సమస్యలపై పోరాడే సీఎంపై విమర్శలా?
విపక్షాలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
ప్రజావిశ్వాసానికి ప్రతీక కంటోన్మెంట్ గెలుపు
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం
హైదరాబాద్: సమస్యలపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని తెలంగాణ ఇరిగేషన్, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. గల్లీగల్లీ తిరుగుతూ సమస్యల వద్దకే సీఎం వెళుతుండటంతో భవిష్యత్తులో తమ ఉనికే ఉండదనే ఇష్టారీతిన పేలుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను విశ్వసించడంలేదని...2009 నుంచి ఏ రకమైన ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ పక్షానే నిలబడుతున్నారని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో హరీశ్‌రావు మంగళవారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కం టోన్మెంటు ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై మద్యం, డబ్బు పంపిణీ చేశాయని ఆయన ఆరోపించారు. అయినా టీడీపీ, బీజేపీ కూటమి ఒక్క వార్డునైనా గెలుచుకోలేదని చెప్పారు. కంటోన్మెంటు ప్రాంతంలో ఎమ్మెల్యే, ఎంపీలు టీడీపీకి చెందినవారని, ఒకవిధంగా టీఆర్‌ఎస్ అక్కడ జీరో అయినా ప్రభుత్వ పనితీరును చూసి ప్రజలు తమ పార్టీని గెలిపించారని, వారికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. కంటోన్మెంట్ గెలుపు టీఆర్‌ఎస్‌పై ప్రజావిశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. విపక్షాలు ఇకనైనా చీటికీమాటికీ విమర్శించడం మాని ఎందుకు ఓడిపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురుతుందని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.
పొన్నాల.. చెల్లని నోటు
టీపీసీసీఅధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను చెల్లని నోటుగా హరీశ్‌రావు అభివర్ణించా రు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన పొన్నాల వరంగల్‌లో ఒక్క సమస్యనూ పరిష్కరిం చలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అక్కడే ఉండి సమస్యలను పరిష్కరిస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శించ డం సిగ్గుచేటన్నారు. ‘పొన్నాల తన సొంత నియోజకవర్గం జనగామలో ఒక్క రాత్ర న్నా నిద్ర చేశారా? సుమారు 40 గ్రామాలకు ఆయన వెళ్లనే లేదు. అందుకే ఓటమి పాలయ్యారు. అయినా సోయి రాలేదు’ అని హరీశ్ మండిపడ్డారు. ఉద్యమకారులపై కేసులు పెట్టించిన పొన్నాల... అమరవీరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించడం హాస్యాస్పదమన్నా రు. మంత్రిగా ఆయన ఒక్క అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఏడు నెలల పాలనలో కేసీఆర్ ఏం పనిచేశాడో పొన్నాల జనగామకు వెళ్లి కనుక్కోవాలని హరీశ్‌రావు అన్నారు.