వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు | Minister Harish Rao Release Godavari Water From Ranganayakasagar | Sakshi
Sakshi News home page

వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు

Published Sun, May 3 2020 12:53 AM | Last Updated on Sun, May 3 2020 8:20 AM

Minister Harish Rao Release Godavari Water From Ranganayakasagar - Sakshi

స్విచ్ఛాన్‌ చేసి రంగనాయకసాగర్‌ కుడి కాలువకు నీళ్లు విడుదల చేస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌/ సిద్దిపేట: మరో అద్భుతం దిశగా గోదావరి జలాల ప్రయాణం మొదలైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి రాష్ట్రంలో సముద్రమట్టానికి అత్యంత ఎత్తునున్న కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ వైపు గోదారి ఉరకలెత్తుతోంది. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి దా ని దిగువనున్న సొరంగంలోకి (టన్నెల్‌) శనివారం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరామ్‌ నీటిని విడుదల చేయగా, రంగనాయకసాగర్‌ కుడి, ఎడమ కాలువల్లోకి మంత్రి హరీశ్‌రావు నీటిని వదిలారు. కాగా, సొరంగంలోకి విడుదల చేసిన నీళ్లు మూడు పంప్‌హౌస్‌లను దాటుకుంటూ మరో 15 రోజుల్లో కొండపోచమ్మసాగర్‌కు చేరనున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ బెడ్‌లెవల్‌ 88 మీటర్ల నుంచి నీటిని తీసుకుంటుండగా, 200 కి.మీ. మేర ప్రయాణించి 618 మీటర్ల ఎత్తున కొండపోచమ్మకు నీళ్లుచేరి అద్భుతం సృష్టించనున్నాయి. 

ఎత్తిపోసేందుకు అంతా సిద్ధం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఐదు రోజుల క్రితమే అనంతగిరి నుంచి గోదావరి నీటిని రంగనాయకసాగర్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. రంగనాయకసాగర్‌లో ప్రస్తుతం 3 టీఎంసీలకు గాను ఒక టీఎంసీ మేర నీటి నిల్వ ఉంది. మరో 0.50 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పంపులు నడిపిస్తున్నారు. అదే సమయంలో రంగనాయకసాగర్‌ నుంచి మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌ మీదుగా నీటిని కొండపోచమ్మసాగర్‌కు పంపేందుకు శనివారం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరామ్, ఎస్‌ఈ ఆనంద్, ఇతర ఇంజనీర్లు 16.18 కి.మీ. పొడవైన టన్నెల్‌కు నీటిని వదిలారు. అక్కడి నుంచి నీరు తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌కు చేరనుంది. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు 

ఇక్కడి సర్జ్‌పూల్‌ను నింపి 43 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 మోటార్ల ద్వారా నీటిని దిగువన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పరిధిలో తవ్విన 18 కి.మీ. ఫీడర్‌ చానల్‌కు వదులుతారు. ఇందుకు మరో వారం పట్టనుంది. అక్కడి నుంచి నీరు 6 మోటార్లు ఉన్న అక్కారం పంప్‌హౌస్‌కు, ఆపై మరో 6 మోటార్లున్న మర్కూక్‌ పంప్‌హౌస్‌కు చేరతాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే 3 పంప్‌హౌస్‌ల్లో మోటార్లు నడిచేలా విద్యుత్‌ వ్యవస్థను ట్రాన్స్‌కో సిద్ధంచేసింది. ఈనెల 15 – 18 మధ్య తేదీల్లో ఏదో రోజున నీటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మకు వదిలే అవకాశాలున్నాయని తెలిసింది. 

శనివారం రంగనాయక సాగర్‌ కాలువకు నీటిని విడుదల చేసి సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ఈఎన్‌సీ హరిరామ్‌ 

ఆ ఎత్తుకు చేరితే అద్భుతమే..
‘గోదావరి కొండపోచమ్మసాగర్‌కు చేరితే అద్భుతమే. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 88 మీటర్ల బెడ్‌లెవల్‌ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నాం. ఈ నీటిని 618 మీటర్ల ఎత్తు న ఉన్న కొండపోచమ్మకు తరలిస్తే 530 మీట ర్ల మేర నీటిని తరలించినట్టవుతుంది’అని ఈఎన్‌సీ హరిరామ్‌ తెలిపారు. అదీగాక మేడిగడ్డ నుంచి కొండపోచమ్మకు సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయనుందని, ఈ ప్రయాణానికి మొత్తంగా 10 స్టేజీలలో నీటి ఎత్తిపోతల పూర్తికానుందని చెప్పారు. మిడ్‌ మానేరు దిగువన 4వ దశలో 5 ప్యాకేజీలు ఉండగా, 76 కి.మీ. గ్రావిటీ కెనాల్, 32.42 కి.మీ. టన్నెళ్లు దాటుకొని 5 పంప్‌హౌస్‌ల ద్వారా నీరు 15 రోజుల్లో కొండపోచమ్మకు చేరుతుందని తెలిపారు. సీఎం ఆదేశాలతో నీటి తరలింపు చర్యలన్నీ పూర్తి చేశామన్నారు.

నీటి చింత తీరింది: మంత్రి హరీశ్‌
చుక్క నీటి కోసం నానా ఇబ్బందులు పడ్డ ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొ క్కుతున్నాయని, ప్రజల నీటి చింత తీరిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గత నెల 24న రంగనాయకసాగర్‌లోకి గోదావరి జలాలు చేరిన వి షయం తెలిసిందే. 3 టీఎంసీల సామర్థ్యం గల రంగనాయకసాగర్‌లోకి శనివారం ఉద యం నాటికి 1.5టీఎంసీల నీరు చేరింది. ఈ నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా సిద్దిపేట అర్బన్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని రాజగోపాల్‌రావుపేట, పాలమాకు ల చెరువులను నింపేందుకు మంత్రి హరీశ్‌రావు శనివారం విడుదల చేశారు. అనంత రం మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వస్తోందని, ఇక కష్టపడి మంచి పంటలు పండించాల్సిన బా ధ్యత రైతులపైనే ఉందన్నారు. మెద క్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, సిద్దిపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరామ్‌ పాల్గొన్నారు. 

ఈత కొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే
రంగనాయకసాగర్‌ ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు వదిలిన సందర్భంలో రైతులతో పాటు నాయకులు పరవశించిపోయారు. కాలువ జలాలను ఎంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తంచేశారు.

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూరు, నారాయణరావుపేట ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువలో దూకి ఈత కొట్టారు. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్‌రావు సెల్ఫీలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement