తల్లి అపర్ణతో అంకిత్
బంజారాహిల్స్:సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఖైరతాబాద్ సమీపంలోని చింతల్‌బస్తీ ప్రేమ్‌నగర్‌లో నివాసముండే అపర్ణ, రంజిత్‌కుమార్ దంపతుల కొడుకు అంకిత్‌కుమార్ ఈ నెల 20న మెహిదీపట్నం రైతుబజార్ వద్ద కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. 29న ‘ప్రేమ్‌నగర్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం’ శీర్షికన ‘సాక్షి’లో అంకిత్ ఫొటోతో సహా వార్త ప్రచురితమైంది. షేక్‌పేట దర్గా సమీపంలో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన బాలుడి ఫొటోను చూసిన ఓ వ్యక్తి గడిచిన నాలుగైదు రోజులుగా అదే ప్రాంతంలో ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించాడు.
అదే విషయాన్ని సోమవారం రాత్రి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లి షేక్‌పేట దర్గాలోనే ఓ ఇంట్లో బంధీగా ఉన్న బాలుడిని గుర్తించారు. ఆరా తీయగా ఇదే ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ గదిలో బంధించినట్లు తెలుసుకున్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాలుడికి విముక్తి కలిగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులకు బాలుడిని క్షేమ సమాచారం అందించారు. ఆనందం పట్టలేని తల్లి అపర్ణ కుటుంబ సభ్యులతో కలిసి అదే రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకును కళ్లారా చూసుకొని కన్నీరుమున్నీరైంది. అయితే ఎందుకోసం కిడ్నాప్ చేశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలుడి తల్లిదండ్రలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment