అకాల వర్షంతో నష్టపోయిన మిర్చిని చూపుతున్న రైతులు (ఫైల్)
సాక్షి, నర్సంపేట: మిర్చి రైతులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు ప్రకృతి అనుకూలించకపోవడం.. తెగుళ్లు విజృంభించడంతో దిగుబడి తగ్గి రైతులు నిండా మునిగారు. వచ్చిన పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తుందోనన్న అన్నదాతను మార్కెట్ మాయాజాలం మరింత నష్టాన్ని కలుగజేస్తోంది. క్వింటా మిర్చి ధర రూ.10 వేల లోపు పలుకుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తలలు పట్టుకుంటున్నారు.
గతేడాది మిర్చి ధరలు మురిపించాయి. గిట్టుబాటు కావడంతో రైతులకు కాసింత ఆదాయం సమకూరింది. దీంతో ఈ ఏడాది మిర్చిని రైతులు ఎక్కువగా సాగు చేశారు. ఊహించని విధంగా అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశా యి. వర్షాల తర్వాత తెగుళ్లు దారుణంగా దెబ్బతీ శాయి. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందు కు రూ.వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడులు రెండు రెండింతలయ్యాయి.
దిగుబడులు మాత్రం దారుణంగా పడిపోయాయి. పంటను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. రూరల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట సాగయింది. నర్సంపేట నియోజకవర్గం రైతులు ఈ ఏడాది భూగర్భ జలాలపై ఆధారపడి బోర్లు, వ్యవసాయ బావుల కిందనే వాణిజ్య పంటలను సాగు చేశారు. పెద్ద ఎత్తున మిర్చి పంట వేశారు. కోత దశకు చేరుకున్న సమయంలో మిర్చికి వైరస్ సోకి ఎకరాల కొద్ది పంట దెబ్బతింది. ఎకరానికి రూ.50 నుంచి రూ.60 వేల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి తోటలు వైరస్‌తో ఎర్రబడి ఎండిపోతుండడంతో, నర్సంపేట మండలం దాసరిపల్లి రైతులు దిగులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment