mission kaakatiya
-
చేసిన పనులకే మళ్లీ టెండర్
ఒకే చెరువుకు రెండేసి ప్రతిపాదనలు ఉపాధి హామీలో పనులు చేసిన చెరువులకు మళ్లీ మరమ్మతులు కొత్తగూడ కేంద్రంగా అక్రమాల ‘మిషన్’ రెండు డివిజన్లతో పర్యవేక్షణలో లోపాలు ఈ ఫొటోలో ఉన్నది కొత్తగూడ మండలం ఎర్రవారం గ్రామంలోని ఎర్రకుంట. దీని మరమ్మతు పనులు మిషన్ కాకతీయ రెండో విడతలో చేపట్టారు. అయితే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జాప్యం చేశాడంటూ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టి మళ్లీ టెండర్ పిలిచారు. ఈ పనులకు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్ టెండర్ వేసినప్పటికీ అతని పోటీగా అదే మండలానికి చెందిన మరో కాంట్రాక్టర్ 35.10శాతం లెస్‌కు టెండర్ దక్కించుకున్నాడు. ఎలాగూ పనులు గతంలో 50శాతం వరకు పూర్తయినట్లు ప్రచారం కావడంతో ఇంత తక్కువకు టెండర్ వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చెరువు పనులు ఉపాధి హామీ పథకంలో కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. మరి.. అధికారులు ఈ చెరువు పనులు చేయిస్తారో లేక గతంలో చేసిన పనులే కదా అని ఏకంగా బిల్లులు చేస్తారో చూడాలి. వరంగల్ : ఏజెన్సీ ప్రాంతంలో మిషన్ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల మరమ్మతు పనులు కాంట్రాక్టర్లకు సిరులు కురిపిస్తున్నాయి. మిషన్ కాకతీయకు ముందు త్రిబుల్ ఆర్ పథకం(రీస్టోర్, రిపేర్, రినోవేషన్), ఉపాధి హామీ పథకాల్లో చేపట్టిన పనులను మళ్లీ చేపట్టడంతో ఆ పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. 2014లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన చెరువు పనులను మళ్లీ మిషన్ కాకతీయ రెండో విడతలో చేపట్టారు. ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి కుంట, శంకరాజుపల్లి పైడి చెరువు, ఆకులవారి ఘనపురంలోని దయ్యాలకుంట, రాళ్లకుంట, పెద్ద వెంకటాపూర్‌లోని ఊరకుంట, చిన్నబోయినపల్లిలోని ఊరకుంటలకు మళ్లీ మరమ్మతులు చేపట్టారు. ఇదే విధంగా పలు మండలాల్లో చెరువులకు మళ్లీ టెండర్లు పిలవడంతో అక్రమాలు పెరిగిపోయాయి. కొత్తగూడలో అక్రమాలు కోకొల్లలు... అటవీ ప్రాంతమైన ఒక్క కొత్తగూడ మండలంలోనే సుమారు 1800కు పైగా చెరువులున్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏలోని స్పెషల్ మైనర్ ఇరిగేషన్ డివిజన్లో 1,004కు పైగా చెరువులు ఉన్నాయి. ములుగు మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) డివిజన్లో మరో 800కు పైగా చెరువులున్నాయి. ఈ మండలాన్ని కేంద్రంగా చేసుకొని కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చెరువుల మరమ్మతుల పనులు ములుగు ఎంఐ డివిజన్‌తో పాటు స్పెషల్ ఎంఐ డివిజన్లు చేపట్టాయి. రెండు డివిజన్ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక డివిజన్లో టెండర్ పిలిచిన చెరువుకు మరో డివిజన్లో టెండర్లు నిర్వహించడంతో టెండర్లు వేసిన ఇద్దరు కాంట్రాక్టర్లు పరస్పర దాడులకు దిగారు. అధికార నేత అండ ఉన్న కాంట్రాక్టర్‌ను వదలి మరో కాంట్రాక్టర్‌ను జైలుకు పంపించారు. దీనిపై శాఖలో కలకలం రేపడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిర్చారు. ఈ వివాదం ఆలస్యంగా వెలుగు చూసింది. చేసిన వాటికే మళ్లీ... కొత్తగూడ మండలం ఎర్రవారం గ్రామంలోని ఎర్రకుంట చెరువు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో మిషన్–2లో నిధులు మంజూరు చేసింది. ఈ పనులను 30శాతానికి పైగా లెస్తో పొందిన కాంట్రాక్టర్ అగ్రిమెంటు చేసుకోలేదు. కాంట్రాక్టర్ అగ్రిమెంటు చేసుకోకుండానే కొంత మేరకు పనులు పూర్తి చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో అగ్రిమెంటు జాప్యం చేశాడంటూ సదరు కాంట్రాక్టర్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల బిల్లులు చేయలేమని ఇంజనీర్లు చెప్పారు. దీంతో ఈ చెరువు పనులకు జులై 19వ తేదీన ఈప్రొక్యూర్‌మెంట్ టెండర్ నిర్వహించేందుకు అన్లైన్లో పెట్టారు. కేవలం గంట వ్యవధిలోనే టెండర్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఆ డివిజన్ అధికారులు తమ వంతు పాత్ర పోషించారు. ఇది కాస్తా బయటకు పొక్కడంతో రద్దు చేసి మళ్లీ టెండర్ నిర్వహించారు. పనులు చేసినట్లు ఉంటే రద్దు చేస్తాం.... కొత్తగూడ మండలం ఎర్రకుంట పనులు చేసినట్లు విచారణలో తేలితే టెండర్ పెట్టినప్పటికీ రద్దు చేస్తామని స్పెషల్ ఎంఐ ఈఈ రాంప్రసాద్ తెలిపారు. ఈ చెరువు పనులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
‘మిషన్‌కు గండి’పై మంత్రి ఆగ్రహం
పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి తెగిన కట్టలను పునరుద్ధరించాలని ఆదేశం తాత్కాలికంగా బిల్లుల నిలిపివేత సాక్షి ప్రతినిధి, వరంగల్ : చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. దశల వారీగా జిల్లాలోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. అయితే కాంట్రాక్టర్ల కకుర్తి.. సాగునీటి శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ కాకతీయ పనులు జిల్లాలో నాసిరకంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాలోనే మిషన్ కాకతీయ పనులపై ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. సకాలంలో పనులు జరగకపోవడం.. చేసిన పనుల్లోనూ నాణ్యత లోపించడం వంటి కారణాలతో సాగునీటి శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన పలు చెరువులు ఇటీవల వర్షాలకు తెగిపోయాయి. హసన్‌పర్తి, మద్దూరు, మంగపేట మండలాల్లోని పలు చెరువుల కట్టలకు గండ్లు పడ్డాయి. నీటిని నిల్వ చేసేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ పనులు.. చెరువులు తెగిపోయేలా చేశాయని, నాసిరకం పనులతోనే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యతను పర్యవేక్షించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని పలువురు అధికారులే చెబుతున్నారు. నాణ్యతను పట్టించుకోకుండా అధికారులు పనులను రికార్డు చేసి, కాంట్రాక్టర్లుకు బిల్లులు మంజూరు చేస్తుండడం మన జిల్లాలోనే ఎక్కువగా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వర్షాలకు తెగిన చెరువుల పనులను చూసినా ఇదే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సాగునీటి శాఖ అధికారులపై ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. చెరువులు తెగిన విషయంపై అధికారులను మందలించినట్లు సమాచారం. నాసికరం పనులపై చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సాగునీటి శాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డిని హెచ్చరించినట్లు తెలిసింది. మిషన్ కాకతీయలో అభివృద్ధి చేసిన చెరువుల పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. మిషన్ కాకతీయ రెండో దశ టెండర్ల సమయంలోనూ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా పనుల నాణ్యత విషయంలోనూ అదే పరిస్థితి వచ్చింది. బిల్లుల చెల్లింపు నిలిపివేత.. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతను పట్టించుకోకుండా బిల్లులు మంజూరు చేస్తున్న విషయంలో ఆరోపణలు పెరుగుతుండడంతో రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించారు. పనుల నాణ్యతను పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతే బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. కట్టలు తెగిపోయిన చెరువుల పనులకు బిల్లులు చెల్లింపును నిలిపివేయాలని.. మళ్లీ పనులు చేయించిన తర్వాతే బిల్లుల మంజూరు విషయం పరిశీలించాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి వానలతో దెబ్బతిన్న మిషన్ కాకతీయ చెరువుల విషయం సాగునీటి శాఖ జిల్లా అధికారుల్లో ఆందోళన పెంచుతోంది. -
మిషన్ కాకతీయతో మిషన్లకే పని: చాడ
మహబూబ్‌నగర్: మిషన్ కాకతీయతో రైతులకు కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారికే ప్రయోజనం దక్కుతోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ ఊరచెరువు, మాదవయ్యకుంట, వడ్డె మాన్ సూరయ్య కుంట, వట్టెం రామన్న చెరువుల్లో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలోనే వాటర్‌షెడ్, గ్రామీణ అభివృద్ధి పథకాల ద్వారా చెరువుల అభివృద్ధి జరిగిందని, మిషన్ కాకతీయతో కేవలం మిషన్లకు పని కల్పించారే తప్ప కొత్తేగా ఒరిగిందేమీ లేదని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో జూలై 6నుంచి అన్ని ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు వివరించారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు ఈర్ల నర్సింహా, జిల్లా కార్యదర్శి బాల్నర్సింహఉన్నారు. -
చెన్నూరులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
చెన్నూరు:మిషన్ కాకతీయ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలోని మల్లబోయినకుంట, శెలువగుంట చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, చెన్నూరులో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఆదివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. -
మిషన్ కాకతీయ మరింత వేగమంతం
నిజామాబాద్: ‘మిషన్ కాకతీయ’ పనులు మరింత వేగవంతంగా సాగనున్నాయి. మొదటి దశలో 34 చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రెండు రోజుల కిందట రూ.14.95 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి శనివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు, నూతన ఇసుక పాలసీ, నాబార్డ్ లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రతీ చెరువును ప్రత్యక్షం గా పరిశీలించి, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మొదటి దశలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించినందుకు కలెక్టర్‌ను, అధికారులను అభినందించారు. కాకతీయ మిషన్ కార్యక్రమం అమలులో జిల్లా మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. అధికారుల భాగస్వామ్యం కీలకం మిషన్ కాకతీయ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఈ సంవత్సరం 20 శాతం పనులను చేపట్టాలని, ఇందులో అధికారులు, ప్రజల భాగస్వామ్యం ప్రధానమని చెప్పారు. చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల వివరాలనన్నింటినీ సమగ్రంగా రూపొందించాలని సూచించారు. చెరువుల పూడిక మట్టిని రైతులు తమ పొలాలలో చల్లుకొనే విధంగా కళాజాత ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన అన్ని పాఠశాలలలో ‘మిషన్ కాకతీయ’పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉంటే సత్వరమే రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పనిచేస్తున్న వివిధ ఏజెన్సీలకు అవసరమైన సమాచారంతోపాటు, పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పనులలో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో నడిచే పథకాలను వేగవంతం చేయాలని, తద్వారా ప్రపంచ బ్యాంకు మరికొన్ని అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందని తెలిపారు. చిన్న నీటిపారుదల, భారీ నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని వివరించారు. తక్షణమే ఇసుక రీచ్‌ల గుర్తింపు నూతన ఇసుక విధానంపై మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడికి సైతం ఇసుక ధరలు అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇసుక రీచ్‌లను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇసుక విక్రయాలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేపడతామన్నారు. నూతన ఇసుక విధానంపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. గనులు, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి, ఇసుక విక్రయాలలో పారదర్శకత పాటించాలన్నారు. ఇసుక నిల్వల కోసం స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తే వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 3,250 చెరువులు గుర్తించామని, వాటిలో ఈ సంవత్సరం 20 శాతం పనులను చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా 701 చెరువుల సర్వేను పూర్తి చేశామని, 437 చెరువులకు 318 చెరువుల అంచనా ప్రతిపాదనలను సమర్పించామని వివరించారు. 89 చెరువులకు మంజూరు లభించిందని, అందులో 67 పనులకు టెండర్లు పిలిపించామన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, మన్సూర్ పాల్గొన్నారు. జిల్లా నుంచి నీటిపారుదల ఎస్ఈ షకీ ల్ ఉర్ రహ్మన్, ఈఈ భూపాల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, సత్యశీల్‌రెడ్డి, డివిజన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.