డాక్టర్లు లేకపోవడంతో జూనియర్ డాక్టర్‌తో మాట్లాడుతున్న మంత్రి
సాక్షి, ఎంజీఎం,(వరంగల్) : ‘పేద ప్రజలకు వైద్యసేవలందించేందుకు సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడం బాధాకరం.. ప్రైవేట్ ఆస్ప్రతుల్లో విధులు నిర్వర్తించడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉదయం 9 గంటలకు హాజరై 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సిందే. ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో చాలా పొరపాట్లు కనిపించాయి.. మొదటిసారి తనిఖీ చేశాం కాబట్టి విధులు హాజరు కాని వైద్యులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలో.. ఏ విధంగా వారికి కౌన్సిలింగ్ చేయాలో కలెక్టర్, సూపరింటెండెంట్‌కు వివరించాను. మరోసారి ఈ విధంగా జరిగితే సీరియస్‌గా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రికి కావాల్సిన వసతులు, సౌకర్యాలు సిబ్బందిని సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజీఎం ఆస్పత్రిలో మెరుగైన సేవలందించేందుకు ఎన్ని నిధులు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారని.. సీనియర్ వైద్యులు అందుబాటులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. వారం రోజుల్లో దాతలు అందించిన రూ.కోటి విరాళంతో ఫర్నీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
కలెక్టర్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ
వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలిసి ఉదయం 10 గంటల సమయంలో ఆకస్మికంగా వచ్చారు. మొదట మెడికల్ ఓపీ విభాగాన్ని సందర్శించి రోగులకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు. ఆ సమయంలో ఓపీ విభాగంలో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఆరా తీశారు. అయితే, మంత్రి తనిఖీకి వచ్చారని తెలుసుకున్న వైద్యులు పరుగు పరుగున చేరుకున్నారు. అనంతరం కార్డియాలజీ విభాగాన్ని సందర్శించి మంత్రి విధుల్లో ఉండాల్సిన వైద్యురాలు మమత ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆమె విధులు రాకపోవడమేమిటని సూపరింటెండెంట్ అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టర్ సాబ్.. ఏం చేద్దాం..
ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ విబాగాన్ని తనిఖీ చేసిన సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాకుండా జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్యులు మాత్రమే కనిపించడంతో మంత్రి దయాకర్‌రావు నివ్వెరపోయారు. ‘కలెక్టర్ సాబ్.. ఎంజీఎంను ఎట్టా బాగు చేద్దాం’ అంటూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో చర్చించారు. అనంతరం ఈఎన్‌టీ విభాగానికి చేరుకుని ప్రొఫెసర్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఈఎన్‌టీ ప్రొఫెసర్ డాక్టర్ పరశురాములుతో ఫోన్‌లో మాట్లాడారు. కేఎంసీలో ఉన్నానని ఆయన సమాధానం చెప్పగా సరైన సమాధానం కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సర్జికల్ విభాగానికి వెళ్లగా అక్కడ సైతం వైద్యులు లేకపోవడంతో ఫోన్‌లో డాక్టర్ రాజారాంతో మాట్లాడారు. తా ను సెలవులో ఉన్నానని సమాధానం వచ్చింది.
అభివృద్ధి పనుల పరిశీలన
రూ. 4 కోట్లతో దఫాల వారీగా ఎంజీఎం ఆస్పత్రిలో చేపడుతున్న పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఎస్‌ఎంఎస్‌ఐడీసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఐఎంఎసీ వార్డులో మరమ్మతుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం క్యాజువాలిటీ విభాగానికి చేరుకుని వైద్యం అందుతున్న తీరుపై రోగులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు.
నలుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు
ఎంజీఎం ఆస్పత్రిని మంత్రి దయాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్బంగా విధులకు హాజరుకాని వైద్యులు మమత, రాజారం, పరశురాములు, జె. వెంకటేశ్లర్లకు మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం వైద్యులు ఇచ్చే వివరణతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బయోమెట్రిక్ అమలు చేయాల్సిందే..
పేద ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది హాజరును నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని నూరు శాతం అమలు చేయాల్సిందేనని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. మంత్రి తనిఖీ చేసిన అనంతరం వివిధ విభాగాధిపతులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔట్ పెషెంట్ విభాగంలో వైద్యులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీలో చికిత్స అందించే సమయంలో వైద్యనిపుణులు తప్పకుండా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. విభాగాధిపతులు సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు.
మంత్రి దయాకర్‌రావు వ్యక్తిగత చొరవతో నిధులు సమీకరించి సూపర్‌స్పెషాలిటీ సేవలను అందరికీ అందుబాటులోకు తెచ్చేందుకు చేస్తున్న కృషికి అండగా నిలవాలని సూచించారు. డ్యూటీ సమయంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించి వైద్యసేవలందించాలని కోరారు. అనంతరం ఆస్పత్రుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇంజ నీరింగ్ అధికారులతో కలిసి చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment