సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈఎస్‌ఐ మందుల కుంభకోణంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించింది. కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, వరంగల్‌లో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన ‘జనజాగరణ సభ’లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు దేశవ్యాప్తంగా ప్రజామోదం లభించిందన్నారు. కశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment