మిషన్ కాకతీయతో మిషన్లకే పని: చాడ
మహబూబ్‌నగర్: మిషన్ కాకతీయతో రైతులకు కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారికే ప్రయోజనం దక్కుతోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ ఊరచెరువు, మాదవయ్యకుంట, వడ్డె మాన్ సూరయ్య కుంట, వట్టెం రామన్న చెరువుల్లో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గత ప్రభుత్వాల హయాంలోనే వాటర్‌షెడ్, గ్రామీణ అభివృద్ధి పథకాల ద్వారా చెరువుల అభివృద్ధి జరిగిందని, మిషన్ కాకతీయతో కేవలం మిషన్లకు పని కల్పించారే తప్ప కొత్తేగా ఒరిగిందేమీ లేదని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో జూలై 6నుంచి అన్ని ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు వివరించారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు ఈర్ల నర్సింహా, జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహఉన్నారు.