
చెరువుకు జీవకళ
నిజామాబాద్: రాష్ట్రంలోని రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే ‘మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ)’ పథకం ఒక పవిత్ర యజ్ఞమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో ధ్వంసమైన మన చెరువులను పునరుద్ధరించుకొనేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువులో ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం చెరువులోనే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.
ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం..
‘‘కాకతీయ రాజులు 80 వేల గొలుసుకట్టు చెరువులు తవ్వించిండ్రు. తర్వాత వచ్చిన కులీకుతుబ్‌షా, నిజాముల కాలంలోనూ గొలుసు చెరువులకు ప్రాధాన్యం ఇచ్చి 15-16 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లిచ్చిండ్రు. ఇప్పుడా పరిస్థితి లేదు. దురదృష్టమేందంటే, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఆ పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో చెరువుల విధ్వంసం జరిగింది’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ 60 ఏళ్ల లో మన చెరువుల్లో ఏడడుగుల మేర పూడిక చేరిందని చెప్పారు. పూడికను పంట పొలాలకు తీసుకెళ్లాల్సిన రైతులూ నిర్లక్ష్యం చేయడంతో చెరువులు నిరాదరణకు గురయ్యాయని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ ఆవశ్యంగా భావించి, వాటి వివరాలను ఆఘమేఘాలపై తెప్పించుకొని ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టామని కేసీఆర్ తెలిపారు.
ఒక్క ఏడాది వానలు పడితే..
రాష్ట్రవ్యాప్తంగా 46 వేల పైచిలుకు చెరువుల్లో పూర్తిస్థాయిలో పూడిక తీసే కార్యక్రమం పూర్తయితే... ఒక ఏడాది వర్షాలు పడితే చాలని, మూడేళ్ల వరకు కరువు రాకుండా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘చెరువుల పనులను అప్పగించడంలో పారదర్శకంగా ఉంటాం. గతంలో ఎవరైనా దొంగబిల్లులు పెట్టిన దొంగ కాంట్రాక్టర్లుంటే వారిని బ్లాక్‌లిస్టులో పెడతాం. ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా టెండర్లుంటాయి. ఎంతో పవిత్రంగా భావించిన ఈ యజ్ఞంలో కాంట్రాక్టర్లు అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే జైలుకు పంపుతాం..’’ అని సీఎం స్పష్టం చేశారు.
ఉద్యమ స్ఫూర్తితో పాటు పడాలి..
ఉద్యమించి, తెగించి రాష్ట్రాన్ని సాధించుకున్న విధంగానే అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూడా పాటుపడితే మేలు జరుగుతుందని చంద్రశేఖర్‌రావు సూచించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే చెరువుల పునరుద్ధరణ చేపడతానని హామీ ఇచ్చినట్లు సీఎం గుర్తు చేశారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చేందుకు రూ. 40 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 15 వేల కోట్లతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ‘లబాన్ లంబాడీ (కాగితి లంబాడీ)’ తెగలకు చెందిన వారిని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చుతామని, ఇందుకోసం ఒక కమిటీ వేస్తామని ప్రకటించారు. బంగారు తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ఇచ్చిన హామీలన్నింటినీ తల తెగిపడినా సరే నెరవేరుస్తానని ఉద్ఘాటించారు.
కామారెడ్డిని జిల్లా చేస్తా..
కామారెడ్డిని తప్పనిసరిగా జిల్లాగా మారుస్తానని, తానే వచ్చి పునాది రాయి వేస్తానని సీఎం చెప్పారు. నియోజకవర్గాల విభజన జరిగితే నిజామాబాద్ జిల్లాలో ఆరేడు, కామారెడ్డిలో ఆరేడు నియోజకవర్గాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొందరు నిరుద్యోగులు డీఎస్సీ గురించి ప్రకటన చేయాలని కోరగా... డీఎస్సీ ఉండదని కేసీఆర్ అన్నారు.
షబ్బీర్ అలీ చెల్లని నోటు..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెల్లని నోటని కేసీఆర్ విమర్శించారు. ‘‘మీకు తెలుసు పోయిన ఎన్నికల్లో ఆ నోటు కామారెడ్డిలో చెల్లలే, ఎల్లారెడ్డిలో చెల్లలే.. ఢిల్లీలో సోనియాగాంధీ ఇంట్లో మాత్రం చెల్లింది. అందుకే ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన కూడ ఇప్పుడు సొల్లు ముచ్చట్లు, పిచ్చి మాటలు మాట్లాడుతుండు. మీ (కాంగ్రెస్ ప్రభుత్వ) హయూంలో పింఛన్లు రూ. 200 ఇస్తే.. మా హయూంలో రూ. 1,000 ఇస్తున్నం. కల్యాణలక్ష్మి ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రూ. 51 వేలు ఇస్తున్నాం. ఇవన్నీ నీకు కనిపిస్త లేవా షబ్బీర్ అలీ.. అభివృద్ధిని ఆకాంక్షిస్తే తమ వంతుగా సహకరించండి. సూచనలు ఇవ్వండి. అంతేగాని సొల్లు పురాణాలు చెబుతూ పిచ్చిగా మాట్లాడకు’’ అని సీఎం మండిపడ్డారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్, జెడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యత ప్రజా ప్రతినిధులదే..
‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం రాష్ట్రంలో ఉద్యమంలా, పవిత్రయజ్ఞంలా సాగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పాలు పంచుకోవాలని.. అవసరమైతే చెరువుల వద్దే టెంట్లు వేసుకొని, అక్కడే భోజనాలు చేసి పడుకోవాలని కేసీఆర్ సూచించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయం గా పూడికతీత పనులను పర్యవేక్షించాలని... అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలెవరూ హైదరాబాద్‌లో కనపడవద్దని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా వచ్చే ఏడాదికల్లా పాత చెరువులన్నీ నీళ్లతో కళకళలాడాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువుగట్టుపై ఈతచెట్లను నాటితే ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ చెట్లు ఎదిగితే మంచి ఈతకల్లు వచ్చి మందు కల్లు బాధ కూడా పోతుందని వ్యాఖ్యానించారు.
చరిత్రపుటల్లో నిలుస్తుంది: హరీశ్‌రావు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేపట్టిన మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞంలో నీరడి (చెరువుల నుంచి కాలువలు, పొలాలకు నీటి విడుదల చేసే ఉద్యోగి)లా ఉంటానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుల పొలాలకు నీరందించేందుకు నీరడిలు ఎలా పనిచేస్తారో.. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ పంట పొలాలకు తరలించే పవిత్ర కార్యక్రమానికి తాను అలాగే పనిచేస్తానని చెప్పారు. ‘మిషన్ కాకతీయ’ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘చెరువు మన తల్లిలాంటిదని, ఇలాంటి చెరువులను పునరుద్ధరించాలని కాపాడాలని భావించిన కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టారు. ఈ పవిత్ర యజ్ఞం చరిత్ర పుటల్లో నిలిచి పోతుంది. దీనిద్వారా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తున్నారు. నాకు అప్పగించిన బాధ్యతలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు చెరువుల వద్ద నీరడిగా కాపలా కాస్తాను.. రాష్ట్రంలో 46,447 చెరువులుంటే మొదటి దశలో 9,573 చెరువుల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నాం. 2,210 చెరువులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు కేసీఆర్ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా..’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.