కాంగ్రెస్‌ దిగజారిపోయింది | Minister Harish Rao Fires On Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ దిగజారిపోయింది

Oct 26 2017 1:14 AM | Updated on Mar 18 2019 9:02 PM

Minister Harish Rao Fires On Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పూర్తిగా దిగజారిపోయిందని, ఆ పార్టీ నేతలు భావ దారిద్య్రంలో మునిగి తేలుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపై అయినా, ఎంత సేపైనా చర్చించేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారని.. అసెంబ్లీ ముట్టడి ప్రకటన చేయడం కాంగ్రెస్‌ అసహన రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. అసెంబ్లీలో చర్చిద్దామన్నా.. సిద్ధంకాకుండా రోడ్ల మీదే ఉంటామంటున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎఫ్‌డిసీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు.

చలో అసెంబ్లీ పిలుపెందుకు ఇచ్చారు?
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్‌ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంపై హరీశ్‌ మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఏవైనా అభ్యంతరాలుంటే బీఏసీ సమావేశంలో చెప్పాలి. అంతేగానీ సభలో మాట్లాడం, రోడ్ల మీద మాట్లాడుతం అంటే ఎలా? ప్రభుత్వం దగ్గర సమాధానం లేదంటే రోడ్ల మీద బైఠాయించడంలో అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేనివారు, ప్రజా సంఘాల వంటి వారు చలో అసెంబ్లీ పిలుపు ఇస్తారు. అలాంటిది ఒక ప్రధాన ప్రతిపక్షం ఎలా పిలుపు ఇస్తుంది..’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల వద్ద సరుకు లేదు, సబ్జెక్టు లేదు, సత్తా లేదని వ్యాఖ్యానించారు. చలో అసెంబ్లీని ఉపసంహరించుకోవాలని సూచించారు.

ఏదైనా జరిగితే వారిదే బాధ్యత
ప్రభుత్వం సమాధానం ఇస్తామన్నా విన కుండా ఆందోళన చేయడంలో అర్థం లేదని, కాంగ్రెస్‌ ఎంత దిగజారిపోయిందో వారి ప్రకటనతో తేలిపోయిందని హరీశ్‌ విమర్శించారు. చూస్తుంటే కాంగ్రెస్‌కు వీధి పోరాటాలంటేనే ఇష్టమున్నట్లు అనిపిస్తోం దని వ్యాఖ్యానిం చారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా జరగరా నిది ఏదైనా జరిగితే దానికి కాంగ్రెస్‌ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల కోసం కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహ రచన లేదని.. సాగునీటి ప్రాజెక్టులపై గతంలో సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తుంటే మాట్లాడ కుండా పారిపోయిందని గుర్తుచేశారు. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలో బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని, తాము మూడు నాలుగు వారాలు సభలు జరపాలన్న ఆలోచనలో ఉన్నామని చెప్పారు.

జానారెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి
ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత జానారెడ్డిని, ఆయన సీనియారిటీని అందరం గౌరవిస్తున్నామని.. అలాంటి ఆయన ప్రతిపక్ష నేతగా ఆలోచించాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలను ఆయన ఎలా సమర్థిస్తారని, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించే వారని.. నిషేధాజ్ఞలు ఉండేవని గుర్తులేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని, చలో అసెంబ్లీ పిలుపును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షనేతను కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ మరింతగా దిగజారవద్దని, రెచ్చగొట్టే రాజకీయాలు చేయవద్దని హరీశ్‌ వ్యాఖ్యానించారు. జానారెడ్డి తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement