రెండు దశల్లో మిషన్‌ భగీరథ | Mission Bhagiratha should be completed two step: cm kcr | Sakshi
Sakshi News home page

రెండు దశల్లో మిషన్‌ భగీరథ

Published Sun, Sep 24 2017 1:20 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

CM Chandrasekhar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పనులను రెండు దశలుగా విభజించి తొలి దశను వచ్చే డిసెంబర్‌ చివరిలోగా.. రెండో దశను తర్వాత మరో ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా నీటి సరఫరా ప్రారంభించిన తర్వాత కొద్దినెలల పాటు పైపులైన్లు లీక్‌ కావడం, నీటి ఒత్తిడి తట్టుకోలేక పగలడం, వాల్వుల వద్ద సమస్యలు తలెత్తడం వంటి సహజమైన బాలారిష్టాలు ఎదురవుతాయని.. వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పోవాలని సూచించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలోని 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసి ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. మిషన్‌ భగీరథ పథకం ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకునే పనిగా మిగిలిపోతుందని, ఇదో ఇంజనీరింగ్‌ అద్భుతమని పేర్కొన్నారు. 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించే గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయనుండడం అందరికీ గర్వకారణమని చెప్పారు. నీతి ఆయోగ్‌తో పాటు అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని మెచ్చుకున్నాయని, తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి అధ్యయనం చేశాయని తెలిపారు.

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం
ఫ్లోరైడ్‌ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి తొలుత తాగునీరు అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వీటిలో అక్టోబర్‌ చివరి నాటికే పైప్‌లైన్‌ పూర్తి చేసి.. అంతర్గత పనులను కూడా చేపట్టాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని గిరిజన తండాలు, దళితవాడలు, గోండు గూడేలన్నింటికీ మంచినీరు అందించాలని స్పష్టం చేశారు.  

‘పాలేరు’కు ప్రత్యేక బృందం
పాలేరు నియోజకవర్గం పరిధిలోని పాత వరంగల్‌ జిల్లా మండలాల్లో భగీరథ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని íసీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలేరు ద్వారా పాత వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,706 ఆవాస ప్రాంతాలకు నీరు అందించాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లో ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో ఓ ప్రత్యేక బృందం పాలేరు సెగ్మెంట్‌ను సందర్శించి పనులను సమీక్షించాలని సూచించారు.

పరిశ్రమలకు కూడా తాగునీరు..
మిషన్‌ భగీరథ ద్వారా పరిశ్రమలకు కూడా శుద్ధి చేసిన నీటిని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాగునీరు అవసరమున్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు అహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. మిషన్‌ భగీరథకు కేటాయించిన దాదాపు 80 టీఎంసీల నీటిలో పది శాతం (8 టీఎంసీలు) పరిశ్రమలకు అందించే వెసులుబాటు ఉందన్నారు. హైదరాబాద్‌ నగర మంచినీటి అవసరాల కోసం 10 టీఎంసీల రిజర్వాయర్‌ కడుతున్నందున.. అక్కడి నుంచి పరిశ్రమలకు నీరందించడం సాధ్యమవుతుందని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్‌ భగీరథ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశించారు.

విద్యుత్‌ శాఖకు అభినందన
భగీరథ పనుల్లో విద్యుత్‌ శాఖ లక్ష్యానికి రెండు నెలల ముందే పనులు పూర్తి చేస్తోందని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. దీనిపై జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు ఫోన్‌ చేసి అభినందించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 2 నాటికే పనులన్నీ పూర్తవుతాయని.. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తిచేసినట్లు సీఎంకు ప్రభాకర్‌రావు వివరించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

సమస్యలొస్తాయి.. భయపడొద్దు
నీటి ప్రవాహ ఒత్తిడి వల్ల ప్రారంభంలో పైపులు లీకేజీ కావడం, వాల్వుల వద్ద లీకేజీల వంటి సమస్యలు తలెత్తుతాయని.. దాంతో భయపడిపోవద్దని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. పథకం ప్రారంభమైన గజ్వేల్‌లో కూడా రెండు నెలల వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను సీఎం గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ సమస్య వస్తోందని అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా, సెగ్మెంట్ల వారీగా ఇన్‌టేక్‌ వెల్స్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, ఓహెచ్‌బీఆర్‌లు, పైపులైన్ల నిర్మాణం, ఎలక్ట్రో మోటార్‌ పనుల పురోగతిని సమీక్షించారు. మొత్తం 24,225 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3,431 గ్రామాలకు అందిస్తున్నామని.. అక్టోబర్‌ చివరి నాటికి మరో 5,443 గ్రామాలకు, నవంబర్‌ చివరి నాటికి ఇంకో 6,006 గ్రామాలకు, డిసెంబర్‌ చివరి నాటికి మిగతా 9,345 గ్రామాలకు అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పైపులైన్ల నిర్మాణంతో పాటు మోటార్లు బిగించే పనులు కూడా వేగంగా చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement