![Minister KTR Participated in Gurunanak Jayanthi Celebrations In Afzalgunj Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/13/KTr-1.jpg.webp?itok=29MAvCPY)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సిక్ సొసైటీ కోసం వెస్ట్రన్ పార్ట్‌లోని మోకిలాలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అతిపెద్ద గురుద్వారా నిర్మించడానికి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గురునానక్ 550వ జయంతి వేడుకలను పురస్కరించుకొని గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రతినిధులు గురుచరణ్ సింగ్ బగ్గా, బల్‌దేవ్‌సింగ్ బగ్గా ఆధ్వర్యంలో బహిరంగ సభ, భజన కార్యక్రమాలు జరిగాయి.
అనంతరం గురునానక్ తెలుగు సందేశ పుస్తకాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ రామ్మోహన్, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ ఆవిష్కరించారు. గురునానక్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించి గౌరవించిందని కేటీఆర్ తెలిపారు. సిక్ చావని సమస్యలను తెలంగాణ సిక్ సొసైటీ, తేజ్‌దీప్‌కౌర్‌తో కలసి వస్తే చర్చించి పరిష్కరిస్తామన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాలను, మతాలను గౌరవిస్తూ వారి పండుగలను ఘనంగా జరుపుకోవడానికి సాయం అందిస్తున్నామన్నారు. రోటరీ క్లబ్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో 71 మంది సిక్కులు రక్తదానం చేశారు. రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో గురునానక్ జీవిత చరిత్ర తెలిపేలా ఫొటో ప్రదర్శన నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment