బుధవారం సచివాలయంలో మంత్రులు ఈటల, జూపల్లితో సమావేశమైన సిస్మా ప్రతినిధులు
- మంత్రులు ఈటల, జూపల్లితో భేటీలో సిస్మా ప్రతినిధులు
హైదరాబాద్: చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు.. చక్కెర కర్మాగారాల యాజ మాన్యాల ఇబ్బందులపై రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దక్షిణ భారత చక్కెర కర్మాగారాల యాజమాన్యాల అసోసియేషన్(సిస్మా-తెలంగాణ) ప్రతినిధులతో బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెరకు రైతుల బకాయిలు తీర్చేందుకు తమ వద్ద ఉన్న చక్కెర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా సిస్మా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని 11 చక్కెర కర్మాగారాల పరిధిలో యాజమాన్యాలు రూ.184 కోట్ల మేర రైతులకు బకాయిలు చెల్లించాలి. మూడు సహకార చక్కెర కర్మాగారాల పరిధిలోనే రూ.50 కోట్ల మేర రైతులకు బకాయిలు ఉన్నాయి. చక్కెర దిగుమతులపై పన్ను విధింపు, మొలాసిస్ ఎగుమతులపై పన్ను రద్దు, అమ్మకాలపై వ్యాట్ రద్దు వంటి అంశాలను పరిశీలించాలని సిస్మా ప్రతినిధులు కోరారు. చక్కెర కర్మాగారాల నుంచి బిడ్డింగ్ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు మంత్రులు ఈటెల, జూపల్లి సుముఖత వ్యక్తం చేశారు. చక్కెర పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశం అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చెరకు రైతుల సమస్యలపై సీఎంకు నివేదిక అందిస్తామన్నారు. చక్కెర మార్కెటింగ్‌లో ఇబ్బందుల్ని తొలగించి రైతులకు మేలు కలిగేలా చూస్తామన్నారు.