కోదండరాంకు తప్పిన ప్రమాదం
వెనుక నుంచి ఆయన కారును ఢీకొట్టిన మరో వాహనం
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పిం చుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును రంగారెడ్డి జిల్లా ఈసీఐఎల్ -ఘట్‌కేసర్ రోడ్డులో యంనంపేట కూడలి సమీపంలో మరోవాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్యతో కలసి కోదండరాం హైదరాబాద్ నుంచి తన వాహనంలో వరంగల్ జిల్లా జనగామకు బయలుదేరారు. యంనంపేట కూడలి సమీపంలోని ఔటర్‌రింగ్ రోడ్డుపై నిర్మిస్తున్న వంతెన వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ వింగర్ వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
కారు వెనుక భాగం కొద్దిగా దెబ్బతింది. వింగర్ వాహనదారుడు కోదండరాంకు క్షమాపణ చెప్పాడు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కుమారుడు శరత్‌చంద్రరెడ్డి, స్థానిక టీఆర్‌ఎస్ నేత నవీన్‌ప్రకాష్ తదితరులు యంనంపేట కూడలిలో వారికి కాసేపు విశ్రాంతి ఏర్పాటు చేశారు. అనంతరం మరొక వాహనంలో కోదండరాం, లక్ష్మయ్య జనగామ వెళ్లిపోయారు. కాగా, కోదండరాం కారును ఢీ కొట్టిన వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. అది జహీరాబాద్‌కు చె ందిన టాటా వింగర్ కారు (ఏపీ 29 టీఏ 6472)గా గుర్తించారు.