ఉద్యోగులను వెనక్కుపంపడం ఏకపక్షం
- అక్కడివారికి తెలంగాణలో పోస్టింగ్‌లు ఇవ్వబోం
- తెలంగాణ స్థానికులను అక్కడికి పంపలేం
- ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేనికి మంత్రి హరీశ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జోన్‌ల పరిధిలో ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న అక్కడి స్థానికత కలిగిన నీటిపారుదల శాఖ ఉద్యోగులను వెనక్కు పంపుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సాకుగా చూపుతూ, ఉద్యోగులపై ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా ఇక్కడికి పంపించారంటూ అభ్యంతరం తెలిపింది.
ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులకు తెలంగాణలో పోస్టింగ్‌లు ఇవ్వబోమని, అదే సమయంలో ఏపీ జోన్‌ల పరిధిలో ఎంపికై తెలంగాణలో పనిచేస్తున్న ఇక్కడి స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీకి పంపలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు ఏపీ నీటి పారుదల శాఖా మంత్రికి సోమవారం ఘాటుగా లేఖ రాశారు.
తెలంగాణకు సంబంధించిన 5, 6 జోన్‌ల పరిధిలో ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను సొంతజోన్‌లకు వెళ్లిపోవాలని ఏపీసర్కార్ రెండురోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పెద్దసంఖ్యలో ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణకు రావాల్సి ఉంటుంది. వారంతా చేరితే ఇక్కడి ఉద్యోగుల పదోన్నతుల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాల దృష్ట్యా వీటిని వెంటనే నిలిపివేయాలని మంత్రి హరీశ్‌రావు లేఖ ద్వారా అభ్యంతరం తెలిపారు.
నీటిపారుదలశాఖ వర్గాల సమాచారం మేరకు, ‘మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించే వరకు ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం చేయొద్దని గతంలోనే లేఖ ద్వారా కోరినా పూర్తి ఏకపక్షంగా నిర్ణయించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. తుది నిర్ణయం తీసుకునే వరకు బదలాయింపులను ఆపండి. లేనిపక్షంలో ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులకు తెలంగాణలో పోస్టింగ్‌లు ఇవ్వలేం’ అని లేఖలో పేర్కొన్నారు. అదేసమయంలో 1,2,3,4 జోన్‌లలో ఎంపికై తెలంగాణలో పనిచేస్తున్న ఇక్కడి స్థానిక ఉద్యోగులను ఏపీకి పంపలేమని, వారికి ఇక్కడే పోస్టింగ్‌లు ఇస్తామని లేఖలో కరాఖండీగా చెప్పారు.
బలవంతంగా ఇక్కడికి పంపారు : ఏపీ ఉద్యోగులు
కాగా ఈ విషయమై సోమవారం సాయంత్రం ఏపీ నుంచి బదిలీపై వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు మంత్రి హరీశ్‌రావును కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. తాము ఏపీలోనే పనిచేయాలని కోరుకుంటున్నా తమ ప్రభుత్వం బలవంతంగా తెలంగాణకు పంపుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశామని స్పష్టం చేశారు.