కీసర: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించనున్న మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం కీసరలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రథమ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. శామీర్‌పేట జంక్షన్ వద్ద మంత్రి కాన్వాయ్‌తోసహా రింగ్‌రోడ్డు ఎక్కారు. నర్సంపల్లి – యాద్గార్‌పల్లి మధ్య ముఖం కడుక్కునేందుకు కారును పక్కకు ఆపమని మంత్రి చెప్పడంతో డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపునకు తీసుకున్నాడు.
ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ మంత్రి కారును ఢీకొంది. దీంతో మంత్రి కూర్చున్న కారు కొద్దిగా ముందుకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు తలసానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు వెనుక భాగం మాత్రం దెబ్బతిన్నది. అయితే వెనుక సీటులో కూర్చున్న మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా మంత్రికారులోనే ఉన్నా, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. మంత్రి కారును ఢీకొట్టిన లారీని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించి, డ్రైవర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ సురేందర్‌గౌడ్ తెలిపారు.
దేవుడి దయతోనే బయటపడ్డా: తలసాని
సాక్షి, హైదరాబాద్: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే లారీ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ప్రమాద విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసి పరామర్శించారని ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment