రంతా సమ్మక్క పూజారులు జాగారాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పూజారుల సంఘం మండల అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సారలమ్మ గుడిలో...

కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజరి కాక సారయ్య ఒక పొద్దుతో ఉదయం 10 గంటలకు గుడి శుద్ధి చేశారు.  హడారాల గుండాలను పసుపు, కుంకుమలతో అలంకరించారు. మామిడి ఆకులతో కంకణాలను తయారు చేసి, పూజా సామగ్రికి కట్టారు. అనంతరం ధూపదీపాలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి  11 గంటల సమయంలో సారలమ్మ పూజారులు, గ్రామపెద్దలు సంప్రదాయబద్ధంగా కంకణాలు కట్టుకుని, సాకహనంతో సమ్మక్క గద్దె వద్దకు వెళ్లారు. సమ్మక్క పూజారులకు సాకహనం అప్పగించి జాగారాలతో సంబరాలు జరుపుకున్నారు.
 
చర్ప ఇంటి నుంచి చేలపెయ్యా...

 మేడారం సమీపంలోని ఊరట్టంలో దివంగత మాజీ ఎమ్మెల్యే చర్ప భోజారావు ఇంటి నుంచి చర్ప కుటుంబ సభ్యులు సమ్మక్క పూజారులతో కలిసి చెలపెయ్యాను సమ్మక్క గద్దెకు డోలివాయిద్యాలతో  తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. చేలపెయ్యాను తీసుకురావాడానికి ముం దుగా చర్ప భోజారావు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏడాది మండమెలిగే పండుగ సందర్భంగా చర్ప భోజారావు ఇంటి నుంచి సమ్మక్క పూజారులు చేలపెయ్యాను ఇవ్వడం అనవాయితీగా వస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement