కాళేశ్వరం.. తెలంగాణకు వరం | Minister Harish Rao comments on Kaleswaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

Published Sat, Mar 31 2018 3:42 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Minister Harish Rao comments on Kaleswaram Project - Sakshi

జార్ఖండ్‌మాజీ సీఎం సోరెన్‌కు సుందిళ్ల బ్యారేజీ పనుల గురించి వివరిస్తున్న హరీశ్‌రావు

మహదేవపూర్‌/ మంథని: తెలంగాణ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరమని, సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అన్నారు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావుతో కలసి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను ఆయన పరిశీలించారు.

అత్యాధునిక పద్ధతిలో నిర్మిస్తున్న ‘క్రష్‌గేట్ల’నిర్మాణ పనులను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మేడిగడ్డ వ్యూ పాయింట్‌ నుంచి ఇటు తెలంగాణ వైపు, అటు మహారాష్ట్ర వైపు జరుగుతున్న బ్యారేజీ పనులను తిలకించారు. వ్యూపాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని మంత్రి హరీశ్‌రావు మ్యాపులో చూపుతూ వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను చూసిన తర్వాత సంభ్రమాశ్చర్యానికిలోనైన సోరెన్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత వేగంగా నిర్మాణమవుతున్న ప్రాజెక్టు బహుశా ప్రపంచంలో ఇదే మొదటిదని పేర్కొన్నారు. ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉన్న మంత్రి హరీశ్‌రావును, ఇంజనీర్లను అభినందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, లక్ష్యం నిర్దేశించుకొని పనులు చేపట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.  సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శమన్నారు.  

జూలైలో సాగునీటిని పారిస్తాం: హరీశ్‌  
అనుకున్న లక్ష్యానికి జూన్‌ లేదా జూలై నాటికి సాగు నీటిని పారిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం బ్యారేజీలు, పంపుహౌస్, సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు సమాంతరంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ వద్ద 5,500, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద సుమారు నాలుగు వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరుగుతోందని తెలిపారు. పంపుహౌస్‌ల పనుల వేగం మరింత పెంచాలని.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ప్రధాన పంపుహౌస్‌ పూర్తయితేనే బ్యారేజీలు, మిగతా పంపుహౌస్‌లకు నీరు చేరుతుందని, ఇందుకోసం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అడ్వయిజర్‌ పెంటారెడ్డి వారంవారం విజిట్‌ చేసేలా ఆదేశించినట్లు తెలిపారు.

చైనా నుంచి స్రైరస్‌ కేసింగ్‌ గేట్లు చేరాయని, మేడిగడ్డ వద్ద 85, అన్నారం 66, సుందిళ్ల వద్ద 74 గేట్లను బిగిస్తామని ఆయన వివరించారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ వారు జపాన్‌ నుంచి గేట్ల తయారీ మిషన్‌ తెప్పించుకున్నారని.. పనుల్లో నాణ్యత, వేగం పెరుగుతుందన్నారు. ఒక్కో గేటు 15 మీటర్ల పొడవులో 70 టన్నుల బరువు ఉం టుందని చెప్పారు. అటవీ ప్రాంతంలో 12 కిలో మీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌ పనులు జరుగుతున్నాయని, కోటి 80 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనికి గాను కోటి 30 లక్షలు పూర్తయిందని, మరో 50 లక్షలు మాత్రమే మిగి లిందని హరీశ్‌ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డిసెంబర్‌ నాటికి పూర్తయినా.. అన్నారం, సుందిళ్ల మాత్రం జూలై నెలలో కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement