చేసిన పనులకే మళ్లీ టెండర్‌ | tender again to already sanctioned works | Sakshi
Sakshi News home page

చేసిన పనులకే మళ్లీ టెండర్‌

Published Tue, Aug 2 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

కొత్తగూడ మండలంలో 2014లో ఉపాధిలో చేపట్టిన చెరువు

కొత్తగూడ మండలంలో 2014లో ఉపాధిలో చేపట్టిన చెరువు

  • ఒకే చెరువుకు రెండేసి ప్రతిపాదనలు
  • ఉపాధి హామీలో పనులు చేసిన చెరువులకు మళ్లీ మరమ్మతులు
  • కొత్తగూడ కేంద్రంగా అక్రమాల ‘మిషన్‌’
  • రెండు డివిజన్లతో పర్యవేక్షణలో లోపాలు
  • ఈ ఫొటోలో ఉన్నది కొత్తగూడ మండలం ఎర్రవారం గ్రామంలోని ఎర్రకుంట. దీని మరమ్మతు పనులు మిషన్‌ కాకతీయ రెండో విడతలో చేపట్టారు. అయితే కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ జాప్యం చేశాడంటూ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టి మళ్లీ టెండర్‌ పిలిచారు. ఈ పనులకు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్‌ టెండర్‌ వేసినప్పటికీ అతని పోటీగా అదే మండలానికి చెందిన మరో కాంట్రాక్టర్‌ 35.10శాతం లెస్‌కు టెండర్‌ దక్కించుకున్నాడు. ఎలాగూ పనులు గతంలో 50శాతం వరకు పూర్తయినట్లు ప్రచారం కావడంతో ఇంత తక్కువకు టెండర్‌ వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చెరువు పనులు ఉపాధి హామీ పథకంలో కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. మరి.. అధికారులు ఈ చెరువు పనులు చేయిస్తారో లేక గతంలో చేసిన పనులే కదా అని ఏకంగా బిల్లులు చేస్తారో చూడాలి.
     
    వరంగల్‌ : ఏజెన్సీ ప్రాంతంలో మిషన్‌ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల మరమ్మతు పనులు కాంట్రాక్టర్లకు సిరులు కురిపిస్తున్నాయి. మిషన్‌ కాకతీయకు ముందు త్రిబుల్‌ ఆర్‌ పథకం(రీస్టోర్, రిపేర్, రినోవేషన్‌), ఉపాధి హామీ పథకాల్లో చేపట్టిన పనులను మళ్లీ చేపట్టడంతో ఆ పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. 2014లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన చెరువు పనులను మళ్లీ మిషన్‌ కాకతీయ రెండో విడతలో చేపట్టారు. ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి కుంట, శంకరాజుపల్లి పైడి చెరువు, ఆకులవారి ఘనపురంలోని దయ్యాలకుంట, రాళ్లకుంట, పెద్ద వెంకటాపూర్‌లోని ఊరకుంట, చిన్నబోయినపల్లిలోని ఊరకుంటలకు మళ్లీ మరమ్మతులు చేపట్టారు. ఇదే విధంగా పలు మండలాల్లో చెరువులకు మళ్లీ టెండర్లు పిలవడంతో అక్రమాలు పెరిగిపోయాయి. 
     
    కొత్తగూడలో అక్రమాలు కోకొల్లలు...
    అటవీ ప్రాంతమైన ఒక్క కొత్తగూడ మండలంలోనే సుమారు 1800కు పైగా చెరువులున్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏలోని స్పెషల్‌ మైనర్‌ ఇరిగేషన్‌ డివిజన్‌లో 1,004కు పైగా చెరువులు ఉన్నాయి. ములుగు మైనర్‌ ఇరిగేషన్‌ (ఎంఐ) డివిజన్‌లో మరో 800కు పైగా చెరువులున్నాయి. ఈ మండలాన్ని కేంద్రంగా చేసుకొని కాంట్రాక్టర్లు  అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చెరువుల మరమ్మతుల పనులు ములుగు ఎంఐ డివిజన్‌తో పాటు స్పెషల్‌ ఎంఐ డివిజన్‌లు చేపట్టాయి. రెండు డివిజన్ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక డివిజన్‌లో టెండర్‌ పిలిచిన చెరువుకు మరో డివిజన్‌లో టెండర్లు నిర్వహించడంతో టెండర్లు వేసిన ఇద్దరు కాంట్రాక్టర్లు పరస్పర దాడులకు దిగారు. అధికార నేత అండ ఉన్న కాంట్రాక్టర్‌ను వదలి మరో కాంట్రాక్టర్‌ను జైలుకు పంపించారు. దీనిపై శాఖలో కలకలం రేపడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిర్చారు. ఈ వివాదం ఆలస్యంగా వెలుగు చూసింది. 
     
    చేసిన వాటికే మళ్లీ...
    కొత్తగూడ మండలం ఎర్రవారం గ్రామంలోని ఎర్రకుంట చెరువు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో మిషన్‌–2లో నిధులు మంజూరు చేసింది. ఈ పనులను 30శాతానికి పైగా లెస్‌తో పొందిన కాంట్రాక్టర్‌ అగ్రిమెంటు చేసుకోలేదు. కాంట్రాక్టర్‌ అగ్రిమెంటు చేసుకోకుండానే కొంత మేరకు పనులు పూర్తి చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో అగ్రిమెంటు జాప్యం చేశాడంటూ సదరు కాంట్రాక్టర్‌ను అధికారులు బ్లాక్‌ లిస్టులో పెట్టారు. బ్లాక్‌ లిస్టులో పెట్టడం వల్ల బిల్లులు చేయలేమని ఇంజనీర్లు చెప్పారు. దీంతో ఈ చెరువు పనులకు జులై 19వ తేదీన ఈప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ నిర్వహించేందుకు అన్‌లైన్‌లో పెట్టారు. కేవలం గంట వ్యవధిలోనే టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఆ డివిజన్‌ అధికారులు తమ వంతు పాత్ర పోషించారు. ఇది కాస్తా బయటకు పొక్కడంతో రద్దు చేసి మళ్లీ టెండర్‌ నిర్వహించారు.
     
    పనులు చేసినట్లు ఉంటే రద్దు చేస్తాం....
    కొత్తగూడ మండలం ఎర్రకుంట పనులు చేసినట్లు విచారణలో తేలితే టెండర్‌ పెట్టినప్పటికీ రద్దు చేస్తామని స్పెషల్‌ ఎంఐ ఈఈ రాంప్రసాద్‌ తెలిపారు. ఈ చెరువు పనులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement