
సాక్షి, హైదారాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానిస్తే తెరాస ఎంపీలు నోటికి బట్టకట్టుకొని కూర్చున్నారంటూ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి లొంగిపోయిందని, సీబీఐ కేసులకు భయపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జీవన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని, కేసీఆర్ ఉద్యమ స్పూర్తి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. జైతెలంగాణ నుంచి జై ఆంధ్రగా కేసీఆర్ మారిందని విమర్శించారు.
దేశాలు తిరిగి ఇదే నేర్చుకున్నావా? : గీతారెడ్డి
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మండిపడ్డారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న మంత్రి ఇలా మాట్లాడటం భావ్యమేనా అని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోనియాగాంధీ దగ్గర మోకరిల్లారని.. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆరోజు రాహుల్ గాంధీ పప్పు అనిపించే అక్కడికెళ్లారా అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు గాని, ఇతర టీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పప్పు కాదని, గుజరాత్ ఎన్నికల్లో మోదీని రాహుల్ గాంధీ గడగడలాడించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment