
రాహుల్‌పై నిప్పులు చెరిగిన మంత్రి
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మంత్రి కే తారక రామారావు తీవ్రంగా మండిపడ్డారు. బాలానగర్‌లో జరిగిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానుల సమావేశంలో మాట్లాడిన ఆయన సంగారెడ్డిలో రాహుల్‌గాంధీ సభను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. వరుస అపజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని అసలు దేశంలో గుర్తుపట్టెటోళ్లు కూడా ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడ కాలుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమే అని దుయ్యబట్టారు.
ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ ఓటమికి రాహులే కారణమని, రాహుల్‌తో జత కట్టడం వల్లే అఖిలేశ్ నాశనమైయిండని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ పార్లమెంట్ స్థానంలోనే రెండు స్థానాలు కూడా గెలవలేని రాహుల్.. సంగారెడ్డికి వచ్చి కేసీఆర్ను ఓడించేస్తా అంటున్నారని మండిపడ్డారు. మందుగా రాహుల్ గాంధీ అమేథీలో నాలుగు సీట్లు గెలిచి చూపించాలన్నారు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను ఓడగొట్టే మాటలు మాట్లాడలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా చూశారు.. భరించారు. కాంగ్రెస్ చరిత్ర ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని కోరారు. అభివృద్ధిలో అగ్రభాగాన దూసుకుపోతున్న తీరుని ఓర్వలేకనే పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధి కంటకులైన కాంగ్రెస్ నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి తెలిపారు.