జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో దానకిషోర్, నవీన్ మిట్టల్, బొంతు రామ్మోహన్, జనార్దన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపడంతోపాటు నగరాభివృద్ధిలో మరింత చురుగ్గా భాగస్వాములు కావాలని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం జనంలోకి వెళ్లాలని, వారితో కలసి పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక విజన్ ఉందని, అందుకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీని బలోపేతం చేసేలా పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శనివారం హరితప్లాజాలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. కార్పొరేటర్లుగా ఎన్నికై ఇప్పటికే సంవత్సరన్నర దాటిందని, ఇకపై నిరంతరం ప్రజల్లో తిరగాలని వారికి సూచించారు. ప్రజలకు సమస్యలున్నప్పుడు వారి వెంట ఉంటే చాలని, వారి కష్టసుఖాలను పంచుకోవాలని, ప్రజల అవసరాలను తీర్చేలా జీహెచ్‌ఎంసీ అధికారులతో కలసి పనిచేయాలన్నారు. సర్కిళ్ల స్థాయిలో నిర్వహిస్తున్న ఉమ్మడి సమన్వయ సమావేశాల్లో ఇకపై కార్పొరేటర్లను కూడా భాగస్వాములను చేసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
కనీస అవసరాలు తీర్చితే చాలు..
నగర పరిధిలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేటీఆర్ కార్పొరేటర్లకు సుదీర్ఘంగా వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాకుండా కార్పొరేటర్లకూ శిక్షణ కార్యక్ర మాన్ని సీఎం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచే శారు. సీఎం ఆలోచనల మేరకు అందరం కలసి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుం డాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ నుంచి ప్రజలు అద్భుతాలేమీ ఆశించడం లేదని, వారి కనీస అవసరాలను తీర్చితే సరిపోతుందని, ఆ దిశగా పనిచేద్దామ న్నారు. కార్పొరేటర్లు ప్రస్తావించే సమస్యలపై సాధ్యమైనంత వరకు సానుకూలంగా స్పందించాలని అధికారులను కోరారు. తమ డివిజన్ల అభివృద్ధికి కార్పొరేటర్లకు సహకారం అందిస్తామన్నారు. తమ డివిజన్ లేదా వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దితే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. పార్కులు, ఇతర ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుంచి కాపాడాలన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలో చేపట్టాల్సిన పనుల వివరాలను కేటీఆర్‌కు అందజేశారు.
స్వచ్ఛ డివిజన్లకు 50 లక్షల పురస్కారం
తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి చెత్తగా వంద శాతం విడదీసి స్వచ్ఛ ఆటో టిప్పర్లకు అందజేయడంతో పాటు మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ ద్వారా మోడల్ డివిజన్‌గా నిలిపే కార్పొరేటర్‌కు రూ.50 లక్షల ప్రోత్సాహక నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి 3 నెలల గడువు విధిస్తున్నట్టు తెలిపారు. తమ పరిధిలో ప్రభుత్వ భూమి ఉంటే వాటి వివరాలను సంబంధిత జోనల్ కమిషనర్లకు అందజేస్తే వివా దంలేని భూముల్లో కార్పొరేటర్ కార్యాలయాలను నిర్మించడానికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
మూసీ అభివృద్ధికి రూ.1,565 కోట్లు
నగరంలోని వివిధ కాలనీలు, రోడ్లపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను దశల వారీగా తొలగించనున్నట్టు కేటీఆర్ చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతం 42 కిలోమీటర్ల మేర అభివృద్ధికి రూ. 1,565 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతాల్లో మెరుగైన మురుగునీరు, డ్రైనేజీ నిర్వహణకు కొద్ది రోజుల్లో 66 ఎయిర్‌టెక్ మిషన్లను జీహెచ్‌ఎంసీ సమకూర్చుకోనుందని తెలిపారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకోసారి నగర కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశం లో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందనరావు, ఎన్.వి.రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డివిజన్ నీ సామ్రాజ్యమనుకున్నావా?
చైతన్యపురి కార్పొరేటర్‌కు కేటీఆర్ క్లాస్
‘డివిజన్ అంటే నీ జాగీర్దారు అనుకుంటున్నావా? చైతన్యపురి నీ సామ్రాజ్యం కాదు. అధికారులు డివిజన్‌లో తిరగాలంటే నీ అనుమతి కావాలా? ఎక్కువ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా’అని చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అధికారులు తమకు చెప్పకుండా డివిజన్లలోకి వస్తున్నారని విఠల్‌రెడ్డి అనడంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అధికారులు మీకు చెప్పే రావాలని రూలేం లేదు. సీఎం పరిధిలోకి సైతం వారు వెళ్లవచ్చు. నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కుదరదు’అని అన్నారు. అధికారులు తమను ఖాతరు చేయడం లేదని కొందరు కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో కార్పొరేటర్లకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని అధికారులతో చెప్పిన మంత్రి కేటీఆర్.. అదే సమయంలో కార్పొరేటర్లకూ క్లాస్ పీకారు. ఇదే తరుణంలో బాగా పనిచేసిన హయత్‌నగర్, ఆల్విన్‌కాలనీ డివిజన్ల కార్పొరేటర్లు సామ తిరుమల్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌లను మంత్రి అభినందించారు.
వెంటపడి పనులు చేయించుకోవాలి..
అధికారులతో చెప్పి పనులు చేయించుకోవాలని, పనుల కోసం వారి వెంటపడాలని, అధికారులు ఇబ్బంది పెడితే తనకు చెప్పాలని కార్పొరేటర్లకు సూచించారు. 2019లోపు గ్రేటర్ అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని, మీరు కూడా వినూత్నంగా పనిచేయాలని చెప్పారు. కార్పొరేటర్ల కోరిక మేరకు అత్యవసర సమయాల్లో జోనల్ కమిషనర్ రూ.5 లక్షలు, కమిషనర్ రూ.20 లక్షల వరకు పనులను నామినేషన్ మీద ఇచ్చేందుకు సమ్మతించారు. నాలాల విస్తరణలో భాగంగా ఆస్తుల తొలగింపును కార్పొరేటర్లు అడ్డుకోవడం మానాలని, అధికారుల పనులకు ఆటంకం కల్పించవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment