నిజామాబాద్: ‘మిషన్ కాకతీయ’ పనులు మరింత వేగవంతంగా సాగనున్నాయి. మొదటి దశలో 34 చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రెండు రోజుల కిందట రూ.14.95 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి శనివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు, నూతన ఇసుక పాలసీ, నాబార్డ్ లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రతీ చెరువును ప్రత్యక్షం గా పరిశీలించి, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మొదటి దశలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించినందుకు కలెక్టర్‌ను, అధికారులను అభినందించారు. కాకతీయ మిషన్ కార్యక్రమం అమలులో జిల్లా మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు.
అధికారుల భాగస్వామ్యం కీలకం
మిషన్ కాకతీయ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఈ సంవత్సరం 20 శాతం పనులను చేపట్టాలని, ఇందులో అధికారులు, ప్రజల భాగస్వామ్యం ప్రధానమని చెప్పారు. చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల వివరాలనన్నింటినీ సమగ్రంగా రూపొందించాలని సూచించారు. చెరువుల పూడిక మట్టిని రైతులు తమ పొలాలలో చల్లుకొనే విధంగా కళాజాత ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన అన్ని పాఠశాలలలో ‘మిషన్ కాకతీయ’పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉంటే సత్వరమే రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పనిచేస్తున్న వివిధ ఏజెన్సీలకు అవసరమైన సమాచారంతోపాటు, పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పనులలో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో నడిచే పథకాలను వేగవంతం చేయాలని, తద్వారా ప్రపంచ బ్యాంకు మరికొన్ని అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందని తెలిపారు. చిన్న నీటిపారుదల, భారీ నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని వివరించారు.
తక్షణమే ఇసుక రీచ్‌ల గుర్తింపు
నూతన ఇసుక విధానంపై మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడికి సైతం ఇసుక ధరలు అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇసుక రీచ్‌లను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇసుక విక్రయాలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేపడతామన్నారు. నూతన ఇసుక విధానంపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. గనులు, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి, ఇసుక విక్రయాలలో పారదర్శకత పాటించాలన్నారు. ఇసుక నిల్వల కోసం స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తే వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 3,250 చెరువులు గుర్తించామని, వాటిలో ఈ సంవత్సరం 20 శాతం పనులను చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా 701 చెరువుల సర్వేను పూర్తి చేశామని, 437 చెరువులకు 318 చెరువుల అంచనా ప్రతిపాదనలను సమర్పించామని వివరించారు. 89 చెరువులకు మంజూరు లభించిందని, అందులో 67 పనులకు టెండర్లు పిలిపించామన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, మన్సూర్ పాల్గొన్నారు. జిల్లా నుంచి నీటిపారుదల ఎస్‌ఈ షకీ ల్ ఉర్ రహ్మన్, ఈఈ భూపాల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, సత్యశీల్‌రెడ్డి, డివిజన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయ మరింత వేగమంతం
Published Sun, Jan 11 2015 10:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement
Advertisement