మహాజాతర జరిగే మేడారం ప్రాంత విహంగ వీక్షణం
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది. కోరిన కోర్కెలు తీర్చే సారలమ్మ.. మేడారంలోని గద్దెపై కొలువుదీరే ఘడియలు దగ్గరపడుతున్నాయి. కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్ల బండ్లు.. అన్ని మేడారం బాటపడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. కొన్ని గంటల్లో మొదలయ్యే మేడారం జాతరకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు.
కన్నెపల్లి నుంచి సారలమ్మ ఆగమనం..
వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువు తీరనుంది. పూజారులు ఇందుకోసం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే ఏటూరునాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును సైతం మేడారం గద్దెల వద్దకు తీసుకొస్తారు. మంగళవారమే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పయనమయ్యాడు. పూనుగొండ్ల నుంచి కాలిబాటన 50 కిలోమీటర్లు ఉండటంతో వడ్డెలు ముందుగానే బయల్దేరారు. మేడారానికి సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చే వేడుకను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
సీసీ కెమెరాల నిఘా
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకు ఈ సారి 1.4 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ప్రత్యేకాధికారులు వీపీ గౌతమ్, వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ నేతృత్వంలో యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరలో సౌకర్యాల కల్పనకు రాష్ట్రప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టీఎస్‌ఆర్టీసీ 4,105 బస్సులను నడుపుతోంది. భక్తులకు సౌకర్యం కోసం పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు. గతంలో జాతరకు వెళ్లి వచ్చేందుకు రెండే ప్రధాన మార్గాలు ఉండేవి. ఈసారి ఆరు మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లి రావచ్చు.
మేడారం జాతర ప్రదేశంలో 300 సీసీ కెమెరాలతో భద్రతా చర్యలు, జాతర నిర్వహణ కోసం 12 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేం దుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందిం చింది. జాతరకు వచ్చే భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా 3.6 కిలోమీటర్ల పొడవునా స్నానఘట్టాలు నిర్మిం చారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెల పక్కనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment