మిషన్ కాకతీయ అమలులో భాగంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణపై...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిషన్ కాకతీయ అమలులో భాగంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణపై శనివారం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జెడ్పీలో జరిగే ఈ సమావేశంలో జెడ్పీ పాలకవర్గం పాల్గొననుంది. తొలివిడత 545 చెరువులను పునరుద్ధరించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం జరిగే సమావేశంలో ప్రణాళికపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటారు.
ఈ క్రమంలో సమావేశంలో చర్చించే అంశాలపై శుక్రవారం కలెక్టర్ ఎన్.శ్రీధర్ తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో పూడిక తీసిన అనంతరం ఆ మట్టిని రైతుల పొలాల్లో వేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చెరువుల సర్వే త్వరితంగా పూర్తిచేసి అంచనాలకు వెంటనే మంజూరు తీసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చక్రధర్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు భీంప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.