తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఉపయోగిస్తున్న వాహనం కండిషన్ మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థికమంత్రి ఉపయోగించే వాహనానికి ఉన్న నాలుగు టైర్లూ బాగా అరిగిపోయినా వాటిని మార్చకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొట్టిన వాహనం వెనకవైపు టైరు బరస్ట్ అయినట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. ముందు టైర్లు, వెనక టైర్లు కూడా బాగా అరిగిపోయాయి.
ఇదే వాహనం ఇంతకుముందు నెలరోజుల క్రితం ఒకసారి ప్రమాదానికి గురైంది. అప్పట్లో తాడిచెట్టును ఢీకొన్న ఈ వాహనం బాగా ధ్వంసమైంది. తర్వాత దానికి మరమ్మతులు చేయించారు. కనీసం ఆ సమయంలోనైనా వాహనం టైర్ల గురించి పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సుదూర పర్యటనలకు సైతం ఉపయోగించే అధికారిక వాహనం టైర్లు అరిగిపోయినా.. వాటిని మార్చాల్సిన సమయం మించిపోయినా పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే అది అదుపుతప్పి బోల్తాపడిందా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పరామర్శ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంత్రి ఈటల రాజేందర్కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్లోని అపోలో రీచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్తో ఆయన మాట్లాడారు. కాగా, మంత్రి రాజేందర్కు తగిలినవి స్వల్ప గాయాలేనని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ బోయినపల్లి వినోద్ తెలిపారు.