బోయినపల్లి : జిల్లాలో మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది 1188 చెరువులు అభివృద్ధి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు లక్ష్యం విధించుకోగా ఇప్పటివరకు 355 చెరువుల్లో మాత్రమే పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం ప్రారంభంలోపు పనులు పూర్తికావాల్సి ఉండగా కొన్ని చెరువుల అంచనాలే పూర్తి కాలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం జిల్లాలో 1088 చెరువుల సర్వే పూర్తికాగా, 571 చెరువులకు టెండర్లు పిలిచారు. వీటిలో ఆర్‌ఆర్‌ఆర్ (రిజిస్ట్రేషన్, రెనోవేషన్) పథకం చెరువులు 113 ఉన్నాయి.
మరో నెలన్నర, రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో ఇంకా 733 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఏప్రిల్ నెలాఖరు వరకు రూ.262 కోట్లతో 721 చెరువులకు పరిపాలన అనుమతి లభించింది. పరిపాలన అనుమతి పొందిన చెరువుల ఆయకట్టు 71,158 ఎకరాలు. ఇందులో 571 చెరువులకు అధికారులు టెండర్లు పిలిచారు. అంచనాలు పూర్తయి రూ.376 కోట్లతో 933 చెరువులు సీఈ ఆమోదం కోసం ఉన్నాయి. వీటి ఆయకట్టు లక్షా 8 వేల ఎకరాలు. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్ పథకం కింద 60 చెరువు పనులు ఉన్నాయి. ఇంకా జిల్లాలో దాదాపు 319 చెరువులకు అధికారులు టెండర్లు పిలవాల్సి ఉంది.
తీసిన పూడిక 6 లక్షల క్యూబిక్ మీటర్లపైనే...
జిల్లాలో ఇప్పటివరకు పనులు ప్రారంభించిన 355 చెరువులనుంచి ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక మట్టిని తీశారు. ఈ మట్టిని కొంతమంది రైతులు పొలా ల్లో పోసుకోగా, కొన్ని చోట్ల ఇటుక బట్టీలకు, మరికొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారు. చెరువు పనుల కోసం జిల్లాలో కొత్తగా 50 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను అధికారులు నియమించారు. వీరు నిత్యం చెరువుల పూడికతీత జరుగుతున్న ప్రదేశాల్లో సర్వే పనులు, క్షేత్రస్థారుులో పనుల పరిశీలన చేపడుతున్నా రు. పనులు ఇలాగే ఆలస్యమైతే వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తవడం కష్టం కావడంతో పనులు వేగవంతం చేయూలని నీటిపారుదల శాఖ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కష్టమవుతున్న సర్వే
జిల్లాలో అధికారులు గుర్తించిన చెరువుల్లో సర్వే చేసి అంచనాలు తయారు చేయడానికి అధికారులకు చాలా సమయం పట్టినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ముళ్ల చెట్లు, పిచ్చిచెట్లతో చెరువుల్లో కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. అటువంటి చెరువులను గుర్తించి వాటిలో ఉన్న ముళ్ల, పిచ్చి చెట్లలో సర్వే చేసే సరికి అధికారులకు తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిసింది.
పూడిక మట్టిపై అవగాహన కరువు
జిల్లాలోని చెరువుల నుంచి తీస్తున్న పూడిక మట్టి సారవంతమైనదని ఇక్రిశాట్ వారు గుర్తించారని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ ఈ నెల 10న కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మిషన్ కాకతీయ అమలు, పర్యవేక్షణ కమిటీ సమీక్షలో వెల్లడించారు. రైతులు చెరువుల పూడిక మట్టి తీసుకునేలా 2 లక్షల కరపత్రాలు ముద్రించి ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు, ఎంపీడీవోలు, ఏఈలు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. పూడిక మట్టి వేస్తే నేల సారవంతమవుతుంది. కానీ, చాలా చోట్ల రైతులు ఈ మట్టిని పొలాల్లోకి తరలించుకోవడం లేదు.
మిషన్ స్పీడ్ పెంచాల్సిందే
Published Sat, May 2 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement