అమ్మవార్లకు ఒడిబియ్యంతో మొక్కులు చెల్లిస్తున్న మహిళ
జంపన్నవాగులో స్నానం
జంపన్నవాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. ఒకప్పటి సంపెంగ వాగే నేటి జంపన్నవాగు. ఇప్పుడు స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతనే తల్లుల దర్శనానికి వెళ్తారు. జంపన్నవాగు ఒడ్డున తలనీలాలు సమర్పిస్తారు.
ఎదుర్కోళ్లు..
అమ్మలను గద్దెలకు తీసుకొచ్చే క్రమంలో భక్తులు ఎదుర్కోళ్లతో ఆహ్వానం పలుకుతారు. తమ చేతుల్లో ఉన్న కోడిని ఎదురునా చేస్తూ మనసారా మొక్కుతుంటారు.
శివసత్తుల పూనకాలు
జంపన్నవాగులో శివసత్తుల పూనకాలు మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలతో పాటు పురుషులు కూడా శివాలూగుతూ జాతరకు వస్తారు. వీరంతా తొలుత జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. తర్వాత పసుపుతో అలంకరించుకుంటారు.
ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం
సమ్మక్క తల్లిని నిష్ఠగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుంటారు. చీర సారె కట్టుకొని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివమెత్తుతారు.
లక్ష్మీదేవర మొక్కు
లక్ష్మీదేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుంది. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడువునా నృత్యం చేస్తూ గద్దెలకు వస్తారు. ఆయనకు గద్దెల వద్ద డోలు, గజ్జెల మోతతో చప్పుళ్లు చేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు.
ఒడి బియ్యం
భక్తులు తల్లులను ఆడపడుచులుగా భావిస్తూ ఒడిబియ్యం మొక్కులు చెల్లిస్తారు. తమ ఇళ్లలోనే నూతన వస్త్రం, జాకిటి, కొబ్బరి కుడుక, పోక, కజ్జుర, నాణంను ఒడిబియ్యంలో కలిపి శివసత్తులకు పోస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు.
మేకలు, కోళ్ల బలి
మేడారం జాతరలో కోళ్లు, మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. వనదేవతలకు దర్శించుకునే ముందు భక్తులు రెండు కొబ్బరి కాయలు కొడతారు. ఈ సమీపంలో పసుపు, కుంకుమతో పాటు అగరవత్తులు వెలిగించి దేవతలకు మొక్కుతారు.
మేడారంలో ప్రారంభమైన సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తులు తీరొక్క మొక్కులు చెల్లిస్తుంటారు. సంతానం కలగాలని, ప్రభుత్వ ఉద్యోగం రావాలని, వ్యాపారంలో బాగా స్థిరపడాలని, కూతురికి మంచి వివాహ సంబంధం రావాలని అమ్మలను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కోర్కెలు తీరిన వారు కోళ్లు, యాటలు, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, చీర సారెలు సమర్పించి వనదేవతల ఆశీర్వాదం పొందుతారు. జాతరలో తీరొక్క మొక్కులపై ప్రత్యేక కథనం. – ఏటూరునాగారం
గద్దెల వద్ద చెట్టుకు ఊయల కడుతున్న భక్తురాలు
Comments
Please login to add a commentAdd a comment