ఆయన తెలంగాణ గర్వించతగ‍్గ బిడ‍్డ : హరీష్
హైదరాబాద్ : మహాకవి సి. నారాయణరెడ్డి తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఉదయం సినారె పార్థివదేహానికి హరీష్‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినారె మృతి చాలా బాధాకరమన్నారు. తెలంగాణ జాతికి, ప్రాంతానికి గౌరవం, వన్నె తెచ్చిన వ్యక్తి సినారె అని పేర్కొన్నారు.
ఆయన కావ్యాలు, రచనలు, పాటలు తెలుగు రాష్ర్టాల ప్రజలకు చిరకాలం గుర్తుండి పోతాయన్నారు. సినారె గౌరవాన్ని, కీర్తిని నిలబెట్టేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. సినారె తెలుగు జాతికి చేసిన సేవలు అపారమని చెప్పారు. అదే విధంగా నటుడు తనికెళ్ల భరణి ఈరోజు నారాయణరెడ్డికి నివాళులు అర్పించారు. సినారే తెలుగు జాతికి సంపద అని కొనియాడారు.