నారాయణఖేడ్‌లో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జూలై 15 నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందజేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2019లో పూర్తి కావాల్సిన భగీరథ పథకాన్ని ఏడాది ముందుగానే పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఆయన చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ పథకం నిదర్శనమని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి సాహసంతో ఇలాంటి పథకం చేపట్టలేదని గుర్తు చేశారు.
కేసీఆర్ సాహసి.. కావునే ఆయన గొప్ప సంకల్పం నెరవేరుతోందన్నారు. గాంధీభవన్‌లో కూర్చొని విమర్శలు చేయడం ఏమిటని ఆయన కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వచ్చి మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలతో వస్తున్న మార్పులను, రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి వరుసగా మూడోసారి పంటలకు సాగు నీటిని అందిస్తున్నామని, ఇదొక రికార్డని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడేమో కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం విద్యతోపాటు, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేసీఆర్ కిట్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వివరించారు. కాంగ్రెస్ పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పోలీస్‌స్టేషన్ల ఎదుట క్యూకట్టే వారని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే పాల్గొన్నారు.
పలు ప్రారంభోత్సవాలు..
రూ.1,300 కోట్లతో కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 785 గ్రామాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకం మోటార్లను మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు సింగూరులో ప్రారంభించారు. సింగూరు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ఇన్‌టెక్‌వెల్ మోటార్లను పెద్దారెడ్డిపల్లి గ్రామం దగ్గరలో ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రం నుంచి నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. అలాగే.. నారాయణఖేడ్ నియోజకవర్గం సుల్తానాబాద్‌లో రూ.25 కోట్లతో నల్లవాగు ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన, నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పలు సీసీ రహదారులు, రూర్బన్ పథకం ఎల్‌ఈడీ బల్బుల పథకాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
మాటలు ఘనం.. చేతలు శూన్యం
మోదీ సర్కార్ మాటలు ఘనంగా ఉంటాయని.. చేతల్లో మాత్రం శూన్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతుల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు కాల్వల ఆధునికీకరణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా దారికిరాలేదని చురకలు అంటించారు. ఉన్నత వర్గాలకు మేలు చేసేందుకే జీడీపీ ఉపయోగపడుతుందని విమర్శించారు. డ్రిప్ ఇరిగేషన్, ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ విధించడమేమిటని మంత్రి ప్రశ్నించారు. నీటి పారుదల రంగానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేయకుండా నిరాశ మిగిల్చారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నేతలు గ్యాస్ డీలర్‌షిప్‌లు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రుల ఏర్పాటుకే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజల బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులు, ప్రజల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారని కొనియడారు.
Comments
Please login to add a commentAdd a comment