మియాపూర్ డిపోకు మరో నాలుగు మెట్రో రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ మెట్రో రైలు డిపోకు మరో నాలుగు మెట్రో రైళ్లు శుక్రవారం రాత్రి పొద్దుపోయాక చేరుకున్నట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి. దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ తయారు చేసిన ఈ రైళ్లు సముద్ర మార్గంలో భారీ నౌకల ద్వారా చెన్నై పోర్టుకు, అక్కడి నుంచి భారీ ట్రక్కుల ద్వారా నగరానికి చేరుకున్నాయి.
ఉప్పల్ డిపోలో సిద్ధంగా ఉన్న ఏడు మెట్రో రైళ్లకు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ డిపోలో మరో మూడు రైళ్లు ఉన్నాయి. తాజాగా శుక్రవారం సిటీకి చేరుకున్న 4 మెట్రో రైళ్లు మియాపూర్ డిపోకు చేరాయి. 2015 మార్చి నాటికి మొత్తంగా 14 రైళ్లు నాగోల్-మెట్టుగూడ, ఎస్.ఆర్.నగర్-మియాపూర్ (ఒక్కో రూట్లో ఏడు చొప్పున) మార్గంలో రాకపోకలు సాగిస్తాయని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.